disciplinary action
-
శ్రీలంక ఆటగాడిపై క్రమశిక్షణా చర్యలు.. వెంటనే తిరిగి రావాలని..!
శ్రీలంక యువ ఆటగాడు కమిల్ మిషారాపై ఆ దేశ క్రికెట్ బోర్డు క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న శ్రీలంక జట్టులో మిషారా భాగమై ఉన్నాడు. అయితే రెండు టెస్టులోను అతడికి తుది జట్టులో అవకాశం దక్కలేదు. కాగా శ్రీలంక జట్టు బస చేస్తున్న హోటల్ మిషారా గదిలో ఓ అజ్ఞాత వ్యక్తి ఉన్నట్లు తెలుస్తుంది. తద్వారా ఆటగాళ్ల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించనందకుకు తక్షణమే అతడు స్వదేశానికి తిరిగి రావాలని శ్రీలంక క్రికెట్ ఆదేశించింది. "మేము హోటల్ సీసీటీవీ ఫుటేజ్‌ను పరీశీలించాం. మేము చూసిన వాటిపై మేము అతడిని విచారించాలి అనుకుంటున్నాము" అని శ్రీలంక క్రికెట్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇక 21 ఏళ్ల కమిల్ మిషారా ఇప్పటి వరకు మూడు టీ20లు మాత్రమే ఆడాడు. ఇక బంగ్లాదేశ్- శ్రీలంక మధ్య తొలి టెస్ట్ డ్రా ముగిసిన సంగతి తెలిసిందే. ఇక ఛాటోగ్రామ్ వేదికగా జరగుతోన్న నిర్ణయాత్మక రెండు టెస్టులో ఇరు జట్లు తలపడతున్నాయి చదవండి:Shubman Gill: గిల్ గురించి మీరు మాట్లాడేది తప్పు: జర్నలిస్టుకు విక్రమ్ కౌంటర్ -
మతి తప్పిన జ్వెరెవ్.. టోర్నీ నుంచి గెంటేసిన నిర్వాహకులు
అకాపుల్కో (మెక్సికో): ప్రపంచ మూడో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) హద్దు మీరాడు. మెక్సికో ఓపెన్ టెన్నిస్ టోర్నీలో జ్వెరెవ్ తన రాకెట్‌తో అంపైర్‌ను దాదాపు కొట్టినంత పని చేశాడు. దాంతో జ్వెరెవ్ నిర్వాకంపై టోర్నీ నిర్వాహకులు క్రమశిక్షణ చర్య తీసుకున్నారు. టోర్నీలో అతను సింగిల్స్ మ్యాచ్ ఆడాల్సిన పనిలేదంటూ ఇంటికి పంపించేశారు. వివరాల్లోకి వెళితే... మంగళవారం రాత్రి జరిగిన డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో జ్వెరెవ్ –మార్సెలో మెలో (బ్రెజిల్) జోడీ 2–6, 6–4, 6–10తో గ్లాస్‌పూల్ (బ్రిటన్)–హారి హెలియోవారా (ఫిన్లాండ్) జంట చేతిలో ఓడింది. మ్యాచ్ సందర్భంగా అంపైర్ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన జ్వెరెవ్ తుది ఫలితం తర్వాత తన రాకెట్‌తో ఏకంగా చైర్ అంపైర్ కుర్చీకేసి బాదాడు. అంపైర్ తన కాళ్లను దగ్గరకు తీసుకోకపోతే కచ్చితంగా గాయమయ్యేది. ‘క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిన జ్వెరెవ్‌ను టోర్నీ నుంచి తప్పించాం’ అని అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ తెలిపింది. మరోవైపు తన హద్దుమీరిన ప్రవర్తనపై జ్వెరెవ్ బుధవారం స్పందించాడు. చైర్ అంపైర్‌తోపాటు టోర్నీ నిర్వాహకులకు క్షమాపణలు చెప్పాడు. Alexander Zverev has been THROWN OUT of the Mexican Open for attacking the umpire's chair at the end of his doubles match 😮😮😮 pic.twitter.com/CWhQ1r6kwj — Amazon Prime Video Sport (@primevideosport) February 23, 2022 -
సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మపై క్రమశిక్షణా చర్యలు!
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) మాజీ డైరెక్టర్ అలోక్ వర్మపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ డిపార్ట్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీఓపీటీ)కి సిఫారసు చేసింది. అధికార దుర్వినియోగానికి పాల్పడడం, సర్వీసు రూల్స్ ఉల్లంఘించడం వంటి ఆరోపణల నేపథ్యంలో హోంశాఖ ఈ మేరకు సిఫారసు చేస్తూ డీఓపీటీకి లేఖ రాసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆరోపణలు రుజువైతే అలోక్ పెన్షన్, రిటైర్మెంట్ ప్రయోజనాలను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా జప్తు చేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి. అలోక్ 2017 ఫిబ్రవరి 1న సీబీఐ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు కొనసాగారు. అప్పుడే తన కింద పని చేసే మరో అధికారి రాకేశ్ ఆస్తానాతో తగాదా పెట్టుకున్నారు. ఇరువురు అధికారులు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. కేంద్ర హోంశాఖ చేసిన సిఫార్సును డీఓపీటీ యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్‌కి పంపించింది. -
జాత్యహంకారం.. కెమెరాకు చిక్కిన ప్లేయర్
బెల్గ్రేడ్: జాత్యంహకారం, సెక్సీయెస్ట్ కామెంట్ల నేపథ్యంలో ఆటగాళ్లపై వేటు పడుతున్న ఘటనలు ఈమధ్య వరుసగా జరుగుతున్నాయి. అంతేకాదు పాత ఘటనల్ని సైతం తవ్వి తీసి.. విమర్శిస్తున్నారు. ఈ తరుణంలో సెర్బియన్ వాలీబాల్ ప్లేయర్ ఒకరు.. కోర్టులోనే జాత్యహంకార ధోరణిని ప్రదర్శించి వేటుకి గురైంది. జూన్ 1న థాయ్‌లాండ్, సెర్బియా మహిళా జట్ల మధ్య వాలీబాల్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ మధ్యలో సంజా జుర్డ్జెవిక్ అనే సెర్బియన్ ప్లేయర్.. థాయ్‌లాండ్ ఆటగాళ్లను వెక్కిరిస్తూ సైగ చేసింది. ఇది థాయ్ ఆటగాళ్లు పట్టించుకోకపోయినా.. ఆమె అలా చేసినప్పుడు స్క్రీన్ షాట్స్ వైరల్ అయ్యాయి. దీంతో అగ్గిరాజుకుంది. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో సంజా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వివరణ ఇచ్చుకుంది. తాను మ్యాచ్ ముగిశాకే థాయ్‌లాండ్ టీంకు క్షమాపణలు చెప్పానని, ఇప్పుడు మరోసారి చెప్తున్నానని ప్రకటించింది. అయినా వివాదం చల్లారక పోవడంతో ఆమెపై రెండు మ్యాచ్‌ల నిషేధంతో పాటు 16 వేల పౌండ్ల ఫైన్ కూడా విధించింది ఇంటర్నేషనల్ వాలీబాల్ ఫెడరేషన్. ఈ జరిమానాను యాంటీ డిస్క్రిమినేషన్ ఛారిటీకి లేదంటే ఏదైనా ఎడ్యుకేషనల్ సొసైటీకి డొనేట్ చేయాలని వెల్లడించింది. మరోవైపు ఈ ఘటనపై సెర్బియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ కూడా క్షమాపణలు చెప్పింది.ఇంతకుముందు 2017లో సెర్బియన్ వాలీబాల్ టీం యూరోపియన్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ తర్వాత.. ఇలాంటి చేష్టలకే పాల్పడి విమర్శలు ఎదుర్కొంది. 2008లో స్పానిష్ బాస్కెట్‌బాల్ టీం, 2017లో అర్జెంటీనా ఫుట్‌బాల్ టీం. చైనా వాళ్లను అవహేళన చేస్తూ కళ్లను చిన్నవి చేసి ఫొటోలు దిగి విమర్శలపాలయ్యాయి. చదవండి: ఫ్రస్ట్రేషన్ ట్వీట్లపై సారీ! -
‘ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలు’
అమరావతి: ఏపీకి ఇంటెలిజేన్స్ విభాగంలో చీఫ్‌గా పనిచేసిన మాజీ ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశిస్తూ ఏపీ ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది. ఆయన అఖిల భారత సర్వీసు రూల్స్‌కు విరుద్ధంగా ఇతర అధికారులపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారని ఆరోపించింది. అదే విధంగా గోప్యంగా ఉంచాల్సిన అధికారిక సమాచారాన్ని కూడా బహిర్గతం చేశారంటు ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి. కాగా, దీనిపై 30 రోజుల్లోపు వ్యక్తిగతంగా హజరవ్వడంతో పాటు,లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావుని ఆదేశించింది. ఒకవేళ సరైన వివరణ ఇవ్వనట్లైతే, సాక్ష్యాధారాల ఆధారంగా తదుపరి చర్యలుంటాయని తెలిపింది. -
సొంత హెలికాప్టర్‌ను కూల్చడం పెద్ద తప్పు
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఫిబ్రవరి చివరలో.. తమ సొంత హెలికాప్టర్‌ను కశ్మీర్లో తామే కూల్చివేయడం అతిపెద్ద తప్పిదమని వైమానిక దళ(ఐఏఎఫ్) ప్రధానాధికారి రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా అంగీకరించారు. పాక్ వైపు నుంచి జరిగే ఏ దాడులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తక్కువ సమయంలోనే స్పందించి, సైన్యం, నౌకాదళంతో సమన్వయం చేసుకుని దాడులు చేయగలమన్నారు. ఫిబ్రవరి 27న పొరపాటున బుద్గాం జిల్లాలో ఐఏఎఫ్‌కు చెందిన ఎంఐ 17 చాపర్‌ను వైమానిక దళం భూమి మీది నుంచి ఆకాశంపై ప్రయోగించగల క్షిపణి ద్వారా కూల్చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు ఐఏఎఫ్ అధికారులు, ఒక పౌరుడు మరణించారు. ఈ ఘటనపై జరిపిన అంతర్గత విచారణ ముగిసిందని, బాధ్యులుగా తేలిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని భదౌరియా శుక్రవారం తన తొలి ప్రెస్మీట్లో వెల్లడించారు. ఇద్దరు సీనియర్ అధికారులపై కోర్టు మార్షల్ ప్రక్రియ ప్రారంభించామన్నారు.అంతకుముందు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని బాలాకోట్‌లో ఉన్న ఉగ్ర స్థావరాలపై ఐఏఎఫ్ చేసిన దాడులకు సంబంధించిన వీడియో క్లిప్‌లను ప్రదర్శించారు. చాపర్‌లోని సిబ్బంది, కంట్రోల్ సెంటర్లోని అధికారుల మధ్య సమాచార లోపం విచారణలో స్పష్టంగా కనిపించిందని భదౌరియా తెలిపారు. కూల్చివేతకు గురైన సమయంలో చాపర్‌లోని ‘ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫ్రెండ్ ఆర్ ఫో’(ఐఎఫ్ఎఫ్– మిత్రుడా, శత్రువా గుర్తించడం) సిస్టమ్ నిలిపేసి ఉందని వాయుసేన వర్గాలు వెల్లడించాయి. దాంతో శత్రు చాపర్‌గా భావించి దానిని క్షిపణి ద్వారా కూల్చివేశారన్నారు. ఫిబ్రవరి 27న కశ్మీర్‌లోని నౌషేరాలో భారత్, పాక్‌ల మధ్య యుద్ధ విమానాలు భీకర పోరు సలుపుతున్న సమయంలో భారత్‌కు చెందిన ఎంఐ 17 కూల్చివేతకు గురైన విషయం తెలిసిందే. డ్రోన్లతో ముప్పు సరిహద్దుల్లో డ్రోన్ల ద్వారా ఆయుధాలను జారవిడవడం కొత్త ముప్పుగా మారిందని భదౌరియా పేర్కొన్నారు. పాక్‌లోని ఉగ్ర సంస్థలే దీనికి పాల్పడుతున్నాయన్నారు. టిబెట్ ప్రాంతంలో చైనా భారీగా మిలటరీ కేంద్రాలను ఏర్పాటు చేస్తుండటాన్ని నిశితంగా గమనిస్తున్నామన్నారు.అయితే, దానిపై అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పాక్ ఒప్పుకోకపోయినా, ఫిబ్రవరి 27న పాక్‌కు చెందిన ఎఫ్ 16ను భారత్ కూల్చివేయడం వాస్తవమేనని స్పష్టం చేశారు. మరో బాలాకోట్ తరహా దాడులకు సిద్ధమేనా అన్న ప్రశ్నకు.. ప్రభుత్వ ఆదేశాలపై, లక్ష్యాలేవైనా, వాటి పని పడ్తామని సంసిద్ధత వ్యక్తం చేశారు. భారత వైమానిక దళ సమాచార వ్యవస్థను భవిష్యత్తులో పాక్ అడ్డుకునే వీలు లేకుండా సాంకేతికతను మెరుగుపర్చామన్నారు. పాక్ ఎఫ్ 16ను కూల్చేసిన అనంతరం భారత వింగ్ కమాండర్ వర్ధమాన్ అభినందన్‌కు భారత వాయుసేన నుంచి సందేశాలు నిలిచిపోవడం వల్లనే, ఆయన ప్రయాణిస్తున్న మిగ్ 21ను పాక్ దళాలు కూల్చివేయగలిగాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. -
ఫ్లైట్‌లో మిగిలిపోయిన ఫుడ్ తిన్నారని..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా విమానాల్లో చేతివాటం చూపించిన ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలకు దిగింది. విమాన ప్రయాణికులకు వడ్డించగా మిగిలిన ఆహారాన్ని దొంగిలించారన్న ఆరోపణలతో సిబ్బందిపై చర్యలు చేపట్టింది. నలుగుర్ని 63 రోజుల పాటు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్ ఇండియా కేటరింగ్ విభాగంలోని అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ అసిస్టెంట్ మేనేజర్ తోపాటు, మరో ఇద్దరు క్యాబిన్ సిబ్బందిపై వేటు పడింది. విమానాల్లో విక్రయింగా మిగిన ఆహారం, పొడి రేషన్లను దొంగిలించి, వ్యక్తిగత వినియోగానికి వాడుకోవడంతో వారిపై క్రమశిక్షణా చర్య తీసుకున్నామని పేరు చెప్పడానికి ఇష్టపడని సంస్థ సీనియర్ అధికారి తెలిపారు. ఈ వ్యవహారాన్ని గమనించిన మూడు రోజుల్లోనే చర్యలు తీసుకున్నామన్నారు. ముఖ్యంగా ఎయిర్ ఇండియా ఛైర్మన్, ఎండీ అశ్వాని లోహాని 2017, ఆగస్టులో జారీచేసిన సర్క్యులర్ ప్రకారం ఈ చర్య చేపట్టామని వెల్లడించారు. అంతేకాకుండా, గత ఏడాది మార్చిలో ఇదే విషయంపై న్యూఢిల్లీ-సిడ్నీ విమానంలోని ఇద్దరు క్యాబిన్ సిబ్బందిని హెచ్చరించినట్టు తెలిపారు. అయితే దీనిపై ఎయిర్ ఇండియా అధికారికంగా స్పందించాల్సి ఉంది. కాగా గతనెల (ఫిబ్రవరి)లో ఎయిరిండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా అశ్వాని లోహాని తిరిగి నియమితులయ్యారు. రైల్వేబోర్డు చైర్మన్‌గా విధులు నిర్వహించిన లోహనిని రెండోసారి నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. -
పరువు పాతాళంలోకి!
అనూహ్యంగా బయటడిన బాల్ ట్యాంపరింగ్ పెద్ద కుదుపులకే దారి తీస్తోంది. ఆస్ట్రేలియా క్రికెట్లో పెను సంక్షోభంగా నిలుస్తోంది. స్వదేశీ, విదేశీ మాజీ ఆటగాళ్ల విమర్శల తుఫానులో చిక్కుకుంది. ఏకంగా ఆ దేశ ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్ రంగంలోకి దిగేంతగా తీవ్ర స్థాయి దాల్చింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లను తక్షణమే పదవుల నుంచి తప్పించాలని ఆయన ఆదేశించగా... ఇటువైపు స్మిత్, బాన్‌క్రాఫ్ట్‌లపై ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. స్మిత్, వార్నర్‌లపై జీవితకాల నిషేధం వంటి మరిన్ని సంచలన నిర్ణయాలకూ ఆస్కారం కనిపిస్తుండగా... పులి మీద పుట్రలా దక్షిణాఫ్రికా చేతిలో మూడో టెస్టులో దారుణ పరాజయం ఆసీస్‌ను మరింత కుంగదీసింది. సిడ్నీ/దుబాయ్: బాల్ ట్యాంపరింగ్ ఉదంతం ఆస్ట్రేలియా క్రికెట్లో తీవ్ర సంక్షోభానికి దారితీసింది. అన్ని వైపుల నుంచి విమర్శలు రావడం, ఏకంగా దేశ ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్ జోక్యం చేసుకోవడంతో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లను కెప్టెన్, వైస్ కెప్టెన్ పదవుల నుంచి తప్పించింది. వికెట్ కీపర్ టిమ్ పైన్‌కు తాత్కాలికంగా సారథ్య బాధ్యతలు అప్పగించింది. ‘ఈ టెస్టు పూర్తిగా సాగాల్సిన అవసరం ఉంది. స్మిత్, వార్నర్‌లతో చర్చించాం. వైదొలగేందుకు వారు అంగీకరించారు’ అని సీఏ చీఫ్ జేమ్స్ సదర్లాండ్ తెలిపాడు. దీంతోపాటు ట్యాంపరింగ్ ఘటనపై అత్యవసర విచారణ జరిపేందుకు సీఏ హెడ్ ఆఫ్ ఇంటెగ్రిటీ లైన్ రాయ్, టీమ్ ఫెర్ఫార్మెన్స్ హెడ్ ప్యాట్ హోవార్డ్‌లు దక్షిణాఫ్రికా బయల్దేరారు. ‘మాతో సహా ఆస్ట్రేలియన్లంతా సమాధానం కోరుకుంటున్నారు. మా దర్యాప్తులో తేలిన అంశాలను ఎప్పటికప్పుడు ప్రాధాన్యంగా తెలియపరుస్తాం’ అని సదర్లాండ్ పేర్కొన్నాడు. మరోవైపు బాల్ ట్యాంపరింగ్‌కు గాను ఆసీస్ సారథిపై ఒక టెస్టు నిషేధంతో పాటు వంద శాతం మ్యాచ్ ఫీజు కోత విధిస్తూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్ణయం తీసుకుంది. నేరుగా ట్యాంపరింగ్‌కు పాల్పడిన ఓపెనర్ బాన్‌క్రాఫ్ట్ మ్యాచ్ ఫీజులో 75 శాతం కోతతో పాటు, మూడు డి మెరిట్ పాయింట్లు ఇచ్చింది. ‘క్రీడా స్ఫూర్తిని దెబ్బతీసే తీవ్ర చర్యలకు పాల్పడిన ఆటగాళ్లకు మద్దతుగా నిలిచినందుకు స్మిత్‌పై కోడ్ ఆఫ్ కండక్ట్ 2.2.1 ఆర్టికల్ కింద, బంతి ఆకారం మార్చేందుకు ప్రయత్నించి లెవల్ 2 నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆర్టికల్ 2.2.9, నిబంధన 41.3 కింద బాన్‌క్రాఫ్ట్‌పై ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్సన్ ఈ చర్యలు చేపట్టారు. దీంతో పాటు రెండు సస్పెన్షన్ పాయింట్లను ఎదుర్కొన్న స్మిత్ తదుపరి టెస్టుకు దూరం కానున్నాడు. అతడి ఖాతాలో నాలుగు డి మెరిట్ పాయింట్లు కూడా జమ కానున్నాయి. ‘ట్యాంపరింగ్ చేసేలా స్వయంగా ఆస్ట్రేలియా జట్టు నాయకత్వమే ప్రోత్సహించడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధం. ఇది తీవ్రమైన అంశం. కెప్టెన్‌గా స్మిత్ దీనికి పూర్తిగా బాధ్యుడు. సస్పెన్షనే సరైనది’ అని రిచర్డ్సన్ స్పష్టం చేశారు. ఈ సిరీస్‌లో చోటుచేసుకున్న దూషణలు, అంపైర్ల నిర్ణయాలపై నిరసన, ప్రేక్షకుల అతి వంటి వాటిని ఇకపై నివారించే దిశగా ఐసీసీ చర్యలు తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నాడు. సభ్య దేశాలు కూడా క్రికెట్ స్ఫూర్తిని కాపాడేందుకు ప్రయత్నించాలని కోరాడు. ఆలోచించాకే నిర్ణయం... న్యూఢిల్లీ: బాల్ ట్యాంపరింగ్ ఉదంతం నేపథ్యంలో స్మిత్, వార్నర్‌ల ఐపీఎల్ భవితవ్యంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపారు. ఆస్ట్రేలియా బోర్డు, ఐసీసీ చర్యలు చేపట్టినప్పటికీ... బీసీసీఐ ఈ విషయమై ఎటువంటి ఆలోచన చేయడం లేదని శుక్లా వివరించారు. బీసీసీఐతో సమాలోచన చేశాకే స్మిత్‌పై తమ నిర్ణయం వెలువరిస్తామని రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీ తెలిపింది. వార్నర్‌పై మాత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పందించలేదు. స్మిత్, వార్నర్ వంటి కీలక ఆటగాళ్లను ఒక్క ఘటనతో దూరం పెట్టలేమని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు బాల్ ట్యాంపరింగ్ చేశారనే వార్త విని షాక్‌కు గురయ్యా. ఆదర్శంగా నిలవాల్సిన వారు మోసపూరిత చర్యలకు పాల్పడ్డారంటే నమ్మశక్యంగా లేదు. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చైర్మన్ డేవిడ్ పీవెర్తో ఈ విషయంపై మాట్లాడాను. స్మిత్, వార్నర్‌లను వారి బాధ్యతల నుంచి తప్పించాలని ఆదేశించాను. –టర్న్‌బుల్, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి నిజాయతీగా చెప్పాలంటే గత 24 గంటలు మాకెంతో భారంగా గడిచాయి. మా అభిమానులందరినీ ఈ సందర్భంగా నేను క్షమాపణలు కోరుతున్నాను. మా నుంచి వారు ఇలాంటి ప్రదర్శనను ఆశించలేదు. –టిమ్ పైన్, ఆసీస్ తాత్కాలిక సారథి స్మిత్ చేసింది చాలా చాలా పెద్ద తప్పే. సరైన వ్యక్తులు పిలిస్తే ఆస్ట్రేలియా జట్టులోకి మళ్లీ వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను. –మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఎంతవాడుగానీ... నైతికత లేకుంటే పతనమే! స్టీవ్ స్మిత్ ఉదంతం చెబుతున్నదిదే అతడు ఎనిమిదేళ్ల క్రితం టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసింది ఒక స్పిన్నర్‌గా. బ్యాటింగ్‌కు దిగింది 8వ స్థానంలో. కానీ, తర్వాత ఎంతో మెరుగయ్యాడు. ఓపెనింగ్‌తో పాటు 3, 4, 5 ఇలా పలు స్థానాల్లో బ్యాటింగ్ చేశాడు. కీలక ఆటగాడిగా ఎదగడమే కాదు... కెప్టెన్ కూడా అయ్యాడు. సంధి దశలో ఉన్న జట్టును ముందుండి నడిపించాడు. టెస్టుల్లో నంబర్‌వన్‌గానూ నిలిచాడు. 64 టెస్టులు ముగిసేసరికి ఇప్పుడతడి సగటు 61.37. అయినా... ఏం లాభం? నైతికత అనే ఒక్క లక్షణం లేకపోవడంతో నాయకుడు కాస్తా ప్రతినాయకుడిలా కనిపిస్తున్నాడు. అతడే ఆస్ట్రేలియా సారథి స్టీవ్ స్మిత్. ఒక్కో మెట్టు ఎక్కి... క్రీజులో చిత్రవిచిత్ర స్టాన్స్, మెరుపు ఫీల్డింగ్‌తో పాటు అచ్చం బొమ్మలాంటి ముఖంతో తొలినాళ్లలో స్మిత్ కొంత ప్రత్యేకంగా కనిపించే వాడు. స్పిన్నర్‌గా అడుగుపెట్టినా పేరుగాంచింది మాత్రం బ్యాట్స్‌మన్‌గానే. అడ్డదిడ్డమైన షాట్లతో బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి, ప్రపంచ వ్యాప్తంగా పరుగులు రాబడుతూ ఆసీస్ దిగ్గజ బ్యాట్స్‌మన్ డాన్ బ్రాడ్‌మన్ తర్వాత అత్యధిక సగటు ఉన్న ఆటగాడిగా ఎదిగాడు. ఇలా కెరీర్లో ఒక్కో మెట్టు ఎదుగుతూ ఎంతటి పేరు సంపాదించాడో, దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో బాల్ ట్యాంపరింగ్‌తో అంతటి చెడ్డ పేరు మూటగట్టుకున్నాడు. తన ప్రతిష్ఠకు తానే మచ్చ తెచ్చుకున్నాడు. గతేడాది బెంగళూరులో భారత్‌తో టెస్టు సందర్భంగా డీఆర్ఎస్ కోరేందుకు జట్టు సభ్యులున్న బాల్కనీ వైపు చూసి స్మిత్ అప్పట్లోనే వివాదాస్పదమయ్యాడు. మతి చెడి అలా చేశానని తర్వాత ఒప్పుకున్నాడు. రెండేళ్ల క్రితం న్యూజిలాండ్‌తో టెస్టులోనూ అనుచిత ప్రవర్తనతో జరిమానాకు గురయ్యాడు. ఆ సందర్భంలో ‘నాయకుడిగా నేనింకా ఎదగాలి. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి’ అని చెప్పాడు. తర్వాత కూడా అండర్సన్, రబడ వంటి బౌలర్లతో వాగ్యుద్ధానికి దిగాడు. ఇప్పుడు ఏకంగా ట్యాంపరింగ్‌తో పెద్ద తప్పే చేశాడు. అంత అవసరం ఏమొచ్చింది... దక్షిణాఫ్రికాతో నాలుగు టెస్టుల సిరీస్ 1–1తో ఉంది. జరుగుతున్నది మూడో టెస్టు. తొలి ఇన్నింగ్స్‌లోనూ ఆసీస్ పోరాడి ప్రత్యర్థి ఆధిక్యాన్ని తగ్గించింది. సఫారీల నుంచి రెండో ఇన్నింగ్స్‌లో ప్రతిఘటన ఎదురవుతోంది. మరీ బెదిరిపోవాల్సిన పనిలేదు. తమ రెండో ఇన్నింగ్స్‌లో దానికి బదులివ్వొచ్చు. అప్పటికీ విఫలమైతే టెస్టు చేజారుతుంది అంతే! లోపాలు సరిచేసుకుని చివరి టెస్టులో గెలిచి సిరీస్‌ను సమం చేయొచ్చు. ఆసీస్‌లాంటి జట్టుకు ఇదేమంత కష్టమూ కాదు. కానీ తప్పు దారిలో ఆలోచించి దోషిగా నిలబడ్డాడు. పైగా జట్టంతా తీసుకున్న నిర్ణయమంటూ అందరికీ ఆపాదించాడు. కొత్త కుర్రాడు బాన్‌క్రాఫ్ట్ సహా, నేరుగా ప్రమేయం లేని వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ భవిష్యత్తునూ బలి చేశాడు. జీవితకాలం వెంటాడే తప్పు... ఐసీసీ ర్యాంకింగ్స్‌లో స్మిత్ ఆల్‌టైమ్ రెండో అత్యధిక రేటింగ్ పాయింట్లు (945) సాధించి ఉండవచ్చుగాక, చరిత్రలో రెండో అత్యధిక సగటుతో కెరీర్ ముగించొచ్చుగాక... ఇలాంటి ఘనతలు ఇంకెన్ని తన ఖాతాలో ఉన్నా బాల్ ట్యాంపరింగ్ అతడిని జీవితకాలం వెంటాడుతూనే ఉంటుంది. ఒక మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలా, ఒక అండర్ ఆర్మ్ బౌలింగ్‌లా ఇది చరిత్రలో నిలిచిపోతుంది. –సాక్షి క్రీడా విభాగం -
కిరణ్‌పై క్రమశిక్షణ చర్యలుండవు: ఏఐసీసీ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2013 ప్రస్తుతం శాసనసభలో ఉందని, దీనిపై విప్ ఏదీ జారీచేయలేదని, కాబట్టి సభ్యు లు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు తెలియజేయవచ్చునని ఏఐసీసీ ప్రధానకార్యదర్శి ముకుల్ వాస్నిక్ తెలిపారు. పార్టీ అధికార ప్రతినిధిగా నియమితుడైన ఆయన సోమవారం తొలిసారిగా విలేకరులతో మాట్లాడారు. బిల్లు రాజ్యాంగబద్ధంగా లేదని, దానిని తిరస్కరిస్తూ తీర్మానం చేయాలంటూ సీఎం కిరణ్ స్పీకర్‌కు నోటీసు ఇచ్చినందున ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించగా, అలాంటిదేం లేదన్నారు. సీడబ్ల్యూసీ, కేంద్రకేబినెట్ ఆమోదించి రాష్ట్రపతి ద్వారా పంపిన తెలంగాణ బిల్లును తిరస్కరించాలని కోరడం క్రమశిక్షణారాహిత్యం కిందకు రాదా అని ప్రశ్నించగా, ఆ బిల్లుపై విప్ జారీ చేయనందున ఎవరైనా స్వేచ్ఛగా అభిప్రాయాలు వెల్లడించవచ్చని చెప్పారు.