సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా విమానాల్లో చేతివాటం చూపించిన ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలకు దిగింది. విమాన ప్రయాణికులకు వడ్డించగా మిగిలిన ఆహారాన్ని దొంగిలించారన్న ఆరోపణలతో సిబ్బందిపై చర్యలు చేపట్టింది. నలుగుర్ని 63 రోజుల పాటు సస‍్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఎయిర్ ఇండియా కేటరింగ్ విభాగంలోని అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ అసిస్టెంట్ మేనేజర్ తోపాటు, మరో ఇద్దరు క్యాబిన్ సిబ్బందిపై వేటు పడింది. విమానాల్లో విక్రయింగా మిగిన ఆహారం, పొడి రేషన్లను దొంగిలించి, వ్యక్తిగత వినియోగానికి వాడుకోవడంతో వారిపై క్రమశిక్షణా చర్య తీసుకున్నామని పేరు చెప్పడానికి ఇష్టపడని సంస్థ సీనియర్ అధికారి తెలిపారు. ఈ వ్యవహారాన్ని గమనించిన మూడు రోజుల్లోనే చర్యలు తీసుకున్నామన్నారు. ముఖ్యంగా ఎయిర్ ఇండియా ఛైర్మన్, ఎండీ అశ్వాని లోహాని 2017, ఆగస్టులో జారీచేసిన సర్క్యులర్ ప్రకారం ఈ చర్య చేపట్టామని వెల్లడించారు. అంతేకాకుండా, గత ఏడాది మార్చిలో ఇదే విషయంపై న్యూఢిల్లీ-సిడ్నీ విమానంలోని ఇద్దరు క్యాబిన్ సిబ్బందిని హెచ్చరించినట్టు తెలిపారు. అయితే దీనిపై ఎయిర్ ఇండియా అధికారికంగా స్పందించాల్సి ఉంది.
కాగా గతనెల (ఫిబ్రవరి)లో ఎయిరిండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా అశ్వాని లోహాని తిరిగి నియమితులయ్యారు. రైల్వేబోర్డు చైర్మన్‌గా విధులు నిర్వహించిన లోహనిని రెండోసారి నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment