ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కరీంనగర్: కరోనా కారణంగా ప్రైవేటు వసతి గృహాలన్నీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. లక్షల్లో అప్పులు చేసిన నిర్వాహకులను మహమ్మారి ఘోరంగా దెబ్బతీసింది. ప్రవేశాలు నిలిచిపోయి, నిర్వహణ భారాన్ని మోయలేక, పరిస్థితి ఎప్పుడు కుదుటపడుతుందో తెలియక, ఇప్పటికే సగానికి పైగా ఈ వ్యాపారం నుంచి తప్పుకున్నారు. నాలుగు నెలలుగా అద్దె భారం భరించలేక, నష్టాలను తట్టుకోలేక మానసికంగా కుంగిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా గుర్తింపు పొందిన, పొందని వసతి గృహాలు దాదాపు 2వేలకు పైగా ఉన్నాయి. ఇందులో కరీంనగర్ పట్టణంలోని అధికంగా ఉన్నాయి. కరోనా వైరస్ కారణంగా శిక్షణ సంస్థలు మూతపడడంతో ఉద్యోగార్థులు, విద్యార్థులు సొంతూళ్లకు వెళ్లిపోయారు. దీంతో ప్రైవేట్ హాస్టల్స్ నిర్వాహకులు చేసేదేమి లేక వ్యాపారాలు మూసివేస్తున్నారు.
సామగ్రి విక్రయించాలన్నా కష్టమే
వసతి గృహాలను ఏర్పాటు చేసినప్పుడు ఫర్నీచర్‌కు రూ.లక్షల్లో ఖర్చుపెట్టారు. వీటిని విక్రయించాలంటే కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఒక మంచం, పరుపు కోసం కనీసం రూ.3500 నుంచి రూ. 5వేల వరకు వెచ్చించారు. విక్రయించడానికి ప్రయత్నిస్తే రూ.300–400 కూడా రావడం లేదు. మరోవైపు హాస్టళ్లపై ఆధారపడిన ఉద్యోగులు, వంట వారికీ ఉపాధి కరువైంది. కొన్ని వసతి గృహాల్లో రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు సరుకులు దెబ్బతిన్నాయి. వసతి గృహాలతో పాటు ప్రైవేటు స్టడీ కేంద్రాలను సిబ్బంది సీల్ చేయడంతో అందులో సామగ్రి, వస్తువుల నిర్వహణ లేకుండా పోయింది.
Comments
Please login to add a commentAdd a comment