vamsadhara
-
Heavy Rains-Telugu States: ఉగ్ర కృష్ణ.. మహోగ్ర గోదావరి
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: నైరుతి రుతు పవనాలు, బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం వల్ల పరీవాహక ప్రాంతాల్లో (బేసిన్లో) విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నది ఉగ్రరూపం దాల్చితే.. గోదావరి మళ్లీ మహోగ్రరూపం దాల్చింది. వంశధారలోనూ వరద ఉధృతి కొనసాగుతోంది. కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్ర, గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో తీర ప్రాంతాల గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, తుంగభద్ర పోటాపోటీగా ప్రవహిస్తున్నాయి. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యామ్‌లలోకి వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్ నుంచి 1,81,246 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తుండటంతో బుధవారం మంత్రాలయం వద్ద ప్రమాదకర రీతిలో 312.04 మీటర్లు వద్ద తుంగభద్ర ప్రవహిస్తోంది. కర్నూలు వద్ద 272.76 మీటర్లకు చేరుకుంది. దాంతో మంత్రాలయం, కర్నూలు నగరాలలో ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు పది గేట్లు ఎత్తివేత ఎగువ నుంచి వస్తున్న వరదకు స్థానికంగా కురిసిన వర్షాల వల్ల వాగులు, వంకల ద్వారా చేరుతున్న జలాలు తోడవడంతో శ్రీశైలంలోకి 3,60,436 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రాజెక్టులో గరిష్ట స్థాయిలో నీరు నిల్వ ఉండటంతో పది గేట్లను 12 అడుగుల మేర ఎత్తి 3,17,460 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. విద్యుదుత్పత్తి చేస్తూ కుడి కేంద్రం ద్వారా 29,833, ఎడమ కేంద్రం ద్వారా 31,784 క్యూసెక్కులు వదులుతున్నారు. నేడు సాగర్ గేట్లు ఎత్తివేత శ్రీశైలం నుంచి భారీగా వస్తున్న జలాలతో నాగార్జునసాగర్ నిండుకుండలా మారింది. సాగర్‌లోకి 3,61,296 క్యూసెక్కులు వస్తున్నాయి. నీటి నిల్వ 583.5 అడుగుల్లో 293.4 టీఎంసీలకు చేరుకుంది. మరో 19 టీఎంసీలు వస్తే ప్రాజెక్టు నిండిపోతుంది. గురువారం ఉదయం 6 గంటలకు సాగర్ ఒక గేటును ఎత్తివేయనున్నారు. ఆ తర్వాత ప్రతి గంటకూ ఒక గేటు చొప్పున ఎత్తుతూ 2 లక్షల నుంచి 2.50 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేయనున్నారు. గత మూడేళ్లుగా ఆగస్టులోనే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిండుతోంది. సాగర్ డ్యాం గేట్ల నిర్వహణ పనులను అధికారులు ఇప్పటికే పూర్తిచేశారు. డ్యాం 26 క్రస్టు గేట్లకు కొత్త ఇనుప రోప్‌లను బిగించారు. గేట్లకు గ్రీజింగ్, ఇతర మరమ్మతులు పూర్తి చేశారు. వరద నియంత్రణపై అధికారుల దృష్టి ఎగువ నుంచి భారీగా ప్రవాహం వస్తుండటంతో వరద నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జలవనరుల శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ నుంచి 75,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నందన పులిచింతలలో నీటి నిల్వ 40 టీఎంసీల లోపు ఉంచాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దాంతో పులిచింతల ప్రాజెక్టును ఖాళీ చేస్తున్నారు. దీంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి 80,737 క్యూసెక్కులు చేరుతోంది. ఆ నీటినంతా ప్రకాశం బ్యారేజి నుంచి సముద్రంలోకి వదిలేస్తున్నారు. ప్రమాదకరంగా గోదావరి బేసిన్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. బుధవారం సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్దకు 11 లక్షల క్యూసెక్కులు వస్తోంది. నీటి మట్టం 50.6 అడుగులకు చేరుకుంది. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గురువారం 55 అడుగులకు చేరుతుందని కేంద్ర జల వనరుల శాఖ వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు వద్దకు 10,10,387 క్యూసెక్కులు చేరుతుండటంతో స్పిల్‌వే ఎగువన 33.37 మీటర్లు, దిగువన 24.76 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టులోకి వచ్చిన వరదను 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. దాంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం వద్ద రాత్రి 10 గంటలకు నీటి మట్టం 13.40 అడుగులకు చేరింది. కాటన్ బ్యారేజ్‌లోని మొత్తం 175 గేట్లను పూర్తిగా పైకి లేపి 12,43,405 క్యూసెక్కులు సముద్రంలోకి వదులుతున్నారు. గోదావరి డెల్టాకు 6,500 క్యూసెక్కులు వదులుతున్నారు. వంశధారలో వరద ఉద్ధృతి బేసిన్లో కురుస్తున్న వర్షాలతో వంశధార వరద ఉద్ధృతి కొనసాగుతోంది. గొట్టా బ్యారేజ్‌లోకి 24,124 క్యూసెక్కులు చేరుతుండగా.. ఆయకట్టుకు 2849 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 21,275 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
త్యాగానికి బహుమతి! పరిహారం మంజూరు
ఎల్ఎన్ పేట, హిరమండలం, శ్రీకాకుళం పీఎన్ కాలనీ: వంశధార నిర్వాసితులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అదనపు పరిహారాన్ని వైఎస్సార్ సీపీ ప్ర భుత్వం ప్రకటించింది. మెత్తం రూ.216.71కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు హిరమండలం, కొత్తూరు, ఎల్‌ఎన్‌పేట మండలాల్లోని పునరావాస కాలనీల్లో లబ్ధిదారులను గుర్తించే పనిలో అ«ధికారులు పడ్డారు. ఇదీ చరిత్ర.. వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పట్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞంలో భాగంగా 2005లో హిరమండలం వద్ద 10 వేల ఎకరాల్లో 19 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో వంశధార రిజర్వాయర్ (జలాశయం) నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నిర్వాసితులను గుర్తించేందుకు అనేక సర్వేలు 2007 వరకు జరిగాయి. సర్వే అనంతరం పంట భూములకు పరిహారం చెల్లించి నిర్మాణం పనులు చేపట్టారు. రిజర్వాయర్ నిర్మాణంలో హిరమండలం, కొత్తూరు, ఎల్.ఎన్.పేట మండలాల్లోని 19 గ్రామాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. మరో 14 గ్రామాలు పాక్షికంగా నష్టపోయాయి. 8 వేల కుటుంబాలు నిర్వాసితులుగా గుర్తించారు. అప్పట్లో ఎకరా పల్లం భూమికి రూ.1.29లక్షలు, ఎకరా మెట్టు భూమికి రూ.90 వేలు నష్ట పరిహారం చెక్కుల రూపంలో అందజేశారు. ఇప్పుడు అదనపు పరిహారం చెల్లించేందుకు రైతుల నుంచి అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. లబ్ధిదారుల ఆధార్ కార్డుల ఆధారంగా వివరాలు పొందుపరుస్తున్నారు. అయితే చాలామంది భూ యజమానులు చనిపోయారు. వారి స్థానంలోకి వచ్చిన వారి ఫ్యామిలీ సర్టిఫికెట్(లీగల్ హేర్) వివరాలు సేకరిస్తున్నారు. అదనపు పరిహారం చెల్లింపు ఇలా.. భూములు కోల్పోయిన రైతులతో పాటు పీడీఎఫ్ పొందిన కుటుంబాలకు ఆదనపు పరిహారం చెల్లించేందుకు వీలుగా ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. రిజర్వాయర్ నిర్మాణం కోసం 9,579.62 ఎకరాల భూమిని సేకరించగా వీటిలో 8775.42 ఎకరాల ప్రైవేటు భూములు ఉన్నాయి. 804.20 ఎకరాల డి–పట్టా భూములు ఉన్నాయి. భూములకు గాను ఎకరానికి రూ.లక్ష అదనపు పరిహారంగా మొత్తం 95.80 కోట్లు విడుదల చేశారు. 12,091 మంది పీడీఎఫ్ అర్హత కలిగిన కుటుంబాలు ఉండగా వీరిలో 7,103 కుటుంబాలకు పీడీఎఫ్ పరిహారానికి, 4,988 మంది 18 ఏళ్లు దాటిన వారికి ఒక్కొక్కరికి రూ.లక్ష చెప్పున్న రూ.120.91 కోట్లు విడుదల చేశారు. ఎమ్మెల్యేదే కీలక పాత్ర వంశధార నిర్వాసితులకు అదనపు పరిహారం తీసుకురావటంలో పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి కీలక పాత్ర పోషించారు. ఆమెతో పాటు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు, ప్రస్తుత రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావులు కూడా కృషి చేశారు. అదనపు పరిహారం విడుదలపై కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్, వంశధార ఎస్ఈ డోల తిరుమలరావులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. మాట నిలబెట్టుకునేలా.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2017లో హిరమండలం వచ్చి ఒక బహిరంగ సభలో నిర్వాసితుల కష్టాలను తెలుసుకున్నా రు. అప్పుడే మన ప్రభుత్వం వస్తే ఆదుకుంటామని మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకుంటూ ఇప్పుడు రూ.216.71 కోట్లు విడుదల చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం. – రెడ్డి శాంతి, ఎమ్మెల్యే, పాతపట్నం ప్రభుత్వ ఆదేశాల మేరకే.. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ కార్యాలయం నుంచి కోరిన ప్రొఫార్మాలో వంశధార నిర్వాసితుల నుంచి వివరాలు సేకరిస్తున్నాం. ఈ నెల 27న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాకు వచ్చే అవకాశం ఉంది. ఈ లోగా నిర్వాసితుల పూర్తి వివరాలు సేకరించి కలెక్టర్ కార్యాలయానికి అందజేయాలని అధికారులకు ఆదేశాలిచ్చాం. – ఎం.విజయ సునీత, జాయింట్ కలెక్టర్, శ్రీకాకుళం సంతోషంగా ఉంది వంశధార నిర్వాసితులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అదనపు పరిహారం ఇస్తాననడం ఎంతో సంతోషంగా ఉంది. çస్థిరాస్తులను కోల్పోయి నిరాశ్రయులయ్యాం. పునరావాస కాలనీల్లో అదనపు పరిహారం కోసం గ్రామాల్లో సర్వే ముమ్మరంగా సాగుతుంది. – గవర వెంకటరావు,నిర్వాసితుడు గార్లపాడు -
వామపక్ష నేతల అరెస్టును ఖండించిన వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్ : వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై ఉద్యమిస్తున్న వామపక్ష నేతలను అరెస్టు చేయడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఛలో వంశధార కార్యక్రమంలో పాల్గొంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా నేత ధర్మాన కృష్ణదాస్‌ను గృహ నిర్బంధంలో ఉంచడాన్ని, మళ్లీ ఈ రోజు వెంటాడినట్లుగా వామపక్ష నేతలను మరోసారి అరెస్టు చేయడాన్ని వైఎస్ జగన్ బుధవారం ఒక ప్రకటనలో ఖండించారు. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల రూపంలో ఎంత దండుకోవాలన్నదే ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ విధానంగా మారింది తప్ప, నిర్వాసితులకు ఎంత ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వం తలకెక్కడం లేదని జగన్ పేర్కొన్నారు. సీపీఎం నేత పి.మధును, సీపీఐ నేత కె.రామకృష్ణతో సహా వామపక్ష నేతలను కూడా ఈ ప్రభుత్వం అరెస్టులు చేసి బెదిరింపులకు గురి చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. వంశధారకు సంబంధించిన నిర్వాసితులకు న్యాయం జరిగేలా అన్ని చర్యలూ తీసుకోవాల్సిందేనని జగన్ ఉద్ఘాటించారు. లేని పక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు. వంశధార నిర్వాసితులకు తప్పనిసరిగా న్యాయం చేస్తామని గతంలోనే తాము మాట ఇచ్చామని ఈ ప్రభుత్వం ముందుకు కదలని పక్షంలో అధికారంలోకి రాగానే వారంతా సంతోషించేలా న్యాయం చేస్తామని జగన్ తన ప్రకటనలో పేర్కొన్నారు. -
నిలకడగా వంశధార
హిరమండలం: గొట్టా బ్యారేజీ వద్ద వంశధార నీటి ప్రవాహం నికడగా ఉంది. ఒడిశా క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గురువారం ఉదయం ఇన్‌ఫ్లో 10490 క్యూసెక్కులు నమోదైంది. బ్యారేజీ వద్ద 37.89 మీటర్ల నీరు నిల్వ ఉన్నట్టు ప్రాజెక్టు డీఈ ప్రభాకరరావు తెలిపారు. 8,805 క్యూసెక్కుల నీటిని దిగువుకు విడిచి పెడుతున్నామన్నారు. ఎడమకాలువకు 299 క్యూసెక్కులు, కుడి కాలువకు 82 క్యూసెక్కులు నీటిని విడిచిపెట్టినట్టు వెల్లడించారు. -
జిల్లాకు పూర్వవైభవం తీసుకొస్తాం
వంశధార రెండోదశ పూర్తి చేసి తీరుతాం వంతెన నిర్మాణానికి శంకుస్థాపన సభలో మంత్రి అచ్చెన్నాయుడు నువ్వరేలవు( వజ్రపుకొత్తూరు): శ్రీకాకుళం జిల్లాకు పూర్వ వైభవం తీసుకొస్తామని రాష్ట్ర కార్మిక, క్రీడా శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు గ్రామంలో ఆదివారం రూ.35.38 కోట్లతో ఉప్పుటేరుపై వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. వంశధార రెండో దశ పూర్తి చేస్తామని చెప్పారు. ప్రకృతితో ప్రతి ఒక్కరూ అనుసంధానం కావాలని, ఈ స్ఫూర్తితోనే నదుల అనుసందానం చేపట్టి గోదావరి, కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. టెక్కలి, వజ్రపుకొత్తూరు మండల పరిషత్ కార్యాలయాలకు నూతన భవనాలు నిర్మించేందుకు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళుతున్నట్టు ప్రకటించారు. ఎంపీ కె.రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ నువ్వలరేవులో పొగురు తీసేందుకు కృషి చేస్తానన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనరసింహం మాట్లాడుతూ జిల్లాలో తీరం వెంబడి 193 కిలో మీటర్ల పరిధిలో 10 వరుసల్లో సరుగుడు, తాటి చెట్లు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామని, సంవరక్షణ బాధ్యత మహిళా బృందాలకు అప్పగిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఎస్పీ బ్రహ్మారెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష, ఎంపీపీ జి.వసంతరావు, జెడ్పీటీసీ ప్రతినిధి ఉదయ్‌కుమార్, సర్పంచ్ బి. ధర్మారావు, ఉప సర్పంచ్ ఎం.రఘు పెద్ద బెహరా మధుసూదన్, స్థానిక ఎంపీటీసీ ప్రతినిధులు వెంకటేష్, ఆనంద్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు పి. విఠల్‌రావు, ఆర్డీఓ ఎం.వెంకటేశ్వరరావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.గోవిందరాజులు, వెంకట్‌కుమార్ చౌదరి, ఎంపీడీఓ వి.తిరుమలరావు, మండల పార్టీ అధ్యక్షుడు బి. శశిభూషణరావు తదితరులు పాల్గొన్నారు. -
ఇంటికో ప్యాకేజీ ఇవ్వాలి
–యూత్ ప్యాకేజీ వర్తింపజేయాలి – ‘వంశధార’ నిర్వాసితుల డిమాండ్ – ప్యాకేజీ చెల్లించిన మరోక్షణమే గ్రామాలు ఖాళీ చేయాలి: మంత్రి అచ్చెన్నాయుడు – నిర్వాసితులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్, మంత్రి – గందరగోళంగా ‘ప్యాకేజీ’ సంబరాలు! వంశధార ప్రాజెక్టు నిర్వాసితులు మరోసారి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఇంటికో ప్యాకేజీ ఇవ్వాలని స్పష్టం చేశారు. అందరికీ సమానంగా, న్యాయబద్ధంగా ఆదుకోవాలని వేడుకున్నారు. అయితే దీనికి అధికారులు, పాలకుల నుంచి సరైన సమాధానం రాలేదు సరికదా.. నిర్వాసితులపైనే కస్సుబుస్సులాడారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో భాగంగా నిర్వాసితుల కోసమంటూ ప్రభుత్వం రూ. 421 కోట్లు ఇస్తున్నట్టు ఇటీవల జీవో జారీ చేసింది. ఇందులో భాగంగా ప్యాకేజీ సంబరాలు పేరిట జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రత్యేక సమావేశాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొన్న నిర్వాసితులు అడిగిన ప్రశ్నలకు వేదికపై ఉన్న మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం సరైన సమాధానం ఇవ్వలేదు. శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): వంశధార ప్రాజెక్టు నిర్వాసితులతో జెడ్పీ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్యాకేజీ సంబరాలు’ గందరగోళంగా మారాయి. బాధితులు నిరసన వ్యక్తం చేశారు. గ్రామాలు, భూములు, ఇల్లు పోగొట్టుకున్నామని, ఈ పరిస్థితిలో అందరికీ సమానంగా న్యాయం చేయాలని వేడుకున్నారు. నిర్వాసితులకు ఎటువంటి పరిహారం చెల్లించకుండానే తక్షణమే ఉన్న ఊరును ఖాళీ చేయాలని పాలకులు చెప్పడంతో మండిపడ్డారు. తామంతా సంబరాల్లో పాల్గొనేందుకు రాలేదని, మంత్రి, ఎమ్మెల్యేలు ఏవిధంగా మాకు ప్యాకేజీ మంజూరు చేసి న్యాయం చేస్తారో తెలుసుకోవడానికి వచ్చామని పేర్కొన్నారు. తక్షణమే ఇళ్లు ఖాళీ చేయాలి:మంత్రి అచ్చెన్న ఈ సందర్భంగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్యాకేజీ చెల్లించిన మరు క్షణమే గ్రామాలు ఖాళీ చేయాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్యాకేజీ చెల్లించేందుకు మరో మూడు, నాలుగు నెలలు పడుతోందన్నారు. దీనితో ఒక్కసారిగా నిర్వాసితులంతా పెద్దగా కేకలు పెడుతూ.. మీరు చెప్పే కబుర్లు వినేందుకు రాలేదని, అందరికీ పూర్తిస్థాయిలో ఇంటికో ప్యాకేజీ చెల్లిస్తేనే గ్రామాలు ఖాళీ చేస్తామని స్పష్టం చేశారు. అలాగే గతంలో మైనర్లగా ఉన్న వారు ఇప్పుడు మేజర్లు అయ్యారని, వారిని యూత్ ప్యాకేజీలోకి తీసుకోవాలని పట్టుబట్టారు. ఇచ్చింది తీసుకోండి కలెక్టర్, మంత్రి మాట్లాడుతూ ఇప్పటివరకూ ఏ ప్రభుత్వం ఇవ్వనంతా ప్యాకేజీ ఇస్తున్నామని, ఎవరూ చేయలేని పనిని చేస్తున్నామన్నారు. మేం ఏది ఇస్తే అది తీసుకోండి, లేకుంటే మీపై చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించడంతో నిర్వాసితులు మరింత మండిపడ్డారు. సరైన ప్యాకేజీ ఇవ్వాలని పట్టుపట్టారు. దీనికి ఆగ్రహం తెచ్చుకున్న అధికారులు, మంత్రి మాట్లాడుతూ తాము చెప్పేది వినాలని, లేకపోతే బయటకు పోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డువస్తే క్రిమినల్ చర్యలు త్వరలోనే ప్రాజెక్టు పనులు చేపడతామని అధికారులు వెల్లడించారు. ఎవరైనా అడ్డువస్తే.. క్రిమినల్ చర్యలు తీసుకోకతప్పదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కేటాయించిన రూ. 421 కోట్లులో యూత్ ప్యాకేజీకి రూ. 164 కోట్లు, ఇళ్లు, ఇళ్ల స్థలాలకు రూ.182 కోట్లు, మైనర్ పనులకు రూ. 75 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. 2015 వరకు పేర్లు నమోదు చేసుకున్నవారే అర్హులు 2015..డిసెంబర్ నాటికి ఎవరైతే పేర్లు నమోదు చేసుకున్నారో వారే ప్యాకేజీకి అర్హులని అధికారులు స్పష్టం చేశారు. మిగిలిన వారికి ఏం చేయలేమని చేతులెత్తేశారు. పేర్లు నమోదు, ప్యాకేజీల గురించి నిర్వాసితులకు అవగాహన కల్పించేవారు లేకపోయారని చెప్పుకొచ్చారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ...కొన్ని ఉదాహరణలను చెప్పుకొచ్చారు. పరీక్షSనిర్ణీత సమయంలో జవాబులు రాయకుండా మరికొంత సమయం పెంచండని అడగడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదో, నిర్వాసితుల పరిస్థితి అంతేనన్నారు. ఇదే చివరి సమావేశమని, ఇకపై మాటలు ఉండవని, పనులే జరుగుతాయన్నారు. పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మాట్లాడుతూ అధికారులపై నిర్వాసితులు దాడి చేయడం వారి పనికాదన్నారు. ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు నిర్వాసితులు వ్యతిరేకం కాదని, వారికి రావాల్సిన నష్టపరిహారం ఇస్తే చాలన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్మన్ చౌదరి ధనలక్ష్మి, జేసీ వివేక్‌యాదవ్, ఆర్డీవోలు దయానిధి, గున్నయ్య, జెడ్పీ సీఈవో వి.వి.ఆర్.ఎస్ మూర్తి, తోటపల్లి ఎస్ఈ డోల తిరుమలరావు పాల్గొన్నారు. -
'నాగావళి, వంశధారనూ అనుసంధానం చేస్తాం'
ఏలూరు : కృష్ణా, పెన్నానదులు అనుసంధానానికి ఆలోచన చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలవరం ఎడమకాల్వను ఏడాదిలోకాగా పూర్తి చేసి... సోమశిలకు నీటిని తరలిస్తామన్నారు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లాలో పట్టిసీమ ఎత్తిపోతల నుంచి చంద్రబాబు నీటిని విడుదల చేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ... 24 పంపులు, 12 పైప్లైన్ల ద్వారా పట్టిసీమ నుంచి నీరు విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు. మరో ఐదారు రోజుల్లో గోదావరి నీళ్లు కృష్ణా నదిలో కలుస్తాయని తెలిపారు. నాగావళి, వంశధార నదులనూ కూడా అనుసంధానం చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. -
వంశధారకు మొదటి ప్రమాద హెచ్చరిక
పాతపట్నం(శ్రీకాకుళం పాతపట్నం): గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఒడిశా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లా హీరమండలంలోని వంశధార నదికి వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం 40 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తుండటంతో.. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. -
ఉత్తర కోస్తాకు వరద ముప్పు
* పొంగుతున్న వంశధార, నాగావళి... గోదావరి ఉగ్రరూపం నెట్వర్క్: ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా జిల్లాలను వరద ముంపు వణికిస్తోంది. అల్పపీడనం ప్రభావంతో ఎగువనున్న ఒడిశా, ఏజెన్సీ ప్రాంతాల్ల కురుస్తున్న భారీ వర్షాలతో వంశధార, నాగావళి భారీగా వరద నీరు చేరుతోంది. తూర్పుగోదావరి జిల్లాలోని గోదావరి నదికి భారీగా వరద పోటెత్తుతోంది. ఆయా నదుల తీర ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లో గడుపుతున్నారు. వంశధార నదిలో నీటి ప్రవాహం ప్రమాదస్థాయికి చేరుకోవడం, నాగావళి నదిలో కూడా నీటి ఉద్ధృతి పెరుగుతుండటంతో ఇప్పటికే పదుల సంఖ్యలో గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. విజయనగరం, విశాఖ జిల్లాల్లోనూ ఏజెన్సీ ప్రాంతాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొండవాగులు, గెడ్డల ఉధృతికి ఏజెన్సీలో పలు గ్రామాలతో రాకపోకలు తెగిపోయాయి. శ్రీకాకుళం జిల్లాలో ఒక వ్యక్తి, విశాఖ జిల్లాలో మరో వ్యక్తి వరదల్లో గల్లంతయ్యారు. 30 గేదెలు కొట్టుకుపోయాయి. ఎగు వ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉపనదులైన ఇంద్రావతి, శబరితో పాటు కొండవాగులు పొంగి ప్రవహిస్తుండటంతో.. వరద నీటితో గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ అన్ని గేట్లనూ ఎత్తివేసి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి గంటకు అడుగు చొప్పున పెరుగుతున్నట్టు అధికారులు తెలిపారు. సోమవారం ఉదయానికి 50 అడుగులు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. జలదిగ్బంధంలో సిక్కోలు గ్రామాలు శ్రీకాకుళం జిల్లాలో వంశధారకు వరద ఉద్ధృతి పెరగడంతో 11 మండలాల పరిధిలోని 124 గ్రామాలు ప్రమాదం అంచున ఉన్నాయి. ఇప్పటికే ఈ మండలాల్లోని వేలాది ఎకరాల వేసిన అరటి, మొక్కజొన్న, వరి, చెరుకు తదితర పంటలు నీట మునిగాయి. వరదలపై అప్రమత్తం: సీఎం ఆదేశం వరదలు పోటెత్తుతున్న ఉత్తరాంధ్ర జిల్లాల్లో తక్షణ సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. ఒడిశాతో పాటు పై ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు పొంగి పొర్లుతుండడంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉత్తరాంధ్రలోని పరిస్థితిపై సీఎం ఆదివారం ఉన్నతాధికారులతో సమీక్షించారు. -
ఉధృతంగా ప్రవహిస్తోన్న వంశధారనది
-
వంశధారకు పోటెత్తిన వరద నీరు
శ్రీకాకుళం : వంశధారకు వరద నీరు పోటెత్తుతుంది. అధికారులు ముందు జాగ్రత్త చర్యగా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసారు. కొత్తూరులో నివగాం, మదనాపురంలోని రహదారిపైకి వరదనీరు చేరింది. ఒడిశాలోని నదీ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురియడంతో శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, బాహుదా, మహేంద్రతనయ నదుల్లో వరదనీరు పోటెత్తుతుంది. వంశధార గొట్టా బ్యారేజీ వద్ద ప్రస్తుత నీటి ప్రవాహం 53వేల క్యూసెక్కులకు చేరింది. అధికారులు బ్యారేజీ అన్ని గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడిచి పెట్టారు. ఇక పై-లీన్ తుపాను బీభత్సానికి శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతం కకావికలమైంది. శనివారం రాత్రి వీచిన ప్రచండ గాలులకు ఒకరు మృతి చెందారు. సుమారు రూ.1,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. ఉద్యాన పంటలు దాదాపు తుడిచిపెట్టుకుపోయాయి. మిగతా పంటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. -
జలదిగ్బంధంలో చెవ్వాకుల పేట
ఆముదాలవలస : శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం చెవ్వాకుల గ్రామం వద్ద వంశధార పొంగి పొర్లుతోంది. దాంతో చెవ్వాకుల గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. మరోవైపు వంశధార వరద ఉధృతి పెరగటంతో 54వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కాగా హీరమండలం వద్ద గొట్టా బ్యారెజ్ అన్ని గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. పై-లిన్ తుపాన్ ప్రభావంతో జిల్లాలో లక్ష ఎకరాల్లో పంట దెబ్బతింది. 20వేల ఎకరాల్లో కొబ్బరి తోటలకు నష్టం వాటిల్లింది, ఇక ఒడిశాలోని పలు ప్రాంతాల్లో నిన్న భారీ వర్షాలు కురియడంతో వంశధార నదికి వరద వచ్చే అవకాశం ఉందని భావిస్తూ కలెక్టర్ మొదటి ప్రమాద హెచ్చరికను జారీచేశారు. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల మరో 10 వేల క్యూసెక్కుల నీరు అదనంగా చేరవచ్చని, దీనివల్ల వరద ప్రమాదం ఉండదని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. వంశధార నదీతీర వాసులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.