సంక్షేమ హాస్టళ్ల మూసివేత | Welfare Hostels Lockdown | Sakshi
Sakshi News home page

సంక్షేమ హాస్టళ్ల మూసివేత

Published Sat, Jul 25 2015 11:20 PM | Last Updated on Fri, May 25 2018 6:12 PM

సంక్షేమ హాస్టళ్ల  మూసివేత - Sakshi

సంక్షేమ హాస్టళ్ల మూసివేత

50 మంది విద్యార్థుల లోపున్న
హాస్టళ్లను సమీప వసతిగృహంలో విలీనం
ఎస్సీ, బీసీ, ఎస్టీ శాఖల పరిధిలో 29 హాస్టళ్లకు పొంచిఉన్న ముప్పు
దుబారా వ్యయం తగ్గించేందుకు ప్రభుత్వ నిర్ణయం
ఆధార్ కార్డు లింకుతో నిగ్గుతేలిన ఎస్సీ విద్యార్థుల సంఖ్య
ఎస్టీ, బీసీ హాస్టళ్లు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశాలు
 

నల్లగొండ : సంక్షేమ వసతి గృహాలను ప్రక్షాళన చే సే దిశగా చర్యలు ఆరంభమయ్యాయి. మంజూరు చేసిన విద్యార్థుల సంఖ్య కంటే వసతి గృహాల్లో ప్రవేశాలు సగానికి పడిపోయాయి. అయినా గానీ పలు చోట్ల విద్యార్థుల సంఖ్యను ఎక్కువ చూపెట్టి వార్డెన్లు నిధుల దుర్వినియోగానికి పాల్పపడుతున్నారు. గతంలో సంక్షేమ వసతి గృహాలపై అవినీతి నిరోధక శాఖ జరిపిన దాడుల్లో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. బోగస్ హాజరును అరికట్టేందుకు ఎస్సీ సం క్షేమ హాస్టళ్లలో ఈ విద్యాసంవత్సరం నుంచి బయోమెట్రిక్  విధానాన్ని ప్రవేశపెట్టారు. కానీ  ఎస్టీ, బీసీ హాస్టళ్లలో ఈ విధానం ఇంకా అమల్లోకి రాలే దు. దీంతో హాస్టళ్లలో నిర్దేశించిన దాని కంటే విద్యార్థులు తక్కువ ఉన్నప్పటికీ ప్రభుత్వం అనవసర ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తోంది. మరోవైపు బోగస్ హాజరు నమోదుతో ప్రతి నెలా లక్షల రూపాయల నిధులు దుర్వినియో గం అవుతున్నాయి. హాస్టల్స్‌లో చోటుచేసుకుం టున్న అక్రమాలు నిరోధించి.. వ్యయం దుబా రా కాకుండా కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 50 మంది విద్యార్థులోపు ఉన్న హాస్టళ్లను మూసేసి వాటిన్నింటినీ సమీపంలోని హాస్టళ్లలో విలీనం చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగానే జిల్లా యం త్రాంగం కసరత్తు ప్రారంభించింది. ప్రాథమిక సమాచారం మేర కు జిల్లా వ్యాప్తంగా 50 మంది విద్యార్థులోపు ఉన్నహాస్టళ్లు 29 ఉన్నాయి. ఈ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులను సమీప హాస్టళ్లలో చేర్పించడం ద్వారా హాస్టళ్ల నిర్వహణ పేరిట ఖర్చువుతున్న లక్షల రూపాయలు ప్రభుత్వానికి మిగులు బడ్జెట్‌గా మారుతుంది.
 
నిగ్గుతేలిన నిజాలు..

 ఎస్సీ హాస్టళ్లలో ప్రవేశపెట్టిన బయెమెట్రిక్ విధానం సత్ఫలితాలు సాధించిందని చెప్పొ చ్చు. బయెమెట్రిక్ విధానం ప్రవేశపెట్టే క్రమంలోనే 50 మంది విద్యార్థులలోపు ఉన్న హాస్టళ్లు కాకుండా మిగిలిన హాస్టళ్లలో అమలు చేస్తున్నారు. బయెమెట్రిక్ హాజరుకు విద్యార్థి ఆధార్ కార్డు వివరాలే కీలకం. దీంతో ఆధార్ కార్డులో విద్యార్థుల స్థానికతకు సంబంధించిన వివరాలు బహిర్గతమవుతున్నాయి. నిబంధనల ప్రకారం గ్రామానికి 5 కి.మీ దాటిన విద్యార్థులకు మాత్రమే హాస్టళ్లలో ప్రవేశం కల్పిస్తారు. అయితే ఆధార్ లేనప్పుడు ఇవేమీ పట్టించుకోకుండా విద్యార్థులను చేర్పించుకున్నారు. గతంలో ఏదేని ప్రభుత్వ అధికారి  ధ్రువీకరించిన కుల, ఆదాయ సర్టిఫికెట్ ఆధారంగా విద్యార్థులకు ప్రవేశం దొరికేది. కానీ ప్రస్తుతం తహసీల్దార్ ధ్రువీకరణ, మీ సేవ కేంద్రాల ద్వారా పొందిన సర్టిఫికెట్లు మాత్రమే హాస్టళ్లలో ప్రవేశానికి అనుమతిస్తున్నారు. ఆధార్ కార్డు వల్ల విద్యార్థుల స్థానికత తెలుస్తోంది. దీం తో ఆధార్ కార్డు వివరాలను బయెమెట్రిక్ అనుసంధానం చేసినప్పుడు ఆటోమెటిక్‌గా విద్యార్థుల అడ్మిషన్‌ను తీసుకోవడమా..? తిరస్కరించడం..? జరుగుతుంది. దీంతో హాస్టల్స్ లో విద్యార్థుల ప్రవేశాలు తగ్గిపోయాయి.

 హాస్టళ్లలో 30నుంచి 40 మందిమాత్రమే..
 తుంగతుర్తి మండల కేంద్రంలోనే 9 వసతి గృహాలు ఉన్న ప్రభుత్వ విద్యాసంస్థలు ఉన్నాయి. ఎస్సీ బాలుర హాస్టల్స్, ఎస్సీ బాలికల హాస్టల్, సాంఘిక సంక్షేమ శాఖ బాలికల రెసిడెన్షియల్ స్కూల్, బాలుర రెసిడెన్షియల్ స్కూల్ (జనరల్), గిరిజన సంక్షేమ శాఖ బాలికల రెసిడెన్షియల్ స్కూల్, ఎస్టీ బాలుర హాస్టల్, బీసీ బాలుర హాస్టల్, కస్తూర్బాగాంధీ బాలిక ల విద్యాలయం, మోడల్ స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్స్‌లో వందల సంఖ్యలో విద్యార్థులు ఉంటే హాస్టళ్లలో 30 నుంచి 40 మందికి మించి విద్యార్థులు చేరడం లేదు. నిన్న మొన్నటి వరకు ఇక్కడ బీసీ కాలేజీ విద్యార్థులకు హాస్టల్‌ను కొనసాగించారు. ఈ ఏడాది విద్యార్థులు ఎవరూ చేరకపోవడంతో ఇటీవల దానిని మూసేశారు.
 రూ. లక్షల్లో దుబారా
 ఒక్కో హాస్టల్‌లో పనిచేసే వార్డెన్, కుక్, కామాటి, వాచ్‌మన్, పార్టీ టైం వర్కర్ల వేతనాలు, అద్దె భవనాలకు చెల్లిస్తున్న వాటితో కలిపి నెలకు సుమారు రూ. రెండు లక్షల వరకు ఖర్చు అవుతోంది. 50 మంది విద్యార్థులోపుఉన్న హాస్టల్‌కు ఎంతైతే ఖర్చువుతుందో అంతే వ్యయం వంద మంది విద్యార్థులు ఉన్న హాస్టల్‌కు వెచ్చించాల్సి వస్తోంది. అనవసరంగా భరించే  ఆర్థిక భారం నుంచి తప్పుకునేందుకే ప్రభుత్వం ‘విలీన’ అస్త్రాన్ని ప్రయోగించింది.

 శాఖల వారీగా ఇదీ పరిస్థితి....
 ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో 121 వసతి గృహాలు ఉన్నాయి. ఈ హాస్టళ్లకు మంజూరు చేసిన విద్యార్థుల సంఖ్య మొత్తం 12,100. కాగా విద్యార్థుల సంఖ్య పూర్తిగా పడిపోవడంతో గతంలోనే ఐదు హాస్టళ్లను మూసేశారు. ఈ విద్యా సంవత్సరంలో మిగిలిన 116 హాస్టళ్లలో 9,739 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. దీంట్లో 50 మంది విద్యార్థుల్లోపు ఉన్న హాస్టళ్లు 26 ఉన్నాయి. భువనగిరి ఏఎస్‌డబ్ల్యూఓ పరిధిలోనే ఎక్కువ ఉన్నట్లు సమాచారం. ఉదాహరణకు అర్వపల్లి, నాగారం, తిరుమలగిరి, తుంగతుర్తి హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య 40 నుంచి 54 లోపు ఉన్నారు.

 ఎస్టీ సంక్షేమ శాఖలో 36 హాస్టళ్లు ఉంటే కేవలం నెమ్మికల్ హాస్టల్‌లో మాత్రమే 50 లోపు విద్యార్థులు ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తం హాస్టళ్లలో మంజూరు చేసిన విద్యార్థుల సంఖ్య 14,810 కాగా.. ఇప్పటి వరకు 13,810 మంది ప్రవేశాలు పొందినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ జిల్లాలో బోగస్ విద్యార్థుల హాజరు ఎక్కువగా ఎస్టీ సంక్షేమ శాఖలోనే నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గతంలో ఏసీబీ అధికారులు సైతం ఎస్టీ, ఎస్సీ హాస్టళ్ల పైనే మెరుపు దాడులు చేయడం ఇందుకు నిదర్శనం.
 బీసీ సంక్షేమ శాఖలో 68 హాస్టళ్లకు గాను మంజూరు చేసిన విద్యార్థుల సంఖ్య 7,715. దీంట్లో ఈ విద్యాసంవత్సరానికి ప్రవేశం పొందిన విద్యార్థులు 7,200 మంది ఉన్నారు. 50లోపు విద్యార్థులు ఉన్న హాస్టళ్లలో కోదాడ మండలం దొండపాడు, అడవిదేవులపల్లి హాస్టళ్లు ఉన్నాయి. దొండపాడు హాస్టల్‌ను కోదాడకు, అడవిదేవులపల్లి హాస్టల్‌ను దామరచర్లకు తరలించాలని అధికారులు నిర్ణయించారు. ఇదిలాఉంటే బీసీ, ఎస్టీ హాస్టళ్లను జిల్లా అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.
 
ఎమ్మెల్యేల అనుమతి తప్పనిసరి..
 నియోజకవర్గంలో సంక్షేమ వసతిగృహాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా స్థానిక ఎమ్మెల్యే అనుమతి తప్పనిసరి. హాస్టళ్లకు అడ్వయిజరీ కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే ఆమోదంతోనే విలీనం చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఎమ్మెల్యేలు ఏవిధంగా వ్యవహారిస్తారన్నది వేచిచూడాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement