కరీంనగర్ సిటీ :
సంక్షేమ వసతిగృహాల్లో బోగస్ దందా శ్రుతిమించిపోతోంది. లేని విద్యార్థులను ఉన్నట్లు చూపిస్తూ పలువురు వార్డెన్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఆయా హాస్టళ్లకు డ్రాయింగ్ అధికారులు సంబంధిత వార్డెన్లే కావడంతో వారి ఇష్టారాజ్యం కొనసాగుతోంది. వాస్తవ సంఖ్యకు నాలుగు, ఐదు రెట్లు ఎక్కువగా హాజరుపట్టికలో చూపిస్తూ, ప్రతి నెలా రూ.లక్షల్లో బిల్లులు కాజేస్తున్నారు.
జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతిగృహాలు కలిపి మొత్తం 200 వరకు ఉన్నాయి. ఈ హాస్టళ్లలో కొంతమంది వార్డెన్లు నిజాయితీగా విధులు నిర్వర్తిస్తున్నా, చాలా మంది వార్డెన్లు అక్రమాలకు తెరలేపుతున్నారు. లేని విద్యార్థులను ఉన్నట్లు చూపుతూ ఖజానాకు గండికొడుతున్నారు. హాస్టళ్లకు పౌరసరఫరాల శాఖ ద్వారా బియ్యం పంపిణీ చేయడంతోపాటు, ఉన్న విద్యార్థులకు ఒక్కొక్కరికి సుమారుగా ప్రతి నెల కు రూ.800 చెల్లిస్తుంది. ఈ డబ్బులతోనే సదరు వార్డెన్ హాస్టల్ నిర్వహణ చేపడుతుంటారు. ఏ రోజుకారోజు విద్యార్థుల హాజరు ఆధారంగా సంబంధిత వార్డెన్ ప్రతినెలా బిల్లు చేసి ఆన్‌లైన్‌లో ఆయాశాఖలకు పంపించి డ్రా చేస్తుంటా రు.
అయితే తమకున్న డ్రాయింగ్‌పవర్‌ను అడ్డుపెట్టుకుంటున్న చాలా మంది వార్డెన్లు విద్యార్థుల సంఖ్యలో భారీ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఒక హాస్టల్‌లో ఒక రోజు వాస్తవానికి 25 మంది ఉంటే, ఆ రోజు 100 మంది హాస్టల్‌లో ఉన్నట్లు హాజరుపట్టికలో పేర్కొంటారు. అంటే 75 మంది విద్యార్థులు లేకున్నా ఉన్నట్లు చూపించి, వారి పేరిట వచ్చే డబ్బులు వార్డెనే కాజేస్తుంటారు. ఇటీవల విజిలెన్స్ సోదాలు నిర్వహించిన కోహెడ మండలం శనిగరం బీసీ హాస్టల్ ఉదంతమే తీసుకొంటే... హాస్టల్‌లో అక్రమాలు జరుగుతున్నాయని బీసీ సంఘం నాయకులు 2012, మార్చిలో చేసిన ఫిర్యాదుతో బీసీ సంక్షేమశాఖ అధికారులు విచారణ చేపట్టారు. 120 మంది ఉన్నట్లు హాజరు పట్టికలో ఉండగా, వాస్తవానికి పదికి మించి కూడా విద్యార్థులు లేరని తేలడంతో అధికారులు అవాక్కయ్యారు.
అక్రమాలకు పాల్పడిన వార్డెన్‌ను సస్పెండ్ చేయాలంటూ సంఘాలు ఆందోళనకు దిగగా, అప్పటి ఎస్సీ కార్పొరేషన్ ఈడీని ఆర్‌సీ నెం. ఏ/675/2012 ద్వారా విచారణ అధికారిగా నియమించారు. ఈడీ విచారణలోనూ బోగస్ విద్యార్థులున్నట్లు తేలింది. దీనితో సదరు వార్డెన్‌ను సస్పెండ్ చేస్తూ, రెండు ఇంక్రిమెంట్లు కోత విధించారు. సంబంధిత వార్డెన్ స్వల్ప శిక్షతో బయటపడడానికి జిల్లా కార్యాలయంలోని కొంతమంది సిబ్బంది సంపూర్ణ సహకారాలు అందించినట్లు సమాచారం. కాగా, శిక్ష పూర్తయిందనే సాకుతో సదరు వార్డెన్ మళ్లీ 2013 ఏప్రిల్ వరకు 120 మంది విద్యార్థులున్నట్లు బిల్లులు సృష్టించి స్వాహా చేసినట్లు తెలిసింది.
ఈ సంఘటనలతోనే ముగిసిందనుకున్న వ్యవహారాన్ని విజిలెన్స్ విభాగం గత నెలలో తిరగదోడినట్లు అధికార వర్గాల కథనం. శనిగరంతోపాటు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఈ తంతు యథేచ్ఛగా సాగుతోంది. పెద్దపల్లిలోని ఓ హాస్టల్‌లో ప్రతి రోజు 70 నుంచి 90 వరకు విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా వేస్తూ సదరు వార్డెన్ రూ.లక్షలు కాజేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మరికొన్ని హాస్టళ్లకు ఇన్‌చార్జీగా ఉన్న ఆ వార్డెన్ హాజరు పట్టికను కంటపడనీయకుండా దాచేయడం, ఎవరొచ్చినా తాను లేనంటూ తప్పించుకోవడంతో అక్రమాలు ఇప్పటివరకు బయటపడడం లేదు. వీటితోపాటు గతంలో ఏసీబీ దాడుల్లోనూ బోగస్ విద్యార్థుల సంఖ్య వెలుగు చూసినా, తీరు మాత్రం మారడం లేదు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని హాస్టళ్లలో కొనసాగుతున్న బోగస్ దందాపై దృష్టి సారిస్తే తప్ప అక్రమాలకు అడ్డుకట్ట పడే అవకాశం లేదు.
హాస్టళ్లలో బోగస్ దందా!
Published Mon, Oct 13 2014 3:13 AM | Last Updated on Sat, Sep 2 2017 2:44 PM
Advertisement
Advertisement