
బీసీ హాస్టళ్లలో ఖాళీల మోత..!
మొత్తం 549 పోస్టులు ఖాళీ
హైదరాబాద్: రాష్ర్టంలోని చాలామటుకు బీసీ ప్రీమెట్రిక్, పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్లలో వార్డెన్లతో సహా వాచ్‌మెన్, కామాటీ, వంటవాళ్ల ఖాళీ పోస్టులు భర్తీ కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. విద్యాసంవత్సరం మొదలయ్యేనాటికే అన్ని వసతులను కల్పిస్తామని, విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో లోటు లేకుండా చేస్తామన్న మంత్రి ప్రకటనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ అనే తేడా లేకుండా ఆయా హాస్టళ్లలో ఖాళీల భర్తీకి ప్రభుత్వపరంగా చర్యలు కరువవుతున్నాయి. స్కూల్, కాలేజీ హాస్టళ్లలో విద్యార్థుల బాగోగులు చూసే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
239 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల పోస్టులు ఖాళీ
రాష్ర్టంలోని మొత్తం 490 ప్రీ మెట్రిక్, పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్లలో వార్డెన్, వంటవాళ్లు, వాచ్‌మెన్, కామాటీలు కలుపుకుని 549 పోస్టులు ఖాళీగా ఉండటం హాస్టళ్లలో ఉన్న స్థితికి అద్దం పడుతోంది. ప్రీమెట్రిక్, పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్లలో 239 హేచ్‌డబ్ల్యూఓ పోస్టులు ఖాళీగా ఉండగా.. ప్రీమెట్రిక్‌కు సంబంధించి 177 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు, పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్లలో 62 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (హేచ్‌డబ్ల్యూఓ) పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఆర్థికశాఖ వద్ద ఫైల్
వార్డెన్ పోస్టులను టీఎస్‌పీఎస్‌సీ ద్వారా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమశాఖ ద్వారా పంపిన ఫైలు ఆర్థికశాఖ పరిశీలనలో ఉంది. అంతేకాకుండా హాస్టళ్లకు కామాటీలు, వంటవాళ్లు, వాచ్‌మెన్‌ను ఔట్ సోర్సింగ్ ద్వారా నియమించుకునేందుకు అనుమతినివ్వాలని ఆర్థికశాఖను బీసీశాఖ కోరింది. వార్డెన్ పోస్టుల భర్తీకి సమయం పట్టినా, వంటవాళ్లు, కామాటీ, వాచ్‌మెన్ పోస్టులను ఔట్‌సోర్సింగ్ ద్వారా భర్తీ చేసేందుకు త్వరలోనే ఉత్తర్వులు వెలువడవచ్చునని ఈ శాఖ అధికారులు ఆశాభావంతో ఉన్నారు.