asitation
-
హాస్టళ్లలో సమస్యలు తీర్చకుంటే ఉద్యమం
వైఎస్సార్ సీపీ నేతలు మేరుగ నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి కొరిటెపాడు(గుంటూరు) ఎస్సీ సోషల్ వెల్ఫేర్, స్టూడెంట్స్ మేనేజ్మెంట్స్ హాస్టళ్లలో వసతులు దయనీయంగా ఉన్నాయని, వసతులు మెరుగుపర్చడానికి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాంబాబు తదితరులు సోమవారం జెడ్పీ గ్రీవెన్స్‌లో జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండేకు వినతిపత్రం ఇచ్చారు. బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.. పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఉన్న గుంటూరులోని మహిమా గార్డెన్స్ వెనుక వైపున సోషల్ వెల్ఫేర్ నిర్వహిస్తున్న హాస్టల్ బిల్డింగ్ కూలిపోవడానికి సిద్ధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. స్లాబ్ నుంచి పెచ్చులు ఊడిపడుతున్నాయని తెలిపారు. ఫ్లోరింగ్ లేదని, కిటికీలు లేవని, బాత్రూమ్లు టాయిలెట్లకు కనీసం తలుపులు కూడా లేవని, ఇటువంటి భవనంలో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు తినే భోజనంలో రాళ్లు, పురుగులను ఏరుకుని తినాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. దళితుల బాగోగులు పట్టని ముఖ్యమంత్రి, మంత్రులు పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో నోడల్ ఏజన్సీ పెట్టి దళిత, గిరిజనులకు పలు సంక్షేమ పథకాలు అమలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దళిత, గిరిజనుల చట్టాలకు తూట్లు పొడుస్తూ, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద మంజూరైన నిధులను దారిమళ్లిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్ సూచించిన చట్టాలు, సూత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు తుంగలో తొక్కుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించిందని, అవినీతి హెచ్చుమీరిపోయిందని విమర్శించారు. ఫిబ్రవరి 10వ తేదీ లోపు సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో వసతులు, విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే 10వ తేదీన జిల్లా సోషల్ వెల్ఫేర్ కార్యాలయాన్ని పార్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ముట్టడిస్తామని హెచ్చరించారు. సమాజంలో అసమానతలు తొలగాలన్నా, పేదరికం పోవాలన్నా ధనిక వర్గాలతో సమానంగా పేద వర్గాలు ఉన్నత చదువులు చదువుకోవాలని అంబేద్కర్ చెప్పారన్నారు. అసమానతలు తొలగి, అన్ని వర్గాలు ఉన్నత స్థితికి చేరుకోవాలన్నదే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశ, థ్యేయమని స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాంబాబు మాట్లాడుతూ దళిత, గిరిజనుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ప్రేమ లేదు అనడానికి సోషల్ వేల్ఫేర్ హాస్టల్స్ దుస్థితే నిదర్శనమన్నారు. హాస్టళ్లలో మౌలిక వసతులు, విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుంటే కార్యాచరణ రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్–2 ముంగా వెంకటేశ్వరరావును హాస్టల్‌కు పంపి, విద్యార్థులతో సమావేశం నిర్వహించి వసతులపై చర్చిస్తామని కలెక్టర్ కాంతీలాల్ దండే వారికి హామీ ఇచ్చారు. సంక్షేమ హాస్టళ్లలో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. వినతిపత్రం ఇచ్చినవారిలో వైఎస్సార్ సీపీ నేతలు ఏలికా శ్రీకాంత్‌యాదవ్, గనిక ఝాన్సీరాణి, మద్దుల రాజాయాదవ్, దాసరి కిరణ్, పల్లపు మహేష్, సోమికమల్, పానుగంటి చైతన్య, షేక్ రబ్బాని, వినోద్, విఠల్, వలి, పేటేటి బాజి, యాదాల రామ్, దాసరి గోపి, సాయిగోపి, నాని తదితరులున్నారు. -
రోడ్డుపై కాంట్రాక్టు అధ్యాపకుల యజ్ఞం
గుంటూరు ఎడ్యుకేషన్ : కాంట్రాక్టు అధ్యాపకుల ఆందోళన సోమవారంతో 15వ రోజుకు చేరింది. ఆర్నెల్లుగా వేతనాలు లేక కాలే కడుపులతో కళాశాలలను వీడి రోడ్డుపైకి వచ్చిన కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వానికి సద్భుద్ధి ప్రసాదించాలని కోరుతూ నడిరోడ్డుపై యజ్ఞం నిర్వహించి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ధర్నా శిబిరం వద్ద రోడ్డుపై యజ్ఞం నిర్వహించిన కాంట్రాక్టు అధ్యాపకులకు సీఐటీయూ జిల్లా నాయకులు హరిప్రసాద్, సీపీఎం నగర కార్యదర్శి ఎన్. భావన్నారాయణ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వి. భగవాన్ దాస్, శ్రామిక మహిళా కన్వీనర్ శివకుమారి మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీడీపీ ప్రభుత్వం అమలు పర్చాలని డిమాండ్ చేశారు. యజ్ఞంలో కాంట్రాక్టు అధ్యాపక జేఏసీ నాయకులు ఇ. రామరాజు, పి. ప్రభాకర్, బాలు నాయక్, రత్నకుమారి, బాలయ్య, పి. శ్రీనివాసరావు, వై. రమేష్‌బాబు, ఐ. సుగుణకుమారి, కాంట్రాక్టు అధ్యాపకులు పాల్గొన్నారు. -
ఇంటికో ప్యాకేజీ ఇవ్వాలి
–యూత్ ప్యాకేజీ వర్తింపజేయాలి – ‘వంశధార’ నిర్వాసితుల డిమాండ్ – ప్యాకేజీ చెల్లించిన మరోక్షణమే గ్రామాలు ఖాళీ చేయాలి: మంత్రి అచ్చెన్నాయుడు – నిర్వాసితులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్, మంత్రి – గందరగోళంగా ‘ప్యాకేజీ’ సంబరాలు! వంశధార ప్రాజెక్టు నిర్వాసితులు మరోసారి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఇంటికో ప్యాకేజీ ఇవ్వాలని స్పష్టం చేశారు. అందరికీ సమానంగా, న్యాయబద్ధంగా ఆదుకోవాలని వేడుకున్నారు. అయితే దీనికి అధికారులు, పాలకుల నుంచి సరైన సమాధానం రాలేదు సరికదా.. నిర్వాసితులపైనే కస్సుబుస్సులాడారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో భాగంగా నిర్వాసితుల కోసమంటూ ప్రభుత్వం రూ. 421 కోట్లు ఇస్తున్నట్టు ఇటీవల జీవో జారీ చేసింది. ఇందులో భాగంగా ప్యాకేజీ సంబరాలు పేరిట జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రత్యేక సమావేశాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొన్న నిర్వాసితులు అడిగిన ప్రశ్నలకు వేదికపై ఉన్న మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం సరైన సమాధానం ఇవ్వలేదు. శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): వంశధార ప్రాజెక్టు నిర్వాసితులతో జెడ్పీ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్యాకేజీ సంబరాలు’ గందరగోళంగా మారాయి. బాధితులు నిరసన వ్యక్తం చేశారు. గ్రామాలు, భూములు, ఇల్లు పోగొట్టుకున్నామని, ఈ పరిస్థితిలో అందరికీ సమానంగా న్యాయం చేయాలని వేడుకున్నారు. నిర్వాసితులకు ఎటువంటి పరిహారం చెల్లించకుండానే తక్షణమే ఉన్న ఊరును ఖాళీ చేయాలని పాలకులు చెప్పడంతో మండిపడ్డారు. తామంతా సంబరాల్లో పాల్గొనేందుకు రాలేదని, మంత్రి, ఎమ్మెల్యేలు ఏవిధంగా మాకు ప్యాకేజీ మంజూరు చేసి న్యాయం చేస్తారో తెలుసుకోవడానికి వచ్చామని పేర్కొన్నారు. తక్షణమే ఇళ్లు ఖాళీ చేయాలి:మంత్రి అచ్చెన్న ఈ సందర్భంగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్యాకేజీ చెల్లించిన మరు క్షణమే గ్రామాలు ఖాళీ చేయాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్యాకేజీ చెల్లించేందుకు మరో మూడు, నాలుగు నెలలు పడుతోందన్నారు. దీనితో ఒక్కసారిగా నిర్వాసితులంతా పెద్దగా కేకలు పెడుతూ.. మీరు చెప్పే కబుర్లు వినేందుకు రాలేదని, అందరికీ పూర్తిస్థాయిలో ఇంటికో ప్యాకేజీ చెల్లిస్తేనే గ్రామాలు ఖాళీ చేస్తామని స్పష్టం చేశారు. అలాగే గతంలో మైనర్లగా ఉన్న వారు ఇప్పుడు మేజర్లు అయ్యారని, వారిని యూత్ ప్యాకేజీలోకి తీసుకోవాలని పట్టుబట్టారు. ఇచ్చింది తీసుకోండి కలెక్టర్, మంత్రి మాట్లాడుతూ ఇప్పటివరకూ ఏ ప్రభుత్వం ఇవ్వనంతా ప్యాకేజీ ఇస్తున్నామని, ఎవరూ చేయలేని పనిని చేస్తున్నామన్నారు. మేం ఏది ఇస్తే అది తీసుకోండి, లేకుంటే మీపై చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించడంతో నిర్వాసితులు మరింత మండిపడ్డారు. సరైన ప్యాకేజీ ఇవ్వాలని పట్టుపట్టారు. దీనికి ఆగ్రహం తెచ్చుకున్న అధికారులు, మంత్రి మాట్లాడుతూ తాము చెప్పేది వినాలని, లేకపోతే బయటకు పోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డువస్తే క్రిమినల్ చర్యలు త్వరలోనే ప్రాజెక్టు పనులు చేపడతామని అధికారులు వెల్లడించారు. ఎవరైనా అడ్డువస్తే.. క్రిమినల్ చర్యలు తీసుకోకతప్పదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కేటాయించిన రూ. 421 కోట్లులో యూత్ ప్యాకేజీకి రూ. 164 కోట్లు, ఇళ్లు, ఇళ్ల స్థలాలకు రూ.182 కోట్లు, మైనర్ పనులకు రూ. 75 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. 2015 వరకు పేర్లు నమోదు చేసుకున్నవారే అర్హులు 2015..డిసెంబర్ నాటికి ఎవరైతే పేర్లు నమోదు చేసుకున్నారో వారే ప్యాకేజీకి అర్హులని అధికారులు స్పష్టం చేశారు. మిగిలిన వారికి ఏం చేయలేమని చేతులెత్తేశారు. పేర్లు నమోదు, ప్యాకేజీల గురించి నిర్వాసితులకు అవగాహన కల్పించేవారు లేకపోయారని చెప్పుకొచ్చారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ...కొన్ని ఉదాహరణలను చెప్పుకొచ్చారు. పరీక్షSనిర్ణీత సమయంలో జవాబులు రాయకుండా మరికొంత సమయం పెంచండని అడగడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదో, నిర్వాసితుల పరిస్థితి అంతేనన్నారు. ఇదే చివరి సమావేశమని, ఇకపై మాటలు ఉండవని, పనులే జరుగుతాయన్నారు. పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మాట్లాడుతూ అధికారులపై నిర్వాసితులు దాడి చేయడం వారి పనికాదన్నారు. ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు నిర్వాసితులు వ్యతిరేకం కాదని, వారికి రావాల్సిన నష్టపరిహారం ఇస్తే చాలన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్మన్ చౌదరి ధనలక్ష్మి, జేసీ వివేక్‌యాదవ్, ఆర్డీవోలు దయానిధి, గున్నయ్య, జెడ్పీ సీఈవో వి.వి.ఆర్.ఎస్ మూర్తి, తోటపల్లి ఎస్ఈ డోల తిరుమలరావు పాల్గొన్నారు.