‘తెర’గతుల్లో సవాళ్లు!  | 30 Percent Of Students Do Not Attend Online Classes | Sakshi
Sakshi News home page

‘తెర’గతుల్లో సవాళ్లు! 

Published Thu, Aug 27 2020 12:02 PM | Last Updated on Thu, Aug 27 2020 12:02 PM

30 Percent Of Students Do Not Attend Online Classes - Sakshi

ఆన్‌లైన్‌ క్లాస్‌ వింటున్న విద్యార్థిని

కోవిడ్‌–19 వైరస్‌ విద్యా రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. క్లాసుల నిర్వహణకు ప్రత్యామ్నాయ పద్ధతులు అన్వేషిస్తున్నా.. అందులోనూ సవాళ్లు ఎదురవుతున్నాయి. తరగతి గదిలో క్లాసులు నిర్వహించే వీల్లేక చాలా విద్యా సంస్థలు ఆన్‌లైన్‌లోనే క్లాసులు చెప్పడం మొదలుపెట్టాయి. అయితే ఈ విధానంలోనూ సమస్యలు ఎదురవుతున్నాయి. విద్యార్థులు హాజరు కాకపోవడం, ఏజెన్సీ, మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి నెట్‌ సదుపాయం లేకపోవడం, మరికొందరికి సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతుండడంతో దాదాపు 30 శాతం మంది విద్యార్థులు ఈ ‘తెర’గతులకు గైర్హాజరవుతున్నారు.  

ఎచ్చెర్ల క్యాంపస్‌: కరోనా ప్రభావం విద్యా రంగంపై తీవ్రంగానే పడింది. ఈ నేపథ్యంలో విద్యా సంస్థలు డిజిటల్‌ విధానానికి ప్రాధాన్యమి స్తున్నాయి. ఉన్నత విద్య నుంచి ప్రాథమిక విద్య వరకు ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే చా లా మంది విద్యార్థులకు ఈ విధానం వల్ల కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. సాంకేతిక సమస్యలు, విద్యార్థుల ఆర్థిక ఇబ్బందులు ప్రధాన సమస్యలుగా ప్రస్తావించవచ్చు. ప్రస్తుతం ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఆన్‌లైన్‌ విద్యా విధానం కొనసాగుతోంది. జవహల్‌ లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం తప్పనిసరిగా డిజిటల్‌ పద్ధతిలో పాఠాలు కొనసాగించాలని స్పష్టం చేసింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం, అఫి లియేషన్‌ కళాశాలల్లో, రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో, ప్రాథమిక విద్యలో ప్రైవేట్‌ పాఠశాలు డిజిటల్‌ వేదికగా ఆన్‌లైన్‌ తరగతులు కొనసాగిస్తున్నాయి. ఉన్నత విద్యలో సెమిస్టర్‌లో 100 నుంచి 120 మధ్య తరగతులు నిర్వహించాల్సి ఉంటుంది.

దీంతో 2020–21 విద్యా సంవత్సరం గాడిలో పెట్టాలంటే డిజిటల్‌ విద్యా విధానం తప్పనిసరి అని అధికారులు విశ్లేషిస్తున్నారు. మరో పక్క ఈ విధానంలో అధ్యాపకుల ఇళ్ల నుంచి పాఠాలు చెప్పవచ్చు. ప్రస్తుతం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం వంటి సంస్థల్లో బోధన సిబ్బంది వర్సిటీలకు రావటం లేదు. కోవిడ్‌ భయం అన్న కారణంతో వీరు వర్సిటీ ముఖం చూడటం లేదు. దీంతో ఇళ్ల నుంచి పాఠాలు చెబుతున్నారు. అయితే ఆన్‌లైన్‌ త రగతులు కొందరికే పరిమితం కావటం ప్రధాన సమస్యగా ఉంది. ఆన్‌లైన్‌ విద్యా విధానంపై నేషనల్‌ కౌన్సెల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్, నేషనల్‌ కౌన్సెల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ వంటి సంస్థలు సైతం అధ్యయనం చేశాయి. సుమారు 30 శాతం మంది విద్యార్థులు డిజిటల్‌ విద్య చేరువ కావటం లేదని వీరు విశ్లేషించారు. అయినా విద్యా సంస్థలు ప్రత్నామ్నాయ మార్గాలు లేక గూగుల్‌ మీటింట్, జూమ్‌ మీటింగ్‌ వంటి యాప్‌లు ఆధారంగా డిజిటల్‌ విద్యా విధానం కొనసాగిస్తున్నారు. 

గ్రామీణ ప్రాంతాల్లో.. 
ప్రధానంగా జిల్లాలోని చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా 4జీ సేవలు విస్తరించలేదు. మరో పక్క పట్టణ ప్రాంతాలకు ఐదు కిలోమీటర్లు పరిధి దాటి సైతం నెట్‌ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండటం లేదు. ప్రధానంగా నెట్‌ విషయంలో విద్యార్థులు ఎక్కువగా జియో, ఎయిర్‌టెల్‌ వంటి వాటిపై ఆధారపడుతున్నారు. నెట్‌వర్క్‌ సమస్యలు ఉన్న గ్రామాల్లో తరగతులు అటకెక్కుతున్నాయి. మరో పక్క డిజిటల్‌ విద్యా విధానంలో ఆన్‌లైన్‌ తరగతులు వినాలంటే ల్యాప్‌టాప్, కంప్యూటర్, ట్యాబ్, ఆండ్రాయిడ్, స్మార్ట్‌ ఫోన్‌ వంటివి ఉండాలి. చాలా మంది విద్యార్థులు సమకూర్చుకోలేకపోతున్నారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోవటం ప్రధాన సమస్య. వీరికోసం ఆలోచించాల్సిన అవసరం ఉంది.  

మార్పులు తప్పనిసరి
ఆన్‌లైన్‌ విధానం విస్తరిస్తోంది. భవిష్యత్‌లో ఇది కీలకం కానుంది. పీజీ, డిగ్రీ, పోటీ పరీక్షలకు సంబంధించిన కోచింగ్‌లు అన్నీ ఆన్‌లైన్‌లోనే ఉండొచ్చు. ఢిల్లీలో ఉన్న సబ్జెక్టు నిపుణులు శ్రీకాకుళం విద్యార్థికి శిక్షణ ఇవ్వవచ్చు. అందుకే ఈ విధానానికి అలవాటు పడాలి. దీనికోసం అవసరమయ్యే సామగ్రిని సమకూర్చుకోవడం తప్పనిసరి. ప్రస్తుతం 2020–21 విద్యా సంవత్సరం గాడిలో పెట్టాలంటే డిజిటల్‌ విద్యా విధానానికి మించి ప్రత్యామ్నాయం లేదు. 
 – ప్రొఫెసర్‌ కూన రామ్‌జీ, వైస్‌ చాన్స్‌లర్, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం  

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇబ్బందులు
ప్రస్తుతం డిజిటల్‌ విద్యా విధానంలో తరగతులు కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతా ల్లో ఇంటర్నెట్‌ సమస్య, విద్యార్థుల వద్ద అవసరమైన పరికరాలు లేకపోవడం ప్రధాన సమస్యగా ఉంది. భవిష్యత్‌లో డిజిటల్‌ విద్యావిధానానికి అలవాటు పడాల్సి ఉంటుంది. ప్రాథమిక విద్య నుంచి కొన్ని తరగతులు డిజిటల్‌లో కొనసాగిస్తూ విద్యార్థులకు అలవాటు చేయాలి. కరోనా అన్ని రంగాలపై ప్రభావం చూపింది. 
 – ప్రొఫెసర్‌ గుంట తులసీరావు, డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్స్, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement