Rajiv Bansal
-
విమానచార్జీలపై పరిమితి విధించే యోచన లేదు
న్యూఢిల్లీ: విమానయాన చార్జీలపై పరిమితులు విధించడం ద్వారా స్వేచ్ఛాయుత మార్కెట్ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే యోచనేది ప్రభుత్వానికి లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ బన్సల్ స్పష్టం చేశారు. ‘ప్రాథమికంగా చార్జీలపై పరిమితులు విధించడం, మార్కెట్ ఎకానమీ లో జోక్యం చేసుకోవడం అనేవి సరికాదు. ప్రభు త్వం ఈ విషయంపై సానుకూలంగా లేదు. ఇటు కనిష్ట అటు గరిష్ట చార్జీల పరిమితి విధించాలను కోవడం లేదు. స్వేచ్ఛాయుత మార్కెట్ ఎకానమీలో అసలు ప్రభుత్వం జోక్యమే చేసుకోకూడదనేది నా అభిప్రాయం‘ అని ఆయన చెప్పారు. అయితే, ప్రయాణికులపై అత్యంత భారీ చార్జీల భారం పడ కుండా, వారు ఇబ్బంది పడకుండా చూసేందుకు ఎయిర్‌లైన్స్‌తో ప్రభుత్వం చర్చించినట్లు బన్సల్ చెప్పారు. చాలా మటుకు రూట్లలో ప్రస్తుతం కనిష్ట చార్జీలు.. దాదాపు ఏసీ రైలు చార్జీల స్థాయిలోనే ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు. చార్జీలపై కనిష్ట, గరిష్ట పరిమితులు విధించాలని, ఆ విషయంలో స్వేచ్ఛా మార్కెట్ ఎకానమీ పేరుతో పోటీ సంస్థలను దెబ్బతీసేలా ఎయిర్‌లైన్స్ వ్యవహరించకుండా చూడాలని పౌర విమానయాన శాఖకు పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు చేసిన నేపథ్యంలో బన్సల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
త్వరలో టాటాల చేతికి ఎయిరిండియా
Rajiv Bansal About Air India Disinvestment: ఎయిరిండియాలో వాటా విక్రయ ప్రక్రియను డిసెంబర్‌కల్లా పూర్తి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు పౌర విమానయాన కార్యదర్శి రాజీవ్ బన్సల్ పేర్కొన్నారు. నష్టాలతో సమస్యలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ రంగ విమానయాన కంపెనీ ఎయిరిండియాలో డిజిన్వెస్ట్‌మెంట్‌ను త్వరితగతిన పూర్తి చేసే సన్నాహాల్లో ప్రభుత్వమున్నట్లు తెలియజేశారు. ఎయిరిండియా కొనుగోలు రేసులో టాటా గ్రూప్ కంపెనీ టాలేస్ ప్రయివేట్ లిమిటెడ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం గత నెల 25న ఎయిరిండియా విక్రయానికి టాటా సన్స్‌తో రూ. 18,000 కోట్ల విలువైన వాటా కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనిలో భాగంగా టాటా గ్రూప్ రూ. 2,700 కోట్లు నగదు రూపేణా చెల్లించడంతోపాటు.. మరో రూ. 15,300 కోట్ల రుణాలను టేకోవర్ చేయనుంది. అంతేకాకుండా ఎయిరిండియాతోపాటు చౌక ధరల సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ను, ఏఐఎస్ఏటీఎస్లో ఎయిరిండియాకుగల 50 శాతం వాటాను సైతం సొంతం చేసుకోనుంది. కంపెనీ నెలకు రూ. 600 కోట్లకుపైగా నష్టాలు నమోదు చేస్తోంది. -
లాక్డౌన్: విమానాలు ఎగరబోతున్నాయ్!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతుండగా దాదాపు రెండు వారాల తర్వాత దేశీయ విమానాలు తొలిసారిగా గగనయానం చేయనున్నాయి. 18 విమానాలను నడపనున్నట్టు ఎయిర్ ఇండియా సీఎండీ రాజీవ్ బన్సల్ గురువారం వెల్లడించారు. మన దేశంలో చిక్కుపోయిన జర్మనీ, కెనడా, ఫ్రాన్స్, ఐర్లాండ్ పౌరులను తరలించేందుకు వీటిని నడపనున్నట్టు తెలిపారు. ఆయా దేశాల రాయబార కార్యాలయాల అభ్యర్థన మేరకు 18 చార్టడ్ విమానాలను నడుపుతామన్నారు. ఈ మేరకు ఆయా దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్నట్టు చెప్పారు. ఆయా దేశాల నుంచి విమానాలు తిరిగొచ్చేటప్పుడు ఖాళీగానే వస్తాయని స్పష్టం చేశారు. (ఎయిరిండియా పైలట్లకు షాక్) హాంగ్‌కాంగ్ నుంచి వైద్య పరికరాలు తీసుకొచ్చేందుకు 4, 5 తేదీల్లో కార్గో విమానాన్ని నడపనున్నట్టు రాజీవ్ బన్సల్ తెలిపారు. దీనికి అవసరమైన అనుమతులు కూడా లభించాయని ప్రకటించారు. షాంఘై నుంచి 6న మెడికల్స్ తీసుకొచ్చే విమానానికి అనుమతి రావాల్సి ఉందన్నారు. ఈ విమానాల్లో ప్రయాణించే క్యాబిన్ క్రూ సిబ్బందికి, గ్రౌండ్ స్టాఫ్‌కు శానిటైజర్లు, గ్లోవ్స్, మాస్కులతో పాటు వ్యక్తిగత రక్షణ పరికరాలు సమకూరుస్తామన్నారు. విమానాలు తిరిగి వచ్చిన తర్వాత క్వారంటైన్లో ఉండాలని క్యాబిన్ క్రూ సిబ్బందికి సూచించినట్టు చెప్పారు. (కరోనా భయం: వరుస ఆత్మహత్యలు) -
ఎయిర్ ఇండియా సీఎండీగా రాజీవ్ బన్సాల్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు సీఎండీగా సీనియర్ ప్రభుత్వ అధికారి రాజీవ్ బన్సాల్‌ను ప్రభుత్వం గురువారం నియమించింది. నాగాలాండ్ క్యాడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ బన్సాల్.. గతంలో విజయవంతంగా సంస్థను నడిపించారు. 2017లో మూడు నెలలపాటు మధ్యంతర సీఎండీగా సేవలందించారు. ఆ సమయంలో వ్యయాలను గణనీయంగా తగ్గించి, సమయానికి విమానాలు నడిచేలా చేశారు. దీంతో ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోయిన సంస్థను గాడిలో పెట్టేందుకు ఆయన్ని మళ్లీ నియమించింది. -
బన్సల్ కేసులో ఇన్ఫీకి ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) రాజీవ్ బన్సల్‌కి పరిహారం వివాదంపై ఆర్బిట్రేషన్ కేసులో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు రూ. 12.17 కోట్ల బకాయిని వడ్డీతో పాటు చెల్లించాల్సిందేనని ఆర్బిట్రేషన్ ప్యానెల్ స్పష్టం చేసింది. బన్సల్ ఇప్పటికే తీసుకున్న రూ. 5.2 కోట్ల మొత్తాన్ని వాపసు చేయాలన్న సంస్థ అభ్యర్థనను ప్యానెల్ తిరస్కరించిందని బీఎస్ఈకి ఇన్ఫీ తెలియజేసింది. దీనిపై న్యాయ నిపుణులను సంప్రతించి, తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు వివరించింది. ఇన్ఫోసిస్ గత యాజమాన్యం, వ్యవస్థాపకుల మధ్య చిచ్చు రేపిన అంశాల్లో బన్సల్ పరిహారం కూడా ఒకటి కావడం గమనార్హం. 2015లో రాజీవ్ బన్సల్ ఇన్ఫోసిస్ నుంచి వైదొలిగినప్పుడు.. ఆయనకు పరిహారం కింద 24 నెలల జీతం లేదా రూ. 17.38 కోట్లు ఇచ్చేందుకు ఇన్ఫీ అంగీకరించింది. దీని ప్రకారం ముందుగా రూ. 5 కోట్లు చెల్లించింది. అయితే, ఈ డీల్‌పై సంస్థ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి తదితరులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో.. మిగతాది చెల్లించకుండా నిలిపివేసింది. ఈ వివాదంతో ఇన్ఫోసిస్‌పై బన్సల్ ఆర్బిట్రేషన్ ప్యానెల్‌ను ఆశ్రయించగా.. తాజా ఆదేశాలు వెలువడ్డాయి. -
టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు ఎదురుదెబ్బ
బెంగళూరు : టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మాజీ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ రాజీవ్ బన్సాల్‌కు వడ్డీతో సహా రూ.12.17 కోట్లను చెల్లించాల్సిందేనని ఇన్ఫోసిస్‌ను ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. తనకు చెల్లించాల్సిన రూ.17 కోట్ల సెవరెన్స్ ప్యాకేజీ విషయంలో రాజీవ్ బన్సాల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. బన్సాల్ ఫిర్యాదుకు వ్యతిరేకంగా కంపెనీ కౌంటర్ ఫిర్యాదును కూడా దాఖలు చేసింది. అంతకముందు చెల్లించిన రూ.5.2 కోట్లను, ఇతర డ్యామేజ్లను కంపెనీకి తిరిగి చెల్లించాలంటూ బన్సాల్‌ను ఆదేశించాలని ఇన్ఫీ తన ఫిర్యాదులో పేర్కొంది. కానీ ఈ ఫిర్యాదును ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ కొట్టివేసింది. ఈ విషయంపై తదుపరి చర్యల కోసం న్యాయ సూచనలు తీసుకుంటామని కంపెనీ బొంబై స్టాక్ ఎక్స్చేంజ్కు తెలిపింది. రాజీవ్ బన్సాల్ సెవరెన్స్ ప్యాకేజ్ విషయంలో ఇన్ఫోసిస్‌లో పెద్ద వివాదమే నెలకొంది. కంపెనీ గవర్నెన్స్‌లు దెబ్బతిన్నాయంటూ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి, కంపెనీ బోర్డుకు వ్యతిరేకంగా పలు విమర్శలు చేశారు. సెవరెన్స్ ప్యాకేజీ కింద రాజీవ్‌కు పెద్ద మొత్తంలో ఆఫర్ చేశారంటూ ఆరోపించారు. చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్‌గా 2015లో రాజీవ్ బన్సాల్ రాజీనామా చేశారు. అప్పుడు రూ.17.38 కోట్ల సెవరెన్స్ ప్యాకేజీ ఇస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. దానిలో కేవలం రూ.5 కోట్లు మాత్రమే రాజీవ్‌కు చెల్లించింది. మిగతా మొత్తాన్ని చెల్లించకుండా అలా ఆపివేసింది. మిగతా మొత్తాన్ని కూడా తనకు చెల్లించాలని కోరుతూ.. బన్సాల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. -
రాజీకి రడీ- ఇన్ఫోసిస్
సాక్షి, ముంబై: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ రాజీవ్ బన్సల్ వివాదంలో రాజీకి సిద్ధపడుతోంది. ఈ మేరకు ప్యాకేజీపై సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) ముందు సెటిల్మెంట్ అప్లికేషన్‌ను సమర్పించింది. సెవెరెన్స్ పే (తెగదెంపుల కోసం జరిపే చెల్లింపులు) వివాదంలో రాజీ కుదుర్చుకోనున్నామని ప్రకటించింది. ఈమేరకు సెబికి సెటిల్మెంట్ అప్లికేషన్‌ను సమర్పించినట్లు బిఎస్ఈ ఫైలింగ్‌లో తెలిపింది. బన్సల్‌కు సెవెరెన్స్ పే ప్యాకేజీ విషయంలో కంపెనీ సమాచార బహిర్గత నిబంధనలను ఉల్లంఘించిందన్న ఆరోపణలపై సెబీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. 2015లో బన్సల్ సంస్థను వీడిన సందర్భంగా రూ.17.38కోట్లను చెల్లించేందుకు అంగీకరించి... రూ.5 కోట్లుమాత్రమే చెల్లించింది. శేషశాయి ఆధ్వర్యంలోని అప్పటి ఇన్ఫీ బోర్డు వాగ్దానం చేసినట్టుగా మిగతా సొమ్మును చెల్లించాలంటూ న్యాయపోరాటానికి దిగారు. దీంతో వివాదం రేగింది. ఈ సెటిల్మెంట్ ప్యాకేజీ కోసం నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ, ఆడిట్ కమిటీ నుంచి ఇన్ఫీ బోర్డు ముందస్తు అనుమతి తీసుకోలేదన్న ఆరోపణలున్నాయి. -
ఎయిర్ ఇండియా కొత్త సీఎండీ ఈయనే
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయానసంస్థ ఎయిర్ ఇండియాకు కొత్త సీఎండీగా రాజీవ్ బన్సల్ ఎంపికయ్యారు. ఎయిర్ ఇండియా ఛైర్మన్ అశ్వని లోహానీ రైల్వే బోర్డ్ ఛైర్మన్ గా నియమితులుకావడంతో ఆయన స్థానంలోరాజీవ్ నియమితులయ్యారు. పెట్రోలియం మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శిగా ఉన్న బన్సల్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత బాధ్యతలకు అదనంగా ఈ బాధ్యతలను ఆయన చేపట్టనున్నారు. గతంలో విమానయాన మంత్రిత్వశాఖ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవం కూడా బన్సల్ కు ఉంది. పెట్రోలియం మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి, ఫైనాన్షియల్ అడ్వైజర్ గా ఉన్న రాజీవ్ బన్సల్‌ను తాత్కాలిక చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించినట్టు కేబినెట్ నియామకాల కమిటీ తెలిపింది. తదుపరి ఆదేశాలవరకు 3 నెలలు పాటు ఆయన ఈ బాధ్యతల్లోవుంటారని పేర్కొంది. కాగా రైల్వేలో వరుస ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ రైల్వే బోర్డు ఛైర్మన్ అశోక్ మిట్టల్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయనస్థానంలో ఎయిరిండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా అశ్వని లోహానిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఎయిర్ ఇండియాలో ప్రభుత్వ వాటా విక్రయానికి ప్రభుత్వం నిర్ణయించిన సంగతి విదితమే. -
ఈ-మెయిల్ యూజర్ల కోరిక నెరవేరబోతుందట!
న్యూఢిల్లీ : మాతృభాషలో ఈ-మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకోవడం మీ కోరికనా..? అయితే నచ్చిన భాషలోనే ఈమెయిల్ ఐడీ క్రియేట్ చేసుకునే అవకాశం యూజర్ల ముందుకు రాబోతుందట. అమెరికన్ టెక్నాలజీ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాప్ట్లు, రీడిఫ్ లాంటి దేశీయ ఈ-మెయిల్ సంస్థలు నచ్చిన భాషలో ఈమెయిల్ క్రియేట్ చేసుకునే వెసులుబాటును కల్పించనున్నాయట. ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఈ-మెయిల్ సర్వీసు ప్రొవేడర్లు ఈ మేరకు సేవలు అందించేందుకు సమ్మతించారు. గూగుల్, మైక్రోసాప్ట్, రీడిఫ్ మెయిల్ ఎగ్జిక్యూటివ్‌లతో ప్రభుత్వం గత నెలలో సమావేశం జరిపింది. ఈ సమావేశంలో దేశీ ఈ-మెయిల్ అడ్రస్‌లను యూజర్లకు అందుబాటులోకి తేవాలని, హిందీ లాంగ్వేజ్‌తో ఈ సర్వీసులను అందించాలని ప్రభుత్వం కోరింది. దీంతో సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఇంటర్నెట్ యాక్సెస్‌ను మరింత దగ్గర చేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే కొన్నేళ్లలో భారత్ నెట్ ప్రాజెక్టు కింద 250,000 గ్రామ పంచాయితీలను హైస్పీడ్ ఇంటెర్నెట్‌కు కనెక్ట్ చేయనున్నామని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ రాజీవ్ బన్సాల్ తెలిపారు. వారికి అనువైన రీతిలో ఇంటర్నెట్ సేవలు కల్పిస్తే ప్రజలు సులభతరంగా దీన్ని యాక్సెస్ పొందుతారని ఆయన పేర్కొన్నారు. ఇంటర్నెట్ యాక్సెస్‌ను కూడా పెంచవచ్చని తెలిపారు. భారత్‌లో ఎంతమంది ఇంగ్లీష్ భాషను చదవగలుగుతున్నారు? ఎంతమంది ఇంగ్లీష్‌లో టైప్ చేయగలుగుతున్నారని బన్సాల్ ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్న గూగుల్, మైక్రోసాప్ట్, రీడిఫ్ మెయిల్ ఎగ్జిక్యూటివ్‌లు స్థానిక భాషలో ఈ-మెయిల్ అడ్రస్‌లను కల్పించడానికి సమ్మతించారు. స్థానిక భాషలో ఈ-మెయిల్ అడ్రస్‌లను కల్పించడం సులభతరమేనని రీడిఫ్ సీఈవో అజిత్ బాలకృష్ణన్ తెలిపారు. కానీ ఇంటర్నెట్ సేవలను ప్రతిఒక్కరికీ అందుబాటులోకి తేవాలంటే ప్రభుత్వం నెట్ యాక్సెస్ ధరలను తగ్గిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు. -
త్వరలో ఓలా ఐపీఓ
న్యూఢిల్లీ/బెంగళూరు: ట్యాక్సీ అగ్రిగేటర్ ఓలా త్వరలో ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు రానున్నది. త్వరలో ఐపీఓకు వస్తామని ఓలా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రాజీవ్ బన్సాల్ చెప్పారు. ఆయన కచ్చితంగా ఎప్పుడు ఐపీఓకు వచ్చేది వెల్లడించలేదు. గతంలో ఇన్ఫోసిస్‌లో డెరైక్టర్‌గా పనిచేసిన బన్సాల్ ఈ ఏడాది జనవరిలో ఓలాలో చేరారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన స్టార్టప్ అయిన ఉబెర్‌తో పెరుగుతున్న పోటీని దీటుగా తట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నామని, తాము తగిన స్థాయిలో పనిచేస్తే మరో ఇన్ఫోసిస్ అవుతామని వివరించారు. లాభదాయకత మెరుగుపరచుకునేందుకు ఓలా కేఫ్ తదితర వ్యాపారాల నుంచి వైదొలగనున్నట్లు బన్సాల్ చెప్పారు. ముంబై-ఐఐటీ పట్టభద్రులైన భవిష్ అగర్వాల్, అంకిత్ భాటిలు ఓలాను స్థాపించారు. గత నవంబర్‌లో ఈ సంస్థ 50 కోట్ల డాలర్ల నిధులను సమీకరించింది. అప్పుడు ఈ కంపెనీ విలువను 500 కోట్ల డాలర్లుగా అంచనా కట్టారు. ధనికుల పన్ను ఎగవేతల నిరోధానికి టెక్నాలజీ: సీబీడీటీ న్యూఢిల్లీ: ధనికుల పన్ను ఎగవేతల నిరోధానికి అత్యాధునిక సాంకేతికను వినియోగిస్తామని ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) చైర్మన్ అతులేష్ జిందాల్ పేర్కొన్నారు. ఏడాదికి కోటి రూపాయలకు మించి ఆదాయం వస్తున్న వారి సంఖ్య కోటికన్నా తక్కువగానే ఉన్నప్పటికీ, వీరిలో కొందరు ట్యాక్స్ రిటర్న్స్ విషయంలో... తమ ఆదాయాలను తక్కువచేసి చూపుతున్నారన్న విమర్శల్లో నిజం ఉందన్నారు. -
ఓలా సీఎఫ్‌వోగా ‘ఇన్ఫీ’ రాజీవ్ బన్సల్
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రాజీవ్ బన్సల్‌ను తాజాగా ట్యాక్సీ సర్వీసుల సంస్థ ఓలా సీఎఫ్‌వోగా నియమితులయ్యారు. వచ్చే ఏడాది జనవరిలో ఆయన విధుల్లో చేరతారు. రాజీవ్ బన్సల్ అక్టోబర్‌లో ఇన్ఫీకి రాజీనామా చేశారు. ఆర్థిక రంగంలో ఆయనకి ఉన్న సుదీర్ఘ అనుభవం తమకు తోడ్పడగలదని ఓలా సహ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ తెలిపారు. రాజీవ్‌కు ర్థిక రంగంలో 21 ఏళ్ల అనుభవం ఉంది. ఇన్ఫీలో 16 ఏళ్లుగా పనిచేశారు. అంతకు ముందు టాటా టెక్నాలజీస్, కేబుల్ అండ్ వైర్లెస్, ఏబీబీ తదితర సంస్థల్లో పనిచేశారు. ఇన్ఫోసిస్‌లో అత్యధిక వేతనం అందుకున్న ఉద్యోగుల్లో ఆయన కూడా ఒకరు. మార్చి 2015తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆయన 7,70,858 డాలర్ల ప్యాకేజీ పొందారు. -
ఇన్ఫోసిస్ ఫలితాలు ఓకే..
బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాల బోణీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ తొలి త్రైమాసికం(2014-15, క్యూ1)లో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.2,886 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఆర్జించిన రూ.2,374 కోట్లతో పోలిస్తే వార్షిక ప్రాతిపదికన లాభం 21.5 శాతం ఎగబాకింది. ఇక మొత్తం ఆదాయం కూడా రూ. 11,267 కోట్ల నుంచి రూ.12,770 కోట్లకు పెరిగింది. వార్షికంగా 13.3 శాతం వృద్ధి నమోదైంది. కంపెనీలో ఇటీవలే భారీగా యాజమాన్యపరమైన మార్పులు చోటుచేసుకున్న నేపథ్యంలో కంపెనీ సీఈఓ, ఎండీ ఎస్డీ శిబులాల్ చిట్టచివరి ఆర్థిక ఫలితాల ప్రకటన ఇది. త్రైమాసికంగా తగ్గింది...: గతేడాది ఆఖరి క్వార్టర్(క్యూ4)తో పోలిస్తే ఈ ఏడాది క్యూ1లో(త్రైమాసిక ప్రాతిపదికన) ఇన్ఫీ లాభాలు 3.5 శాతం తగ్గాయి. క్యూ4లో రూ.2,992 కోట్ల లాభం నమోదైంది. కాగా, మొత్తం ఆదాయం కూడా 0.8 శాతం(క్యూ4లో రూ.12,875 కోట్లు) స్వల్పంగా తగ్గింది. అయితే, డాలరు రూపంలో ఏప్రిల్-జూన్ ఆదాయం 1.95 శాతం పెరిగి 2.133 బిలియన్ డాలర్లకు చేరింది. గెడైన్స్ యథాతథం...: ప్రస్తుత 2014-15 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయ వృద్ధి అంచనా(గెడైన్స్)లను గతంలో ప్రకటించిన మాదిరిగానే యథాతథంగా కొనసాగించింది. క్యూ4 ఫలితాల సందర్భంగా డాలరు రూపంలో ఆదాయ గెడైన్స్‌ను 7-9 శాతంగా కంపెనీ ప్రకటించింది. ఇప్పుడు ఇదే గెడైన్స్‌ను కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. ఇక రూపాయి ప్రాతిపదికన గెడైన్స్ 5.6-7.6 శాతంగా ఉండొచ్చని వెల్లడించింది. డాలరుతో రూపాయి మారకం విలువ 60 చొప్పున ప్రాతిపదికగా తీసుకున్నట్లు ఇన్ఫీ తెలిపింది. విశ్లేషకుల అంచనాలకు పైనే... బ్రోకరేజి కంపెనీలకు చెందిన విశ్లేషకులు క్యూ1లో ఇన్ఫీ ఆదాయం సగటున రూ.12,814 కోట్లు, నికర లాభం రూ.2,667 కోట్లుగా అంచనావేశారు. ఈ అంచనాల కంటే మెరుగ్గానే ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... క్యూ1లో 5 మల్టీమిలియన్ డాలర్ కాంట్రాక్టులు ఇన్ఫోసిస్ దక్కించుకుంది. వీటి విలువ 70 కోట్ల డాలర్లు. ఇక ఈ కాలంలో మొత్తం 61 క్లయింట్లు కొత్తగా జతయ్యారు. ఇన్ఫీ నిర్వహణ మార్జిన్ క్రితం క్యూ1తో పోలిస్తే 23.5 శాతం నుంచి 25.1 శాతానికి మెరుగుపడింది. జూన్ చివరినాటికి కంపెనీ వద్దనున్న నగదు తత్సంబంధ నిల్వలు కాస్త తగ్గి రూ.29,748 కోట్లుగా నమోదైంది. ఈ ఏడాది మార్చిచివరికి ఈ మొత్తం రూ.30,251 కోట్లుగా ఉన్నాయి. ఏప్రిల్-జూన్ కాలంలో సబ్సిడరీలతో సహా కంపెనీలో కొత్తగా 11,506 మంది ఉద్యోగులు చేరారు. అయితే, కంపెనీని 10,627 మంది వీడటంతో నికరంగా 879 మందికి మాత్రమే జతైనట్లు లెక్క. దీంతో జూన్ చివరికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,61,284కు చేరింది. ఉద్యోగుల వలసల(అట్రిషన్) రేటు 19.5 శాతానికి ఎగబాకింది. క్రితం ఏడాది క్యూ1లో ఈ రేటు 16.9 శాతం కాగా, క్యూ4లో 18.7%. ఫలితాల నేపథ్యంలో శుక్రవారం కంపెనీ షేరు ధర బీఎస్ఈలో 1 శాతం లాభపడి రూ. 3,326 వద్ద స్థిరపడింది. మార్పులు... చేర్పులు.. కొత్త సీఈఓ, ఎండీగా విశాల్ సిక్కా నియామకానికి ఆమోదం కోసం ఈ నెల 30న అసాధారణ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనున్నట్లు కంపెనీ తెలిపింది. క్యూ1లోనే ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నారాయణ మూర్తి, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఎస్. గోపాలకృష్ణన్‌లు పదవుల నుంచి వైదొలిగారు. అయితే, అక్టోబర్ 10 వరకూ వాళ్లు ఈ పదవుల్లో తాత్కాలికంగా కొనసాగనున్నారు. అక్టోబర్ 11 నుంచి గౌరవ చైర్మన్‌గా నారాయణ మూర్తి వ్యవహరిస్తారు. అదే రోజు నుంచి కేవీ కామత్ బోర్డు చైర్మన్ బాధ్యతలు స్వీకరిస్తారు. కాగా, ఈ మార్పుల సందర్భంగానే ప్రెసిడెంట్, హోల్‌టైమ్ డెరైక్టర్ యూబీ ప్రవీణ్ రావు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ)గా పదోన్నతి పొందారు. మార్పును స్వాగతిస్తున్నా: శిబులాల్ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ప్రస్తుత సీఈఓ, ఎండీ ఎస్డీ శిబులాల్... తన ఆఖరి ఫలితాల ప్రకటనలో కొంత వేదాంత ధోరణితో మాట్లాడారు. శిబులాల్ స్థానంలో శాప్ మాజీ ఎగ్జిక్యూటివ్ విశాల్ సిక్కాకు వచ్చే నెల 1న బాధ్యతలను అప్పగించనున్న సంగతి తెలిసిందే. మూడు దశాబ్దాల క్రితం తనతోపాటు మొత్తం ఏడుగురు కలసి ఏర్పాటు చేసిన ఇన్ఫీ ఇప్పుడు 8 బిలియన్ డాలర్ల ఆదాయార్జనగల కంపెనీగా ఎదిగింది. కాగా, ఇప్పటిదాకా కంపెనీ సీఈఓలుగా ఏడుగురు సహవ్యవస్థాపకులే కొనసాగారు. తొలిసారి సిక్కా రూపంలో బయటివ్యక్తి పగ్గాలు చేపట్టనుండటం విశేషం. ‘అత్యంత పటిష్టమైన మూలాలతో ఉన్న కంపెనీని విడిచివెళ్తున్నా. బలమైన యంత్రాంగాన్ని ఉపయోగించుకుని సిక్కా కంపెనీని మరింత ఉన్నత స్థానాలకు తీసుకెళ్తారన్న సంపూర్ణ విశ్వాసం ఉంది. ఆయన టీమ్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మార్పులనేవి జీవితంలో ఒక భాగమేనని నేను భావిస్తా. అయితే, నా ప్రయాణం చాలా గొప్పగానే సాగింది. గడచిన మూడేళ్లుగా మేం ఎదుర్కొంటున్న అనేక కఠిన పరిస్థితుల నుంచి ఇప్పుడు బయటికొస్తున్నాం. ఇంటాబయటా ముఖ్యంగా సిబ్బంది వలసల నుంచి క్లయింట్లను అట్టిపెట్టుకోవడం ఇలా పలు సవాళ్లను మేం దీటుగా ఎదుర్కొన్నాం. ఇప్పుడు ఈ సవాళ్లన్నీ తొలగినట్టే. ఇన్ఫీని వీడుతున్నందుకు నేనేమీ చింతించడం లేదు. జరిగిపోయిన విషయాలపై అతిగా అలోచించే వ్యక్తిని కూడా కాదు. కంపెనీ మార్జిన్లు మెరుగుపడుతున్నాయి. ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ మా నుంచి ఒక్క క్లయింట్ కూడా జారిపోలేదు. యూరప్‌లో కీలకమైన లోడ్స్టోన్ను కొనుగోలు చేయడం మేం తీసుకున్న వ్యూహాత్మకమైన నిర్ణయం. అంతేకాదు.. 2012-13తో పోలిస్తే గతేడాది మా ఆదాయం రెట్టింపుస్థాయిలో పెరగడం కూడా గమనించాల్సిన విషయం. మా కంపెనీలో అట్రిషన్ రేటు పెరగడం కొంత ఆందోళనకరమైన అంశమే. అయితే, ఐటీ పరిశ్రమలో నిపుణులైన సిబ్బందికి డిమాండ్ అధికంగాఉందన్న పరిస్థితిని ఇది తెలియజేస్తోంది. ఈ ఏడాదికి సంబంధించి మొత్తం 22,000 ఫ్రెషర్లకు కంపెనీ క్యాంపస్ ఆఫర్లు ఇచ్చింది. వ్యాపారపరిస్థితికి అనుగుణంగా వీళ్లను దశలవారీగా నియమించుకుంటాం’ అని శిబులాల్ ప్రస్తుత కంపెనీ పరిస్థితిని వివరించారు.