రోడ్డుపై కాంట్రాక్టు అధ్యాపకుల యజ్ఞం
రోడ్డుపై కాంట్రాక్టు అధ్యాపకుల యజ్ఞం
Published Mon, Dec 19 2016 10:55 PM | Last Updated on Mon, Sep 4 2017 11:07 PM
గుంటూరు ఎడ్యుకేషన్ : కాంట్రాక్టు అధ్యాపకుల ఆందోళన సోమవారంతో 15వ రోజుకు చేరింది. ఆర్నెల్లుగా వేతనాలు లేక కాలే కడుపులతో కళాశాలలను వీడి రోడ్డుపైకి వచ్చిన కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వానికి సద్భుద్ధి ప్రసాదించాలని కోరుతూ నడిరోడ్డుపై యజ్ఞం నిర్వహించి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ధర్నా శిబిరం వద్ద రోడ్డుపై యజ్ఞం నిర్వహించిన కాంట్రాక్టు అధ్యాపకులకు సీఐటీయూ జిల్లా నాయకులు హరిప్రసాద్, సీపీఎం నగర కార్యదర్శి ఎన్. భావన్నారాయణ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వి. భగవాన్ దాస్, శ్రామిక మహిళా కన్వీనర్ శివకుమారి మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీడీపీ ప్రభుత్వం అమలు పర్చాలని డిమాండ్ చేశారు. యజ్ఞంలో కాంట్రాక్టు అధ్యాపక జేఏసీ నాయకులు ఇ. రామరాజు, పి. ప్రభాకర్, బాలు నాయక్, రత్నకుమారి, బాలయ్య, పి. శ్రీనివాసరావు, వై. రమేష్‌బాబు, ఐ. సుగుణకుమారి, కాంట్రాక్టు అధ్యాపకులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement