
సాక్షి, అమరావతి: ప్లేట్ ఇడ్లీకి సరిపోయే డబ్బులిచ్చి దాంతో మూడు పూటలా తినమంటే ఏం చేస్తాం.. అర్ధాకలితోనే సరిపెట్టుకుంటాం. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులది ఇప్పుడు ఇదే పరిస్థితి. నిత్యావసర ధరలు చుక్కలనంటుతున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం ఇచ్చే మెస్ చార్జీలు సరిపోక విద్యార్థులు అర్ధాకలితోనే చదువులు కొనసాగిస్తున్నారు.
ఎదిగే వయసులో ఉన్న విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందక ఇబ్బంది పడుతున్నారు. 2012 డిసెంబర్‌లో అప్పటి ప్రభుత్వం సవరించిన మెస్ చార్జీలనే ఇప్పుడూ ఇస్తున్నారు. ఆ ప్రకారం 3 నుంచి 7వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులకు నెలకు రూ. 750, 8 నుంచి 10వ తరగతి చదువుతున్న వారికి నెలకు రూ. 850 మెస్ చార్జీలుగా ప్రభుత్వం ఇస్తోంది.
అంటే 3 నుంచి 7వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థికి రోజుకు రూ.25, 8 నుంచి 10 తరగతులు చదువుతున్న వారికి రోజుకు రూ. 28.33 ప్రభుత్వ కేటాయిస్తోంది. ప్రస్తుతం బయట మెస్‌ల్లో భోజనం చేసినా పూటకు కనీసం రూ. 60 చెల్లించాలి. ఈ నేపథ్యంలో రూ. 25తో హాస్టల్లో పెట్టే భోజనం విద్యార్థులకు ఎలా సరిపోతుందని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
మెనూ అమలు చేయలేక..
హాస్టల్ విద్యార్థులకు ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం పెట్టాలి. కేవలం రూ. 25తో రెండు పూటల అల్పాహారం, రెండు పూటల భోజనం ఎలా వస్తోందో కూడా ఈ ప్రభుత్వానికి ఆలోచనే లేకుండా పోయిందని విద్యార్థులు విమర్శిస్తున్నారు. వారం రోజుల్లో.. రెండు రోజులు ఉదయం ఉప్మా, ఆదివారం ఇడ్లీ లేదా ఉగ్గాని, మిగిలిన నాలుగు రోజుల్లో పొంగల్, పులిహోరా, పులగం, కిచిడీ పెట్టాలి.
భోజనం కూడా మూడు నుంచి ఏడో తరగతి చదువుతున్న విద్యార్థులకు 150 గ్రాములు, 8 నుంచి 10 తరగతి వరకు చదువుతున్న వారికి 200 గ్రాముల అందించాలి. వారంలో నాలుగు రోజులు కోడిగుడ్డు కూడా ఇవ్వాలి. ఈ మెస్ చార్జీల్లో నుంచే బియ్యంతో పాటు గ్యాస్, సరుకుల రవాణా చార్జీలు, ఇడ్లీ పిండి వాటి గ్రైండింగ్ చార్జీలతో పాటు విద్యుత్ బల్బ్ కాలిపోయినా ఖర్చుచేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో మెనూను అమలు చేయడం వార్డెన్లకు తలకు మించిన భారం అవుతోందని విద్యార్థి సంఘ నేతలు చెబుతున్నారు.
పెంపు దస్త్రం సీఎం వద్ద పెండింగ్
మెస్‌చార్జీల పెంపు దస్త్రం ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దే పెండింగ్‌లో ఉందని అధికారులు చెబుతున్నారు. సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా రావెల కిశోర్‌బాబు ఉన్నపుడు మెస్ చార్జీల పెంపునకు ప్రతిపాదనలు రూపొందించారు. ఆ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపించారు. ఇంతవరకు దానికి మోక్షం కలగలేదు.
రద్దవుతున్న హాస్టళ్లు..
సంక్షేమ హాస్టళ్లను ప్రభుత్వం రద్దు చేస్తున్నది. దీంతో నిరుపేదలకు చదువు దూరమైపోతోంది. రద్దయిన హాస్టల్స్ నుంచి విద్యార్థులను రెసిడెన్షియల్ స్కూళ్లకు మారుస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా.. 50 శాతం మంది పిల్లలు డ్రాప్‌అవుట్స్‌గా మారుతున్నారు. సాంఘిక సంక్షేమ శాఖలో 1,259 హాస్టళ్లు ఉండగా 275 హాస్టళ్లను ఇప్పటి వరకు రద్దు చేశారు. ఈ సంవత్సరం మరో 300 హాస్టళ్లు రద్దు చేసేందుకు చర్యలు చేపట్టారు.
గిరిజన సంక్షేమ శాఖలో 497 హాస్టల్స్ ఉండగా ఇప్పటి వరకు 358 హాస్టల్స్ రద్దయ్యాయి. రద్దయిన హాస్టల్స్‌లోని పిల్లలను రెసిడెన్సియల్స్‌లో చేర్పించినట్లు అధికారులు ప్రకటించారు. బీసీ హాస్టల్స్ 897 ఉండగా.. వాటిని ఏడాది రద్దు చేయడానికి బీసీ సంక్షేమ శాఖ చర్యలు మొదలు పెట్టింది. మూడు సంక్షేమ శాఖల కింద ఉన్న హాస్టళ్లలో పదోతరగతి వరకు చదువుతున్న విద్యార్థులు 1,88,917 మంది ఉన్నారు. ఎస్సీ హాస్టళ్లలో 88,214 మంది, ఎస్టీలో 13,034మంది, బీసీ హాస్టళ్లలో 87,669 మంది చదువుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment