ఎయిర్ ఇండియా కొత్త సీఎండీ ఈయనే
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయానసంస్థ ఎయిర్ ఇండియాకు కొత్త సీఎండీగా రాజీవ్ బన‍్సల్ ఎంపికయ్యారు. ఎయిర్ ఇండియా ఛైర్మన్ అశ్వని లోహానీ రైల్వే బోర్డ్ ఛైర్మన్ గా నియమితులుకావడంతో ఆయన స్థానంలోరాజీవ్ నియమితులయ్యారు. పెట్రోలియం మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శిగా ఉన్న బన్సల్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత బాధ్యతలకు అదనంగా ఈ బాధ్యతలను ఆయన చేపట్టనున్నారు. గతంలో విమానయాన మంత్రిత్వశాఖ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవం కూడా బన్సల్ కు ఉంది.
పెట్రోలియం మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి, ఫైనాన్షియల్ అడ్వైజర్ గా ఉన్న రాజీవ్ బన్సల్‌ను తాత్కాలిక చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించినట్టు కేబినెట్ నియామకాల కమిటీ తెలిపింది. తదుపరి ఆదేశాలవరకు 3 నెలలు పాటు ఆయన ఈ బాధ్యతల్లోవుంటారని పేర్కొంది.
కాగా రైల్వేలో వరుస ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ రైల్వే బోర్డు ఛైర్మన్ అశోక్ మిట్టల్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయనస్థానంలో ఎయిరిండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా అశ్వని లోహానిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఎయిర్ ఇండియాలో ప్రభుత్వ వాటా విక్రయానికి ప్రభుత్వం నిర్ణయించిన సంగతి విదితమే.