సంక్షేమ హాస్టళ్లకు కోత
పేద విద్యార్థులకు వాత
హాస్టళ్లను మూసివేసే దిశగా ప్రభుత్వ చర్యలు
మండలానికో గురుకులం ఏర్పాటుకు కసరత్తు
భవితవ్యంపై పేద విద్యార్థుల బెంగ
పేద విద్యార్థుల జీవితాలతో సర్కారు ఆటలాడుకుంటోంది. ఒకవైపు పాఠశాలల రేషనలైజేషన్ పాట పాడుతూ.. మరోవైపు సంక్షేమ వసతి గృహాలను తగ్గించే పనిలో పడింది. దీంతో చదువుకుందామని ఆశపడిన విద్యార్థులు భవితవ్యాన్ని తలుచుకుని దిగులుచెందుతున్నారు.
మచిలీపట్నం : పేద విద్యార్థులు విద్యను అభ్యసించేందుకు ఆసరాగా ఉన్న సంక్షేమ వసతి గృహాలను తగ్గించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తక్కువ మంది విద్యార్థులు ఉన్న, అద్దె భవనాల్లో నడుస్తున్న వసతి గృహాలను మూసివేసే దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. వసతిగృహాల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు ఉన్నతాధికారులు వివరాలు సేకరిస్తున్నారు. రానున్న మూడేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల సంఖ్యను గణనీయంగా తగ్గించే దిశగా ఈ ప్రయత్నాలు జరుగుతుండడం గమనార్హం. మండలానికో గురుకులాన్ని ఏర్పాటుచేసి వసతి గృహాలను మూసివేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
ఆసరా కోల్పోతారా
జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 119 వసతి గృహాలున్నాయి. వీటిలో బాలురకు 65, బాలికలకు 54 ఉన్నాయి. 8548 మంది విద్యార్థులున్నారు. అద్దె భవనాల్లో నడుస్తున్న వసతిగృహాలు 32 ఉన్నాయి. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలుర వసతి గృహాలు 45, బాలికల వసతి గృహాలు 17 ఉన్నాయి. వీటిలో 4758 మంది విద్యార్థులు ఉన్నారు. అద్దె భవనాల్లో 11 వసతి గృహాలున్నాయి. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బాలుర వసతి గృహాలు 11, బాలికల వసతి గృహాలు 7 చొప్పున మొత్తం 18 ఉన్నాయి. వీటిలో 1008 మంది విద్యార్థులు ఉన్నారు. అద్దె భవనాల్లో, తక్కువ విద్యార్థులు ఉన్న వసతి గృహాలను ఎంపిక చేసి వాటిని మూసివేస్తారనే ప్రచారం జరుగుతోంది. తక్కువ మంది విద్యార్థులున్న వసతిగృహాలను గుర్తించి అన్ని సౌకర్యాలు ఉన్న సమీకృత వసతిగృహాల్లోకి ఈ విద్యార్థులను పంపనున్నారు.
50 మందిలోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి ఖర్చు తగ్గించుకోవడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టిసారించింది. కొన్ని సంక్షేమ వసతి గృహాల్లో కనీస వసతులు లేకపోవడంతో విద్యార్థులు అక్కడ చేరేందుకు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. వసతి గృహాలను మూసివేస్తూనే వాటి స్థానంలో గురుకులాలను ఏర్పాటుచేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తోంది. గురుకులాల్లోనైనా వసతులు కల్పిస్తారో.. లేక గాలికొదిలేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. విద్యార్థులు తక్కువగా ఉన్న వసతిగృహాలు, అద్దె భవనాల్లో నడుస్తున్న వసతి గృహాలు.. వాటికి ఎంతెంత ఖర్చు అవుతుంది... తదితర వివరాలను ఆయా సంక్షేమ శాఖ అధికారులు సేకరిస్తున్నారు. వసతిగృహాల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం పలు సూచనలు చేసిందని, ఆ మేరకు వివరాలు సేకరిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.