
హాస్టళ్లకు చీకట్‌లు
కరీంనగర్ సిటీ :
సమస్యల నిలయాలుగా మారిన సంక్షేమ వసతిగృహాలకు కరెంటు కష్టాలు వచ్చాయి. విద్యుత్ బిల్లుల బకాయిలను రాబట్టుకునేందుకు ట్రాన్స్‌కో అధికారులు కరెంటు కనెక్షన్లు తొలగించే పని ప్రారంభించారు. దీనికి జిల్లా కేంద్రం నుంచే శ్రీకారం చుట్టారు. బకాయిల నెపంతో నగరంలోని మంకమ్మతోటలో ఉన్న బీసీ కళాశాల స్థాయి వసతిగృహానికి ట్రాన్స్‌కో సిబ్బంది విద్యుత్ కనెక్షన్ తొలగించారు. మూడు నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో రూ.47 వేల బకాయిలు పేరుకుపోయాయి. ట్రాన్స్‌కో సిబ్బంది హాస్టల్‌కు కరంట్ కట్ చే యడంతో విద్యార్థులు వారం రోజుల పాటు చీకట్లోనే మగ్గిపోయారు.
రూ.37 లక్షల బకాయిలు
జిల్లావ్యాప్తంగా బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 53 ప్రీమెట్రిక్, 25 కళాశాల స్థాయి వసతిగృహాలు ఉన్నాయి. ఈ హాస్టళ్లకు సంబంధించి విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే భరిస్తుంది. ప్రతి మూడు నెలలకోసారి సర్కారు విద్యుత్ బిల్లులు చెల్లింపునకు బడ్జెట్ విడుదల చేస్తే, బీసీ సంక్షేమ శాఖ నుంచి ఆయా హాస్టళ్లకు ఈ నిధులు పంపిస్తారు. వచ్చిన నిధులను సంబంధిత హాస్టల్ వార్డెన్ ట్రాన్స్‌కోకు చెల్లించాల్సి ఉంటుంది. కొంతకాలంగా సర్కారు సరిగా బడ్జెట్‌ను విడుదల చేయకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా కళాశాల స్థాయి వసతిగృహాలు సుమారు రూ.16 లక్షలు, పాఠశాల స్థాయి వసతిగృహాలు రూ.21 లక్షలు... మొత్తం రూ.37 లక్షల విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి ఉంది.
కేటాయింపులు అంతంతే..
లక్షల్లో విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి ఉండగా, ప్రభుత్వం ముందునుంచి కేటాయింపులు అంతంత మాత్రంగానే చేస్తోంది. సంక్షేమ హాస్టళ్లలో మోటార్లు, లైట్లు, ఫ్యాన్ల వినియోగం అధికంగా ఉండడంతో ఒక్కో హాస్టల్‌కు ప్రతి నెలా రూ.10 నుంచి రూ.15 వేల విద్యుత్ బిల్లులు వస్తుంది. విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉన్న హాస్టల్ అయితే రూ.20 నుంచి రూ.25 వేలు కూడా వచ్చిన సందర్భాలున్నాయి.
వీటి కోసం ప్రతి నెలా కాలేజ్ హాస్టళ్లకు రూ.3లక్షలు, పాఠశాల హాస్టళ్లకు రూ.5లక్షలు.. మొత్తం కలిపి కనీసం రూ.8 లక్షలు విడుదల చేస్తే విద్యుత్ బిల్లులు మొత్తం చెల్లించడానికి వీలవుతుంది. కానీ ప్రభుత్వం ఆ స్థాయిలో కాకుండా, ప్రతిసారి నెల బిల్లులో 25 శాతం విడుదల చేస్తోంది. దీంతో విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి. చివరగా గత ఆగస్టులో కాలేజ్ హాస్టళ్లకు రూ.4 లక్షలు, పాఠశాల హాస్టళ్లకు రూ.3.50 లక్షలు విడుదల అయ్యాయి. నెల నుంచి మొత్తానికే కేటాయింపులు చేయడం లేదు.
పొంచి ఉన్న ప్రమాదం
హాస్టళ్లకు విద్యుత్ కనెక్షన్ తొలగింపు సమస్యకు తాత్కాలిక ఉపశమనం కలిగినా, హాస్టళ్ల మెడపై ట్రాన్స్‌కో కత్తి ఇంకా వే లాడుతోంది. మంకమ్మతోటలోని కాలేజ్ హాస్టల్‌కు విద్యుత్ కనెక్షన్ తొలగించి, పునరుద్ధరించినా, బకాయిలు పూర్తిగా చెల్లించే వరకు సమస్య పరిష్కారం కనిపించడం లేదు. విద్యుత్ బకాయిల వసూళ్లపై ట్రాన్స్‌కో సీరియస్‌గా దృష్టిసారించడం తెలిసిందే. ముఖ్యంగా ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన బకాయిల వసూళ్లలోనూ కఠినంగా వ్యవహరిస్తోంది.
ఇందులో భాగంగా ఇటీవల పలు గ్రామపంచాయతీలకు కరెంట్ కనెక్షన్ తొలగించడం జిల్లావ్యాప్తంగా వివాదాస్పదమైంది. ఇదే క్రమంలో హాస్టళ్ల వైపు ట్రాన్స్‌కో దృష్టి మళ్లించడంతో, ఇక్కడా అలాంటి సమస్యే తలెత్తే ప్రమాదం కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో బడ్జెట్ వస్తేనే హాస్టళ్ల బకాయిలు తీరే అవకాశం ఉండడం, ట్రాన్స్‌కో సైతం తమ బకాయిల వసూళ్లపై లక్ష్యం నిర్ధేశించుకొని ఉండడంతో హాస్టళ్లకు కరెంటు కష్టాలు తప్పేలా లేవు.
మరో నాలుగు నెలల్లో వార్షిక పరీక్షలు ఉన్న సమయంలో, హాస్టళ్లలో విద్యుత్ కనెక్షన్ తొలగిస్తే విద్యార్థులపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికైనా బిల్లుల చెల్లింపుపై ట్రాన్స్‌కో అధికారులతో చర్చించి, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత సంక్షేమ శాఖ అధికారులపై ఉంది.
అదేం లేదంటూనే.. విద్యుత్ పునరుద్ధరణ
కాలేజ్ హాస్టల్‌కు విద్యుత్ కనెక్షన్ తొలగించడంపై ‘సాక్షి’ ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ నారాయణను సంప్రదించగా, అలాంటిదేమీ లేదని చెప్పారు. అయితే ఆ వెంటనే పదినిమిషాల్లో హాస్టల్‌కు కరెంటు సరఫరా పునరుద్ధరించడం కొసమెరుపు.