Ashwani Lohani
-
ఏపీలో ఎయిరిండియా సర్వీసుల పునరుద్ధరణ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో రద్దు చేసిన ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను పునరుద్ధరిస్తామని సంస్థ చైర్మన్ అశ్వనీ లొహానీ పేర్కొన్నారు. సర్వీసుల పునరుద్ధరణతో పాటుగా విజయవాడ-తిరుపతి-వైజాగ్, విజయవాడ-షిర్డీ, విజయవాడ-బెంగుళూరు రూట్లలో కొత్తగా విమాన సర్వీసులు ప్రారంభించే ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా ప్రస్తుతం ఢిల్లీ-విజయవాడ మధ్య వారానికి మూడుసార్లు నడుపుతున్న ఎయిర్ ఇండియా విమాన సర్వీసును అక్టోబర్ 27 నుంచి ఢిల్లీ-విజయవాడ-తిరుపతి-విజయవాడ-ఢిల్లీ సర్వీసుగా నడపనున్నట్లు తెలియచేశారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ నాయకుడు విజయసాయిరెడ్డికి రాసిన లేఖలో ఈ అంశాలను పేర్కొన్నారు. కాగా గత జూలైలో ఆంధ్రప్రదేశ్‌లోని అనేక రూట్లలో ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో విమాన ప్రయాణీకులను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా చైర్మన్ లొహానీతో విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. రద్దు చేసిన విమాన సర్వీసులను సత్వరమే పునరుద్ధరించడంతో పాటు వైజాగ్-విజయవాడ-బెంగుళూరు, వైజాగ్-విజయవాడ-తిరుపతి మధ్య రోజూ విమాన సర్వీసులను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా విజయవాడ, వైజాగ్, తిరుపతి, విజయవాడ-షిర్డీ, విజయవాడ-బెంగుళూరు మధ్య కొత్త విమాన సర్వీసులను ప్రారంభించాలని కూడా కోరుతూ ఆయనకు లేఖ రాశారు. ఈ లేఖపై సానుకూలంగా స్పందిస్తూ లొహానీ మంగళవారం విజయసాయిరెడ్డికి ప్రత్యుత్తరమిచ్చారు. కాగా ఎయిర్ ఇండియా నిర్ణయం పట్ల విజయసాయిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎయిర్ ఇండియా చైర్మన్ అశ్వనీ లొహానీకి ధన్యవాదాలు తెలియజేశారు. -
ఎయిరిండియా ప్రైవేటీకరణ ఒప్పుకోం
ముంబై: నష్టాలు, రుణభారంతో కుంగుతున్న ప్రభుత్వ రంగ ఎయిరిండియాను ప్రైవేటీకరించేందుకు కేంద్రం మరోసారి ప్రయత్నాలు ప్రారంభించడంపై ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రైవేటీకరణతో అనేక మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందనే భయాలు నెలకొన్న దరిమిలా యాజమాన్యానికి తమ ఆందోళన గురించి తెలియజేశాయి. ప్రైవేటీకరణ ప్రణాళికపై సోమవారం చైర్మన్ అశ్వనీ లోహానీతో జరిగిన సమావేశంలో 13 ఉద్యోగ సంఘాలు ఈ మేరకు తమ అభిప్రాయాలు తెలిపాయి. దాదాపు రెండు గంటల పాటు సాగిన సమావేశంలో .. కంపెనీని మళ్లీ గట్టెక్కించేందుకు తాము అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తామని, శాయశక్తులా కృషి చేస్తామని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణను ఒప్పుకునేది లేదని స్పష్టం చేశాయి. ఎయిరిండియాలో డిజిన్వెస్ట్‌మెంట్‌ను వేగంగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఇటీవలి బడ్జెట్లో కేంద్రం కంపెనీకి నామమాత్రంగా రూ. లక్ష మాత్రమే కేటాయించింది. అలాగే అక్టోబర్ లోగా విక్రయ ప్రక్రియ పూర్తి చేయాలని డెడ్‌లైన్ కూడా విధించినట్లు వార్తలు వచ్చాయి. -
ఎయిరిండియాకు సాఫ్ట్వేర్ షాక్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ‘ఎయిరిండియా’ సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన సాంకేతిక లోపం వేలాది మంది ప్రయాణికుల సహనాన్ని పరీక్షించింది. శనివారం వేకువజాము నుంచి ఉదయం వరకు 155 విమాన సర్వీసులు ఆలస్యం కావడంతో దేశ, విదేశాల్లో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. శనివారం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో ఎయిరిండియా చెక్–ఇన్ సాఫ్ట్‌వేర్‌లో సమస్య కారణంగా ప్రయాణికుల గుర్తింపు, బ్యాగేజి, రిజర్వేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. ఫలితంగా, దేశ, విదేశాల్లోని ఎయిరిండియా సిబ్బంది ప్రయాణికులకు బోర్డింగ్ పాస్ జారీ చేయలేకపోయారు. దీంతో ఇందుకు అవసరమైన పాసింజర్ సర్వీస్ సిస్టం(పీఎస్ఎస్) సేవలందించే అమెరికాలోని అట్లాంటాకు చెందిన ‘సిటా’ సంస్థను సంప్రదించారు. ఆ సంస్థ యంత్రాంగం లోపాన్ని సరిదిద్దటానికి దాదాపు ఐదుగంటల సమయం తీసుకుంది. అనంతరం 8.45 గంటలకు ఎయిరిండియా తిరిగి సర్వీసులను పునరుద్ధరించింది. ఈ విషయమై ఎయిరిండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) అశ్వనీ లొహానీ మాట్లాడుతూ.. ‘సాఫ్ట్వేర్ సమస్యలో లోపంపై సిటా విచారణ జరుపుతోంది. సాఫ్ట్వేర్ షట్డౌన్కు వైరస్‌నా లేక మరేదైనా కారణమా తెలుసుకునేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు’ అని ఆయన తెలిపారు. ‘ఎక్కడ లోపం తలెత్తినా మేం పీఎస్ఎస్ వ్యవస్థను వాడుకుంటాం. కానీ, పీఎస్ఎస్లోనే సమస్య వచ్చింది. అందుకే వేరే మార్గాల్లో ప్రయాణికులకు వెంటనే సమాచారం అందించలేకపోయాం’ అని ఆయన వివరించారు. -
ఫ్లైట్‌లో మిగిలిపోయిన ఫుడ్ తిన్నారని..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా విమానాల్లో చేతివాటం చూపించిన ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలకు దిగింది. విమాన ప్రయాణికులకు వడ్డించగా మిగిలిన ఆహారాన్ని దొంగిలించారన్న ఆరోపణలతో సిబ్బందిపై చర్యలు చేపట్టింది. నలుగుర్ని 63 రోజుల పాటు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్ ఇండియా కేటరింగ్ విభాగంలోని అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ అసిస్టెంట్ మేనేజర్ తోపాటు, మరో ఇద్దరు క్యాబిన్ సిబ్బందిపై వేటు పడింది. విమానాల్లో విక్రయింగా మిగిన ఆహారం, పొడి రేషన్లను దొంగిలించి, వ్యక్తిగత వినియోగానికి వాడుకోవడంతో వారిపై క్రమశిక్షణా చర్య తీసుకున్నామని పేరు చెప్పడానికి ఇష్టపడని సంస్థ సీనియర్ అధికారి తెలిపారు. ఈ వ్యవహారాన్ని గమనించిన మూడు రోజుల్లోనే చర్యలు తీసుకున్నామన్నారు. ముఖ్యంగా ఎయిర్ ఇండియా ఛైర్మన్, ఎండీ అశ్వాని లోహాని 2017, ఆగస్టులో జారీచేసిన సర్క్యులర్ ప్రకారం ఈ చర్య చేపట్టామని వెల్లడించారు. అంతేకాకుండా, గత ఏడాది మార్చిలో ఇదే విషయంపై న్యూఢిల్లీ-సిడ్నీ విమానంలోని ఇద్దరు క్యాబిన్ సిబ్బందిని హెచ్చరించినట్టు తెలిపారు. అయితే దీనిపై ఎయిర్ ఇండియా అధికారికంగా స్పందించాల్సి ఉంది. కాగా గతనెల (ఫిబ్రవరి)లో ఎయిరిండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా అశ్వాని లోహాని తిరిగి నియమితులయ్యారు. రైల్వేబోర్డు చైర్మన్‌గా విధులు నిర్వహించిన లోహనిని రెండోసారి నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. -
ఇంజిన్ రహిత రైలు
చెన్నై నుంచి ఢిల్లీకి బయల్దేరిన తొలి ఇంజిన్ రహిత రైలు ట్రైన్ 18. సోమవారం రైల్వే బోర్డ్ చైర్మన్ అశ్విని లోహాని జెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారైన ఈ రైలు.. మరిన్ని పరీక్షలు పూర్తిచేసుకున్న తరువాత శతాబ్ది ఎక్స్‌ప్రెస్ స్థానంలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది. సెమీ హైస్పీడ్ రకానికి చెందిన ఈ రైలు గంటకు గరిష్టంగా 160 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. – కొరుక్కుపేట (చెన్నై) -
రైళ్లలో వ్యర్థాలకు ట్రాష్ బ్యాగులు!
న్యూఢిల్లీ: ఇక నుంచి విమానాల్లో మాదిరిగా రైళ్లల్లోనూ ప్రయాణికుల నుంచి వ్యర్థాలను ట్రాష్ బ్యాగుల్లో సేకరించేలా చర్యలు చేపట్టాలని రైల్వే బోర్డు చైర్మన్ అశ్వనీ లోహాని అధికారులను ఆదేశించారు. డివిజన్ లెవల్ ఆఫీసర్లు, బోర్డు సభ్యులతో 17న నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైళ్లలో పరిశుభ్రతను పెంచేందుకు ప్రయాణికుల భోజనాల అనంతరం ప్యాంట్రీ సిబ్బంది ఆ ప్లేట్లను బ్యాగుల్లో సేకరించాలని సూచించారు. సాధారణంగా భోజనం తిన్న తర్వాత ప్రయాణికులు ప్లేట్లను బెర్త్‌ల కింద పెడుతుంటారని, సిబ్బంది వాటిని ఒకదాని మీద ఒకటి పేర్చి తీసుకెళ్లడం వల్ల అందులోని వ్యర్థాలు కింద పడి బోగీలు అపరిశుభ్రంగా మారుతున్నాయని పేర్కొన్నారు. ట్రాష్ బ్యాగును ప్రయాణికుడి వద్దకు తీసుకెళ్లే వ్యర్థాలనూ వారు అందులో వేస్తారని అన్నారు. -
రైల్వే నియామక ప్రక్రియ సమయం తగ్గింపు
న్యూఢిల్లీ: రైల్వే నియామక ప్రక్రియను రెండేళ్ల నుంచి 6 నెలలకు తగ్గించేందుకు రైల్వే శాఖ కసరత్తు చేపట్టింది. గత నెల 24న వాస్కో–డి–గామా–పట్నా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన అనంతరం రైల్వే బోర్డు చైర్మన్ అశ్వని లోహాని ఆధ్వర్యంలో జనరల్ మేనేజర్ల సమావేశం జరిగింది. ‘రైల్వే ఉద్యోగాల ప్రక్రియ సుదీర్ఘంగా ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ నుంచి ఉద్యోగం రావడానికి అభ్యర్థులకు కనీసం రెండేళ్లు పడుతుంది. దీంతో అనేకమంది వేరే ఉద్యోగాలకు వెళ్లిపోతున్నారు. ఆన్లైన్ పరీక్షలు నిర్వహించడం ద్వారా నియామక ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఈశాన్య రైల్వే జనరల్ మేనేజర్ చాహాతే రామ్ ప్రతిపాదన చేశారు. దీంతో ఆరు నెలల్లోపు నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు తమ అభిప్రాయాన్ని డిసెంబర్ 20లోగా తెలియజేయాలని లోహాని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డును కోరారు. -
ఎయిర్ ఇండియా కొత్త సీఎండీ ఈయనే
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయానసంస్థ ఎయిర్ ఇండియాకు కొత్త సీఎండీగా రాజీవ్ బన్సల్ ఎంపికయ్యారు. ఎయిర్ ఇండియా ఛైర్మన్ అశ్వని లోహానీ రైల్వే బోర్డ్ ఛైర్మన్ గా నియమితులుకావడంతో ఆయన స్థానంలోరాజీవ్ నియమితులయ్యారు. పెట్రోలియం మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శిగా ఉన్న బన్సల్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత బాధ్యతలకు అదనంగా ఈ బాధ్యతలను ఆయన చేపట్టనున్నారు. గతంలో విమానయాన మంత్రిత్వశాఖ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవం కూడా బన్సల్ కు ఉంది. పెట్రోలియం మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి, ఫైనాన్షియల్ అడ్వైజర్ గా ఉన్న రాజీవ్ బన్సల్‌ను తాత్కాలిక చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించినట్టు కేబినెట్ నియామకాల కమిటీ తెలిపింది. తదుపరి ఆదేశాలవరకు 3 నెలలు పాటు ఆయన ఈ బాధ్యతల్లోవుంటారని పేర్కొంది. కాగా రైల్వేలో వరుస ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ రైల్వే బోర్డు ఛైర్మన్ అశోక్ మిట్టల్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయనస్థానంలో ఎయిరిండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా అశ్వని లోహానిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఎయిర్ ఇండియాలో ప్రభుత్వ వాటా విక్రయానికి ప్రభుత్వం నిర్ణయించిన సంగతి విదితమే. -
సూరత్ నుంచి నేరుగా దుబాయ్‌కి...
న్యూఢిల్లీ: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ మే 15 నుంచి సూరత్–దుబాయ్ మధ్య నేరుగా విమాన సేవలు ప్రారంభించే అవకాశాలున్నాయి. చవకగా విదేశీ సేవలందించే, ఎయిరిండియా అనుబంధ విభాగమైన ఈ సంస్థ ఇందుకోసం 189 సీట్లున్న బోయింగ్ 737–800 విమానాలను వినియోగిస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. గుజరాత్‌కు చెందిన ఇద్దరు ఎంపీలు దర్శన్ జార్దోశ్, సీఆర్ పాటిల్ మంగళవారం ఎయిరిండియా సీఎండీ అశ్వని లోహానిని కలుసుకుని సూరత్ నుంచి మరిన్ని విమానాలు నడపడానికి ఉన్న అవకాశాలపై చర్చించారు. ఎఫ్ఏఏ అనుమతులను అనుసరించి మే 15 నుంచి సూరత్–దుబాయ్ మధ్య వారానికి 3 సార్లు విమాన సేవలుంటాయని ఆ తరువాత జార్దోశ్ ట్వీట్ చేశారు. సూరత్ నుంచి దుబాయ్‌కి విమానం నడపాలన్న ప్రణాళికకు ఆమోదం లభించిందని ఎయిరిండియా అధికారి ఒకరు తెలిపారు. తొలుత ఆ మార్గంలో 50–60 శాతం సీట్లు నిండుతాయని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. సూరత్ నుంచి దేశీయంగా మరిన్ని విమానాలు నడపాలని కూడా ఎయిరిండియో యోచిస్తోంది. -
ఎయిర్ ఇండియా సీఎండీగా అశ్వని లొహాని
న్యూఢిల్లీ: రైల్వే సర్వీస్ అధికారి అశ్వని లొహాని దేశీ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈయన 1980 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ మెకానికల్ ఇంజినీర్స్ అధికారి. అశ్వని లొహాని మూడేళ్లపాటు ఎయిర్ ఇండియా సీఎండీగా కొనసాగనున్నారు. ఈయనకు ముందు ఎయిర్ ఇండియా సీఎండీగా ఉన్న రోహిత్ నందన్ ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. -
ఎయిరిండియా చీఫ్‌గా అశ్వని లొహానీ
తొలిసారిగా రైల్వే అధికారికి విమాన పగ్గాలు న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా సీఎండీగా తొలిసారిగా ఒక రైల్వే శాఖకు చెందిన అధికారి నియమితులయ్యారు. 1980 బ్యాచ్ రైల్వే సర్వీస్ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ (ఐఆర్ఎస్ఎంఈ) ఆఫీసర్ అయిన అశ్వని లొహానీ ఎయిర్ఇండియా చీఫ్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంపీటీడీసీ) ఎండీగా పనిచేస్తున్నారు. ఎయిరిండియా సీఎండీగా ఆయన పదవీ కాలం మూడేళ్ల పాటు ఉంటుంది. లొహానీ నియామకానికి క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం ఎయిరిండియా సీఎండీగా 1982 బ్యాచ్ ఉత్తర ప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి రోహిత్ నందన్ విధులు నిర్వర్తిస్తున్నారు. నందన్ పదవీకాలం ఈ నెలతో ముగిసిపోనుంది. దాదాపు రూ. 30,000 కోట్ల నష్టాల భారంతో ఎయిరిండియా ఎదురీదుతున్న నేపథ్యంలో లొహానీ కీలక బాధ్యతలు చేపట్టనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.