Heavy Rains-Telugu States: ఉగ్ర కృష్ణ.. మహోగ్ర గోదావరి | Tungabhadra Godavari Vamsadhara floods at dangerous level at AP | Sakshi
Sakshi News home page

కృష్ణా నది ఉగ్రరూపం దాల్చితే.. గోదావరి మళ్లీ మహోగ్రరూపం, వంశధారలోనూ..

Published Thu, Aug 11 2022 2:55 AM | Last Updated on Thu, Aug 11 2022 3:18 PM

Tungabhadra Godavari Vamsadhara floods at dangerous level at AP - Sakshi

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దిగువకు కృష్ణమ్మ పరవళ్లు

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: నైరుతి రుతు పవనాలు, బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం వల్ల పరీవాహక ప్రాంతాల్లో (బేసిన్‌లో) విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నది ఉగ్రరూపం దాల్చితే.. గోదావరి మళ్లీ మహోగ్రరూపం దాల్చింది. వంశధారలోనూ వరద ఉధృతి కొనసాగుతోంది. కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్ర, గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో తీర ప్రాంతాల గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.

పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, తుంగభద్ర పోటాపోటీగా ప్రవహిస్తున్నాయి. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యామ్‌లలోకి వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్‌ నుంచి 1,81,246 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తుండటంతో బుధవారం మంత్రాలయం వద్ద ప్రమాదకర రీతిలో 312.04 మీటర్లు వద్ద తుంగభద్ర ప్రవహిస్తోంది. కర్నూలు వద్ద 272.76 మీటర్లకు చేరుకుంది. దాంతో మంత్రాలయం, కర్నూలు నగరాలలో ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.



శ్రీశైలం ప్రాజెక్టు పది గేట్లు ఎత్తివేత
ఎగువ నుంచి వస్తున్న వరదకు స్థానికంగా కురిసిన వర్షాల వల్ల వాగులు, వంకల ద్వారా చేరుతున్న జలాలు తోడవడంతో శ్రీశైలంలోకి 3,60,436 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రాజెక్టులో గరిష్ట స్థాయిలో నీరు నిల్వ ఉండటంతో పది గేట్లను 12 అడుగుల మేర ఎత్తి 3,17,460 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. విద్యుదుత్పత్తి చేస్తూ కుడి కేంద్రం ద్వారా 29,833, ఎడమ కేంద్రం ద్వారా 31,784 క్యూసెక్కులు వదులుతున్నారు.



నేడు సాగర్‌ గేట్లు ఎత్తివేత
శ్రీశైలం నుంచి భారీగా వస్తున్న జలాలతో నాగార్జునసాగర్‌ నిండుకుండలా మారింది. సాగర్‌లోకి 3,61,296 క్యూసెక్కులు వస్తున్నాయి. నీటి నిల్వ 583.5 అడుగుల్లో 293.4 టీఎంసీలకు చేరుకుంది. మరో 19 టీఎంసీలు వస్తే ప్రాజెక్టు నిండిపోతుంది. గురువారం ఉదయం 6 గంటలకు సాగర్‌ ఒక గేటును ఎత్తివేయనున్నారు. ఆ తర్వాత ప్రతి గంటకూ ఒక గేటు చొప్పున ఎత్తుతూ 2 లక్షల నుంచి 2.50 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేయనున్నారు. గత మూడేళ్లుగా ఆగస్టులోనే నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ నిండుతోంది. సాగర్‌ డ్యాం గేట్ల నిర్వహణ పనులను అధికారులు ఇప్పటికే పూర్తిచేశారు. డ్యాం 26 క్రస్టు గేట్లకు కొత్త ఇనుప రోప్‌లను బిగించారు. గేట్లకు గ్రీజింగ్, ఇతర మరమ్మతులు పూర్తి చేశారు.



వరద నియంత్రణపై అధికారుల దృష్టి
ఎగువ నుంచి భారీగా ప్రవాహం వస్తుండటంతో వరద నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జలవనరుల శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. నాగార్జున సాగర్‌ టెయిల్‌ పాండ్‌ నుంచి 75,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నందన పులిచింతలలో నీటి నిల్వ 40 టీఎంసీల లోపు ఉంచాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దాంతో పులిచింతల ప్రాజెక్టును ఖాళీ చేస్తున్నారు. దీంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి 80,737 క్యూసెక్కులు చేరుతోంది. ఆ నీటినంతా ప్రకాశం బ్యారేజి నుంచి సముద్రంలోకి వదిలేస్తున్నారు.

ప్రమాదకరంగా గోదావరి
బేసిన్‌లో కురుస్తున్న వర్షాలకు గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. బుధవారం సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్దకు 11 లక్షల క్యూసెక్కులు వస్తోంది. నీటి మట్టం 50.6 అడుగులకు చేరుకుంది. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గురువారం 55 అడుగులకు చేరుతుందని కేంద్ర జల వనరుల శాఖ వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు వద్దకు 10,10,387 క్యూసెక్కులు చేరుతుండటంతో స్పిల్‌వే ఎగువన 33.37 మీటర్లు, దిగువన 24.76 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టులోకి వచ్చిన వరదను 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. దాంతో ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం వద్ద రాత్రి 10 గంటలకు నీటి మట్టం 13.40 అడుగులకు చేరింది. కాటన్‌ బ్యారేజ్‌లోని మొత్తం 175 గేట్లను పూర్తిగా పైకి లేపి 12,43,405 క్యూసెక్కులు సముద్రంలోకి వదులుతున్నారు. గోదావరి డెల్టాకు 6,500 క్యూసెక్కులు వదులుతున్నారు.

వంశధారలో వరద ఉద్ధృతి
బేసిన్‌లో కురుస్తున్న వర్షాలతో వంశధార వరద ఉద్ధృతి కొనసాగుతోంది. గొట్టా బ్యారేజ్‌లోకి 24,124 క్యూసెక్కులు చేరుతుండగా.. ఆయకట్టుకు 2849 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 21,275 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement