ఈ-మెయిల్ యూజర్ల కోరిక నెరవేరబోతుందట!
న్యూఢిల్లీ : మాతృభాషలో ఈ-మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకోవడం మీ కోరికనా..? అయితే నచ్చిన భాషలోనే ఈమెయిల్ ఐడీ క్రియేట్ చేసుకునే అవకాశం యూజర్ల ముందుకు రాబోతుందట. అమెరికన్ టెక్నాలజీ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాప్ట్లు, రీడిఫ్ లాంటి దేశీయ ఈ-మెయిల్ సంస్థలు నచ్చిన భాషలో ఈమెయిల్ క్రియేట్ చేసుకునే వెసులుబాటును కల్పించనున్నాయట. ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఈ-మెయిల్ సర్వీసు ప్రొవేడర్లు ఈ మేరకు సేవలు అందించేందుకు సమ్మతించారు. గూగుల్, మైక్రోసాప్ట్, రీడిఫ్ మెయిల్ ఎగ్జిక్యూటివ్లతో ప్రభుత్వం గత నెలలో సమావేశం జరిపింది. ఈ సమావేశంలో దేశీ ఈ-మెయిల్ అడ్రస్లను యూజర్లకు అందుబాటులోకి తేవాలని, హిందీ లాంగ్వేజ్తో ఈ సర్వీసులను అందించాలని ప్రభుత్వం కోరింది.
దీంతో సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఇంటర్నెట్ యాక్సెస్ను మరింత దగ్గర చేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే కొన్నేళ్లలో భారత్ నెట్ ప్రాజెక్టు కింద 250,000 గ్రామ పంచాయితీలను హైస్పీడ్ ఇంటెర్నెట్కు కనెక్ట్ చేయనున్నామని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ రాజీవ్ బన్సాల్ తెలిపారు. వారికి అనువైన రీతిలో ఇంటర్నెట్ సేవలు కల్పిస్తే ప్రజలు సులభతరంగా దీన్ని యాక్సెస్ పొందుతారని ఆయన పేర్కొన్నారు. ఇంటర్నెట్ యాక్సెస్ను కూడా పెంచవచ్చని తెలిపారు.
భారత్లో ఎంతమంది ఇంగ్లీష్ భాషను చదవగలుగుతున్నారు? ఎంతమంది ఇంగ్లీష్లో టైప్ చేయగలుగుతున్నారని బన్సాల్ ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్న గూగుల్, మైక్రోసాప్ట్, రీడిఫ్ మెయిల్ ఎగ్జిక్యూటివ్లు స్థానిక భాషలో ఈ-మెయిల్ అడ్రస్లను కల్పించడానికి సమ్మతించారు. స్థానిక భాషలో ఈ-మెయిల్ అడ్రస్లను కల్పించడం సులభతరమేనని రీడిఫ్ సీఈవో అజిత్ బాలకృష్ణన్ తెలిపారు. కానీ ఇంటర్నెట్ సేవలను ప్రతిఒక్కరికీ అందుబాటులోకి తేవాలంటే ప్రభుత్వం నెట్ యాక్సెస్ ధరలను తగ్గిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు.