జైళ్ల శాఖ కోస్తాంధ్ర రీజియన్ డీఐజీ రవికిరణ్ వెల్లడి
ఆరిలోవ (విశాఖ జిల్లా): విశాఖ కేంద్ర కారాగారంలో నిబంధనలు ఉల్లంఘించిన 37 మంది వార్డర్లపై క్రమశిక్షణా చర్యలు చేపట్టినట్లు జైళ్ల శాఖ కోస్తాంధ్ర రీజియన్ డీఐజీ రవికిరణ్ తెలిపారు. విశాఖ కేంద్ర కారాగారం పర్యవేక్షణాధికారి ఎం.మహేశ్‌బాబు అవమానించారని.. విధి నిర్వహణలో కఠినంగా ఉంటున్నారంటూ వార్డర్లు తమ కుటుంబసభ్యులతో జైలు ప్రధాన ద్వారం ఎదుట ధర్నా చేశారు. ఈ విషయం తెలుసుకున్న డీఐజీ రవికిరణ్ శనివారం అర్ధరాత్రి రాజమండ్రి నుంచి విశాఖకు చేరుకున్నారు.
వార్డర్లతో, జైలు సూపరింటెండెంట్‌తో చర్చించారు. ఆదివారం ఉదయం జైలును సందర్శించి.. ఖైదీలతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జైలులో ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అందరికీ ఒకే విధమైన నిబంధనలు వర్తిస్తాయన్నారు. జైలు లోపలకు నిషేధిత వస్తువులు తెచ్చారని అనుమానం వస్తే.. ఎవరినైనా వెంటనే తనిఖీ చేయవచ్చని చెప్పారు. అందులో భాగంగా సూపరింటెండెంట్ సమక్షంలో డిప్యూటీ సూపరింటెండెంట్.. ఇద్దరు వార్డర్లను తనిఖీ చేశారని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించి జైల్ ముందు ధర్నా చేసి.. విధులకు గైర్హాజరైన 37 మంది వార్డర్లను రాష్ట్రంలోని వేర్వేరు జైళ్లకు బదిలీ చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment