ఫై-లీన్ తుపాన్ ప్రభావం నుంచి కోలుకోకముందే శ్రీకాకుళం జిల్లాను అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరదల తాకిడికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గార మండలం కళింగపట్నం పరిసర 15 గ్రామాల జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీ వర్షాలకు వంశధార నది ఉధృతంగా ప్రవహిస్తోంది. లక్ష క్యూసెక్కుల వరద నీరు రావడంతో స్థాయికి మించి పరవళ్లుతొక్కుతోంది. కుత్తూరు మండలం మాతల వద్ద వంశధార రోడ్డుపై ప్రవహిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్-ఒడిశా మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైవేపై భారీ వాహనాలను పోలీసులు ఎక్కడిక్కడ నిలిపివేస్తున్నారు. వరద నీటిలో చిక్కుకున్న హిర మండలం జిల్లోడిపేట గ్రామస్తులను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షిస్తున్నారు.