గిరిజన పిల్లల బడిబాటకు కసరత్తు | The tribal school children to exercise trail | Sakshi
Sakshi News home page

గిరిజన పిల్లల బడిబాటకు కసరత్తు

Published Wed, Apr 15 2015 3:56 AM | Last Updated on Sun, Sep 3 2017 12:18 AM

గిరిజన పిల్లల బడిబాటకు కసరత్తు

గిరిజన పిల్లల బడిబాటకు కసరత్తు

* జూన్‌లో కొమురం భీం ఎడ్యుకేషనల్ ఫెస్టివల్
 
*  నేడు బడి వయసు పిల్లల గుర్తింపునకు సర్వే
సాక్షి, హైదరాబాద్: బడి మానేస్తున్న, చదువుకు దూరమవుతున్న గిరిజన పిల్లల పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు వివిధ రూపాల్లో చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో కొత్త విద్యార్థులను చేర్చుకునేందుకు జూన్ 15-20 తేదీల్లో ‘కొమురం భీం ఎడ్యుకేషన్ ఫెస్టివల్’ను నిర్వహించనుంది.

ఈ కార్యక్రమం కింద గిరిజన తల్లితండ్రులతో టీచర్ల సమావేశాలు, టీచర్లు, పిల్లలతో ర్యాలీలు, టీచర్లు, ఎన్జీవోలు ఇంటింటికీ వెళ్లి కొత్త విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించడం, బాలికల విద్యా దినోత్సవం వంటి వాటిని నిర్వహించాలని నిర్ణయించింది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచాక గిరిజన పిల్లలను చేర్చుకునేందుకు, ఇందుకు సంబంధించి తల్లిదండ్రుల్లో అవగాహన కల్పిం చేందుకు ఆయా కార్యక్రమాలు చేపట్టనుంది. అర్హులైన గిరిజన బాలబాలికల వంద శాతం ఎన్‌రోల్‌మెంట్ దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లాల అధికారులను ఆదేశించింది.

దీనిలో భాగంగా గిరిజన ఆవాసాల్లో ఐదేళ్లకు పైబడిన బడిఈడు పిల్లలను గుర్తించేందుకు బుధవారం సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వేలో ప్రైమరీ స్కూల్ టీచర్లంతా పాల్గొనేలా ఆదేశాలు జారీచేశారు. గిరిజన పిల్లలు స్కూళ్లలో చేరి చదువు కొనసాగించేలా చర్యలు చేపట్టేందుకు  6-14 ఏళ్ల వయసు వారి జాబితాను అంగన్‌వాడీ టీచర్లు, వర్కర్లు, గ్రామపెద్దల నుంచి తీసుకోనున్నారు. ముందుగా ఆయా పిల్లల వివరాలు, సమాచారాన్ని తీసుకుని వారిని స్కూళ్లలో చేర్పించేందుకు ఉపయోగించుకోవాలని గిరిజన సంక్షేమశాఖ నిర్ణయించింది. పిల్లల తల్లితండ్రులకు విద్యావశ్యకతను వివరించి, వారిని పాఠశాలల్లో చేర్పించేలా టీచర్లు చొరవ తీసుకోవాలని నిర్దేశించింది. జూన్‌లో గిరిజన విద్యార్థులందరికీ టెక్ట్స్‌బుక్స్, నోట్‌బుక్స్ అందించాలని, స్కూల్ యూనిఫారాలు సరఫరా చేయాలని నిర్ణయించారు.
 
బాలికలపై ప్రత్యేక శ్రద్ధ...
బడులకు దూరమైన విద్యార్థులను ముఖ్యంగా బాలికలను అన్ని కసూర్భాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), మినీ గురుకులాల్లో చేర్చుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను గిరిజన సంక్షేమశాఖ ఆదేశించింది. ముఖ్యంగా అమ్మాయిలను 10వ తరగతి వరకు చదివించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇందుకోసం గ్రామాల్లోని గిరిజన యువత, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులతో ర్యాలీలను నిర్వహించి గిరిజన పిల్లలను స్కూళ్లలో చేర్పించే విషయంలో తల్లితండ్రులను చైతన్యవంతం చేయాలని నిర్ణయించారు. విద్యా హక్కు చట్టంపై గిరిజనుల్లో అవగాహన కల్పించేందుకు సాంస్కృతిక బృందాలతో ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement