ఇంటికో ప్యాకేజీ ఇవ్వాలి
ఇంటికో ప్యాకేజీ ఇవ్వాలి
Published Tue, Jul 19 2016 11:01 AM | Last Updated on Wed, Sep 18 2019 3:26 PM
–యూత్ ప్యాకేజీ వర్తింపజేయాలి
– ‘వంశధార’ నిర్వాసితుల డిమాండ్
– ప్యాకేజీ చెల్లించిన మరోక్షణమే గ్రామాలు ఖాళీ చేయాలి: మంత్రి అచ్చెన్నాయుడు
– నిర్వాసితులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్, మంత్రి
– గందరగోళంగా ‘ప్యాకేజీ’ సంబరాలు!
వంశధార ప్రాజెక్టు నిర్వాసితులు మరోసారి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఇంటికో ప్యాకేజీ ఇవ్వాలని స్పష్టం చేశారు. అందరికీ సమానంగా, న్యాయబద్ధంగా ఆదుకోవాలని వేడుకున్నారు. అయితే దీనికి అధికారులు, పాలకుల నుంచి సరైన సమాధానం రాలేదు సరికదా.. నిర్వాసితులపైనే కస్సుబుస్సులాడారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలో భాగంగా నిర్వాసితుల కోసమంటూ ప్రభుత్వం రూ. 421 కోట్లు ఇస్తున్నట్టు ఇటీవల జీవో జారీ చేసింది. ఇందులో భాగంగా ప్యాకేజీ సంబరాలు పేరిట జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రత్యేక సమావేశాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొన్న నిర్వాసితులు అడిగిన ప్రశ్నలకు వేదికపై ఉన్న మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం సరైన సమాధానం ఇవ్వలేదు.
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): వంశధార ప్రాజెక్టు నిర్వాసితులతో జెడ్పీ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్యాకేజీ సంబరాలు’ గందరగోళంగా మారాయి. బాధితులు నిరసన వ్యక్తం చేశారు. గ్రామాలు, భూములు, ఇల్లు పోగొట్టుకున్నామని, ఈ పరిస్థితిలో అందరికీ సమానంగా న్యాయం చేయాలని వేడుకున్నారు. నిర్వాసితులకు ఎటువంటి పరిహారం చెల్లించకుండానే తక్షణమే ఉన్న ఊరును ఖాళీ చేయాలని పాలకులు చెప్పడంతో మండిపడ్డారు. తామంతా సంబరాల్లో పాల్గొనేందుకు రాలేదని, మంత్రి, ఎమ్మెల్యేలు ఏవిధంగా మాకు ప్యాకేజీ మంజూరు చేసి న్యాయం చేస్తారో తెలుసుకోవడానికి వచ్చామని పేర్కొన్నారు.
తక్షణమే ఇళ్లు ఖాళీ చేయాలి:మంత్రి అచ్చెన్న
ఈ సందర్భంగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్యాకేజీ చెల్లించిన మరు క్షణమే గ్రామాలు ఖాళీ చేయాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్యాకేజీ చెల్లించేందుకు మరో మూడు, నాలుగు నెలలు పడుతోందన్నారు. దీనితో ఒక్కసారిగా నిర్వాసితులంతా పెద్దగా కేకలు పెడుతూ.. మీరు చెప్పే కబుర్లు వినేందుకు రాలేదని, అందరికీ పూర్తిస్థాయిలో ఇంటికో ప్యాకేజీ చెల్లిస్తేనే గ్రామాలు ఖాళీ చేస్తామని స్పష్టం చేశారు. అలాగే గతంలో మైనర్లగా ఉన్న వారు ఇప్పుడు మేజర్లు అయ్యారని, వారిని యూత్ ప్యాకేజీలోకి తీసుకోవాలని పట్టుబట్టారు.
ఇచ్చింది తీసుకోండి
కలెక్టర్, మంత్రి మాట్లాడుతూ ఇప్పటివరకూ ఏ ప్రభుత్వం ఇవ్వనంతా ప్యాకేజీ ఇస్తున్నామని, ఎవరూ చేయలేని పనిని చేస్తున్నామన్నారు. మేం ఏది ఇస్తే అది తీసుకోండి, లేకుంటే మీపై చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించడంతో నిర్వాసితులు మరింత మండిపడ్డారు. సరైన ప్యాకేజీ ఇవ్వాలని పట్టుపట్టారు. దీనికి ఆగ్రహం తెచ్చుకున్న అధికారులు, మంత్రి మాట్లాడుతూ తాము చెప్పేది వినాలని, లేకపోతే బయటకు పోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అడ్డువస్తే క్రిమినల్ చర్యలు
త్వరలోనే ప్రాజెక్టు పనులు చేపడతామని అధికారులు వెల్లడించారు. ఎవరైనా అడ్డువస్తే.. క్రిమినల్ చర్యలు తీసుకోకతప్పదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కేటాయించిన రూ. 421 కోట్లులో యూత్ ప్యాకేజీకి రూ. 164 కోట్లు, ఇళ్లు, ఇళ్ల స్థలాలకు రూ.182 కోట్లు, మైనర్ పనులకు రూ. 75 కోట్లు కేటాయిస్తున్నామన్నారు.
2015 వరకు పేర్లు నమోదు చేసుకున్నవారే అర్హులు
2015..డిసెంబర్ నాటికి ఎవరైతే పేర్లు నమోదు చేసుకున్నారో వారే ప్యాకేజీకి అర్హులని అధికారులు స్పష్టం చేశారు. మిగిలిన వారికి ఏం చేయలేమని చేతులెత్తేశారు. పేర్లు నమోదు, ప్యాకేజీల గురించి నిర్వాసితులకు అవగాహన కల్పించేవారు లేకపోయారని చెప్పుకొచ్చారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ...కొన్ని ఉదాహరణలను చెప్పుకొచ్చారు. పరీక్షSనిర్ణీత సమయంలో జవాబులు రాయకుండా మరికొంత సమయం పెంచండని అడగడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదో, నిర్వాసితుల పరిస్థితి అంతేనన్నారు. ఇదే చివరి సమావేశమని, ఇకపై మాటలు ఉండవని, పనులే జరుగుతాయన్నారు. పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మాట్లాడుతూ అధికారులపై నిర్వాసితులు దాడి చేయడం వారి పనికాదన్నారు. ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు నిర్వాసితులు వ్యతిరేకం కాదని, వారికి రావాల్సిన నష్టపరిహారం ఇస్తే చాలన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్మన్ చౌదరి ధనలక్ష్మి, జేసీ వివేక్‌యాదవ్, ఆర్డీవోలు దయానిధి, గున్నయ్య, జెడ్పీ సీఈవో వి.వి.ఆర్.ఎస్ మూర్తి, తోటపల్లి ఎస్‌ఈ డోల తిరుమలరావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement