బడుగులు చదువులపై పిడుగుపాటు
నూజివీడు : పేదవర్గాల పిల్లలకు విద్యను అందించేందుకు దశాబ్దాల క్రితం సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వసతిగృహాలను చంద్రబాబునాయుడు ప్రభుత్వం వచ్చాక ఇష్టారాజ్యంగా మూసేస్తోంది. పేదపిల్లలు చదువుకోవడమే పాపమన్నట్లుగా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందంటూ వసతిగృహాలను అడ్డగోలుగా ఎత్తేస్తోంది. గతేడాది జిల్లా వ్యాప్తంగా 30 వసతిగృహాలను మూసేసిన ప్రభుత్వం, మరల ఈ ఏడాది మరో 32 గృహాలను ముసేసింది. మూసేసిన వసతిగృహాలు పోగా సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఇంకా 80 వసతిగృహాలున్నాయి. వీటిలో మరో 50 వసతి గృహాలను వచ్చే ఏడాది ఎత్తేయనున్నట్లు ఆయావర్గాలు చెబుతున్నాయి. తాము చిన్నప్పుడు వసతిగృహాలలోనే ఉండి చదువుకుని నేడు ఈ స్థాయికి చేరుకున్నామని ఉన్నతస్థానాలలో ఉన్న పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పేర్కొంటుండగా, ప్రభుత్వం మాత్రం వసతిగృహాలను మూసేసి పేదవర్గాల పిల్లలకు విద్యను దూరం చేస్తోంది. పారిశ్రామిక వర్గాలకు వేలాది కోట్ల ప్రజాధనాన్ని రాయితీల కింద ఇవ్వడమే కాకుండా, వందలాది ఎకరాలను తక్కువ ధరకు కట్టబెడుతూన్న ప్రభుత్వం, పేద వర్గాల పిల్లలు తలదాచుకుని చదువుకునే సంక్షేమ హాస్టళ్లపై కక్షగట్టడం అటు దళిత, ఇటు బీసీ వర్గాలకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తమ పిల్లల భవిష్యత్తుపై ఆ వర్గాలు బెంగపెట్టుకున్నాయి.
30 మంది ఉన్నప్పటికీ మూతే
నూజివీడు మండలంలోని గొల్లపల్లి, ఆగిరిపల్లి మండలం ఆగిరిపల్లి, ముసునూరు మండలం రమణక్కపేట, ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి, రెడ్డిగూడెం మండలంలోని రెడ్డిగూడెంలలోని సాంఘిక సంక్షేమశాఖ పరిధిలోని వసతిగృహాలను ఈ విద్యాసంవత్సరం నుంచి మూసేశారు. ఈ వసతిగృహాలలో 25నుంచి 30మంది విద్యార్థులున్నప్పటికీ మూసేయడం గమనార్హం. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే గ్రామాలలోకి వెళ్ళి పేద వర్గాలకు చెందిన విద్యార్థులను తీసుకొచ్చి జాయిన్ చేసుకోవాలే గాని, ఇలా మూసేయడమేమిటని విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. మెస్‌ఛార్జీలు, అలంకరణ ఛార్జీలు పెంచాలని, వసతిగృహాలకు కూడా సన్నబియ్యం సరఫరా చేయాలని ఒకవైపు విద్యార్థి సంఘాలు డిమాండు చేస్తుంటే అవేమీ పట్టించుకోకుండా ఏకంగా వసతిగృహాలకు మంగళం పలకడం పట్ల పేదవర్గాలలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.