
శ్రీరంగం ట్రిపుల్ ఐటీ మూసివేత.. ఉద్రిక్తత
చెన్నై: తమిళనాడు తిరుచ్చిలోని శ్రీరంగం ఐఐఐటీ నిరవధికంగా మూతపడింది. ఈ విషయాన్ని ట్రిపుల్ ఐటీ యాజమాన్యం నిన్న ప్రకటించింది. దీంతోపాటు విద్యార్థులు తక్షణమే హాస్టల్స్ ను ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించింది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఐఐఐటీ స్థాయిలో విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయల కల్పనలో యాజమాన్య వైఖరికి నిరసనగా విద్యార్థుల పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యాజమాన్యం ఈ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఫలితంగా హాస్టళ్లలో ఉంటున్న వందలాది మంది విద్యార్థులు రోడ్డున పడ్డారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ జిల్లాల విద్యార్థులు ఉన్నారు.
కాగా విద్యార్ధులు నిర్వహిస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారడంతో తిరుచ్చిలోని బిట్ క్యాంపస్ లో తాత్కాలికంగా నిర్వహిస్తున్న శ్రీరంగం ట్రిపుల్ ఐటీని నిరవధికంగా మూసివేస్తున్నట్లు డైరెక్టర్ డా.టి.సెంథిల్ కుమార్ ప్రకటించారు. కాలేజీ ప్రతిష్టకు భంగకరంగా విద్యార్థుల ప్రవర్తన ఉందని.. ఇంతరకుమించి తమకు వేరేదారి లేదని వాదిస్తున్నారు.
ఒకవైపు శాంతి చర్చలంటూ ఆహ్వానించి, మరోవైపు యాజమాన్యం గైర్హాజరవ్వడంతోపాటుగా ఆందోళన విరమించాల్సిందిగా హెచ్చరికలు జారీ చేశారని విద్యార్థులు ఆరోపించారు. ఇప్పటికిప్పుడు హాస్టళ్లను ఖాళీ చేయమని ఆదేశించడం అప్రజాస్వామికమని, తమ పోరాటం కొనసాగుతుందని విద్యార్థులు స్పష్టం చేశారు. ఈ విషయంలో మానవవనరుల శాఖ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
2013లో శ్రీరంగం ఎంటెక్ కోర్సుతో ఐఐఐటీని ప్రారంభించింది. అప్పటి నుంచి తిరుచ్చి-పుదుక్కోట రోడ్‌లోని అన్నా వర్సిటీ బిట్ క్యాంపస్ లో అరకొర వసతులతో తాత్కాలికంగా నిర్వహిస్తున్నారు. ఆ తరువాత ఏడాది బీటెక్ లో 70 మంది విద్యార్ధులు అడ్మిషన్ పొందారు. త్వరలో శ్రీరంగంలో సంస్ధ నిర్మాణం చేపడతామని ప్రకటించింది. అయితే తొలి సెమిస్టర్ పరీక్షలు పూర్తైనా , భవన నిర్మాణం, మౌలిక వసతుల కల్పనలో యాజమాన్యం విఫలమైందని ఆరోపిస్తూ గత వారం రోజులుగా విద్యార్థులు నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఇప్పుడు సంస్థను నిరవధికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించడం మరింత ఉద్రిక్తతకు దారి తీసింది.