స్కూలు నిండుగా ఉపాధ్యాయులు ఉంటేనే ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు అరకొరగా ఉంటాయనే అభిప్రాయం చాలామందిలో ఉంది. అలాంటిది ఒకే ఉపాధ్యాయుడు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పాఠశాలల్లో ఉపాధ్యాయుడు సెలవు పెడితే పిల్లలకూ సెలవే. జిల్లాలో 2,593 ప్రాథమిక పాఠశాలలు ఉండగా, ఇందులో 716 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల ఉపాధ్యాయులు అప్పుడప్పుడూ స్కూలు పనుల మీద బయటకు వెళ్లాల్సి ఉంటుంది. దీనిపై ఆయన ఎంఈఓకు సమాచారం ఇస్తే, వేరొక టీచర్‌ను డిప్యుటేషన్‌పైన పంపిస్తారు. పొరపాటున సమాచారం అందకపోతే ఆ రోజుకు స్కూలుకు సెలవే.
► ఏకోపాధ్యాయ పాఠశాలల్లో తగ్గుతున్న విద్యార్థులు
►మూత పడుతున్న పాఠశాలలు
► ఆందోళనలో ఉపాధ్యాయులు
► స్పందించని నాయకులు
వీరఘట్టం: ఏకోపాధ్యాయ పాఠశాలల పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారైంది. వీటి గురించి ఆలోచన చేసేవారే లేకుండా పోయారు. దీంతో ఈ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గుతోంది.
జిల్లాలో పరిస్థితి
జిల్లాలో 716 సింగిల్ టీచర్ పాఠశాలలు ఉన్నాయి. సుమారు ఎనిమిది వేలమంది విద్యార్థులు ఈ ఏడాది విద్యనభ్యసిస్తున్నారు. అలాగే అసలు ఉపాధ్యాయులే లేని పాఠశాలలు 122 ఉన్నాయి. ఈ పాఠశాలల్లో సుమారు 1000కి పైబడి విద్యార్థులు ఉన్నారు. వీరఘట్టం మండలంలో పాపంపేట, కుంబిడి, కొంచ, జె.గోపాలపురం గ్రామాల్లో సింగిల్ టీచర్ పాఠశాలలు ఉన్నాయి.
గదబవలస, శంగరాయిపురం, గాదెలంక, సింధునగరం తదితర గ్రామాల్లో పలు కారణాలతో పాఠశాలలు మూతపడ్డాయి. విద్యార్థుల శాతం తగ్గడం, ఏకోపాధ్యాయులు బదిలీపై వెళ్లడం, ఖాళీ స్థానాలకు కొత్తగా ఉపాధ్యాయులు ఎవరూ రాకపోవడంతో ఆ పాఠశాలలు ప్రస్తుతం పూర్తిగా మూతపడ్డాయి. దీంతో ఈ గ్రామాలకు చెందిన విద్యార్థులకు విద్య అందని ద్రాక్షలా మారింది.
బడికి తాళం పడాల్సిందే.... ప్రభుత్వం ప్రవేశపెట్టే పలు పథకాలు, ఇతర కార్యక్రమాలు, శిక్షణ తరగతులు, పరీక్షలంటూ నెలలో నాలుగైదు రోజులు మండల కేంద్రాలకు ఉపాధ్యాయులు వెళ్లాల్సి ఉంటుంది. ఆ సమయంలో మరొకరిని ఏర్పాటు చేసుకొనేందుకు ఒక్కోసారి ఉపాధ్యాయులు అందుబాటులో ఉండడం లేదు. అలాంటి సమయంలో పాఠశాలకు తాళం వేయాల్సిన పరిస్థితి. ఈ కారణంతోనే ఏకోపాధ్యాయ పాఠశాలల్లో పిల్లలను చేర్చేందుకు తల్లిదండ్రులు వెనకడుగు వేస్తున్నారు.
ఫలితంగా ప్రతీ ఏడాది ఈ పాఠశాలల్లో పిల్ల్లల సంఖ్య తగ్గుతుండడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. సర్కారు విద్య బలోపేతానికి పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులను నియమించాలని ప్రజలు కోరుతున్నారు.
సింగిల్ టీచర్ల ఖాళీలను భర్తీ చేస్తాం.. సింగిల్ టీచర్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపడుతున్నాం. విద్యార్థుల సంఖ్య పెరిగితే ఉపాధ్యాయ పోస్టులు మంజూరవుతాయి. విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు తరచూ ఉపాధ్యాయులు గ్రామసర్పంచ్, గ్రామపెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు.
– వి.ఎస్.సుబ్బారావు, జిల్లా విద్యాశాఖాధికారి