ఆవేశం క్షణికం.. ఆవేదన శాశ్వతం | College And School Students Got Depressed Suicides Srikakulam | Sakshi
Sakshi News home page

ఆవేశం క్షణికం.. ఆవేదన శాశ్వతం

Published Tue, May 17 2022 8:14 AM | Last Updated on Tue, May 17 2022 1:59 PM

College And School Students Got Depressed Suicides Srikakulam - Sakshi

ఆయుష్షు ఇంకా ఉందని తెలిసినా అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు. సమస్యలు శాశ్వతం కాదని తెలిసినా పరిష్కారం వెతకలేక ఊపిరి ఆపుకుంటున్నారు. క్షణికమైన ఆవేశంలో నిర్ణయాలను తీసుకుని అయిన వారికి శాశ్వతమైన వేదన మిగులుస్తున్నారు. కష్టాలను ఎదుర్కోలేని బలహీనత, బాధలను భరించలేని నిస్సహాయత, ఆలోచనలను అదుపు చేసుకోలేని మనస్తత్వం.. కలగలిపి ఆత్మహత్య అనే విపరీత నిర్ణయాలను తీసుకుంటున్నారు. జిల్లాలో ఈ తరహా ఘటనలు పెరుగుతుండడం ఆందోళన కలిగించే విషయం.  

ఎచ్చెర్ల క్యాంపస్‌: హైస్కూల్‌ పిల్లల నుంచి మధ్య తరగతి ఇంటి యజమానుల వరకు, బాలికల దగ్గర నుంచి తల్లుల వరకు అందరూ ఈ భూతానికి బాధితులే. జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న వారి జాబితా పరిశీలిస్తే.. ఆడ, మగ బేధం లేకుండా అందరి చావు కేకలు వినిపిస్తాయి. అందరి మరణాల వెనుక కారణాలు వేరైనా వారిని ఉసిగొల్పిన మానసిక భావన మాత్రం ‘క్షణికావేశం’. దీన్ని అధిగమించగలిగితే బతుకులు బాగు పడతాయని వైద్య నిపుణులు, మానసిక వేత్తలు సూచిస్తున్నారు.    

వీరంతా బతకాల్సిన వారే.. 
►జిల్లాలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న వారి వివరాలు పరిశీలిస్తే.. అందరి సమస్యలకు పరిష్కారం ఉందని స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఆ నిజాన్ని వారే తెలుసుకోలేకపోయారు. కుటుంబంతో కలిసి హాయిగా జీవించేందుకు అన్ని అవకాశాలు, అర్హతలు ఉన్నా చావు దారిని ఎంచుకున్నారు. ఎచ్చెర్ల అంబేడ్కర్‌ గురుకులంలో ఓ విద్యార్థిని చిన్న వ్యక్తిగత కారణంతో ఉరి వేసుకుని చనిపోయింది. కుమార్తెపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు వేదన మాత్రమే మిగిలింది. 
►ఎస్‌ఎం పురం ఏపీ గురుకులంలో 10వ తరగతి విద్యార్థి ఓ ప్రత్యేక పరీక్ష సరిగా రాయలేదని, జవాబు పత్రం మార్చేద్దామని ప్రయత్నించి పట్టుబడ్డాడు. ఈ అవమాన భారం భరించలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. చిన్న తప్పునకు పెద్ద శిక్ష విధించుకున్నాడు. 
► చిలకపాలెం సమీపంలో ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఓ విద్యార్థి తన పరీక్షను స్నేహితుడితో రాయించాడు. ఇది సిబ్బందికి తెలిసి విచారణ చేయించారు. దీన్ని అవమానంగా భావించిన విద్యార్థి ట్రైన్‌ కింద పడి మృతి చెందాడు. విచారణను ఎదుర్కొని ధైర్యంగా ముందుకెళ్లి ఉంటే తల్లిదండ్రులకు వేదన మిగిలేదని కాదని తోటి విద్యార్థులు అంటున్నారు. 
► శ్రీకాకుళం రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ప్రీయూనివర్సిటీ కోర్సు మొదటి సంవత్సరం విద్యార్థిని హాస్టల్‌లో ఉరి వేసుకుంది. ఈ అమ్మాయి చావు వెనుక కారణం కేవలం హోమ్‌ సిక్‌నెస్‌. ఇంటిని వద్దలి ఉండలేక ఏకంగా ప్రాణాలే వదిలేసింది. 
 ► ఓ ఇంజినీరింగ్‌ కాలేజీలో ఓ విద్యార్థి తనకు నచ్చని కోర్సులో జాయిన్‌ చేశారని ఏకంగా పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అమ్మానాన్నలతో ఓ క్షణం మాట్లాడినా, వేరే ఆలోచన చేసి ఉన్నా ఈ రోజుకు విద్యార్థి నవ్వు తూ తిరిగేవాడని స్నేహితులు చెబుతున్నారు.  
 ► యలమంచిలిలో అప్పులు, ఆస్తులపై బెంగ పెట్టుకున్న ఓ తల్లి తాను ఆత్మహత్యకు పాల్పడడమే కాకుండా ముగ్గురు పిల్లలను కూడా తనతో తీసుకెళ్లిపోవాలని నిర్ణయించుకుని పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.  

తల్లిదండ్రులు చూడాలి 
పిల్లల భవిష్యత్‌ను తీర్చిదిద్దటంలో తల్లిదండ్రుల పాత్ర కీలకం. పిల్లల శక్తి సామర్థ్యాలు అంచనా వేసి వారికి నచ్చిన కోర్సుల్లో చేర్చాలి. సొంత ఇష్టాలను పిల్లలపైరుద్దకూడదు.విద్యార్థుల్లో మాన సిక ఒత్తిడి వల్ల ప్రతికూల ఆలోచనలు వస్తాయి. 
 – ప్రొఫెసర్‌ నిమ్మ వెంకటరావు, వైస్‌ చాన్స్‌లర్, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం  

ప్రతికూల ఆలోచనలు వద్దు 
14–20 ఏళ్ల మధ్య ఉన్న వారిలో ఎక్కువగా ప్రతికూల ఆలోచనలు వస్తాయి. దీంతో మానసిక సంఘర్షణ తట్టుకోలేక విపరీత నిర్ణయా లు తీసుకుంటారు. ఆ క్షణంలో ఆత్మహత్య నిర్ణ యం వెనక్కి తీసుకుంటే మళ్లీ ఆ ఆలోచన రాదు. ఇలాంటి వారిని గుర్తించాలి. వారిని ఒంటరిగా వదలకూడదు. విద్యా సంస్థల్లో కౌన్సెలింగ్‌ కేంద్రాల నిర్వహణ కీలకం. 
– డాక్టర్‌ జేఎల్‌ సంధ్యారాణి, సైకాలజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్, కౌన్సిలర్‌ డాక్టర్‌ బీఆర్‌ఏయూ

చదవండి: వివస్త్రను చేసి.. కళ్లల్లో, నోట్లో హిట్‌ కొట్టి...

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement