మైక్రోసాఫ్ట్ ఏఐ వ్యూహంపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సూక్ష్మంగా స్పందించారు. ది న్యూయార్క్ టైమ్స్ డీల్‌బుక్ సమ్మిట్‌లో ఇటీవల ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోటీదారులతో పోలిస్తే ఏఐలో గూగుల్ (Google) పురోగతి గురించి అడిగినప్పుడు, పిచాయ్ ఒక కీలకమైన వ్యత్యాసాన్ని హైలైట్ చేశారు. గూగుల్ సొంత ఏఐ మోడల్‌లను అభివృద్ధి చేస్తుంది.. కానీ మైక్రోసాఫ్ట్ ఓపెన్ ఏఐ వంటి కంపెనీల బాహ్య మోడల్‌లపై ఆధారపడుతుందని చెప్పుకొచ్చారు.
సత్య నాదెళ్ల మాటకేమంటారు..?
పోటీదారులతో పోలుస్తూ ఏఐలో గూగుల్ పురోగతి గురించి ఇంటర్వ్యూయర్ ప్రశ్నించారు. ఏఐ రేసులో గూగుల్ గెలవాలని సవాలు విసురుతూ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల గతంలో చేసిన వ్యాఖ్యను కూడా ఆయన గుర్తుచేశారు. పిచాయ్ స్పందిస్తూ మైక్రోసాఫ్ట్ బాహ్య ఏఐ మోడల్స్‌పై ఆధారపడుతుందని, కానీ గూగుల్ సొంతంగా అభివృద్ధి చేస్తుందని ఎద్దేవా చేశారు.
చాట్‌జీపీటీని అభివృద్ధి చేసిన ఓపెన్‌ఏఐలో మైక్రోసాఫ్ట్ 13 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిన అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంటే మైక్రోసాఫ్ట్‌కు సవాలు విసురుతున్నారా.. అని ప్రశ్నించగా పిచాయ్ నవ్వుతూ, "అలా కాదు.. వారి పట్ల, వారి టీమ్ పట్ల నాకు చాలా గౌరవం ఉంది" అని పేర్కొన్నారు.
సత్య నాదెళ్ల వ్యాఖ్యలపై పిచాయ్ స్పందించడం ఇదే తొలిసారి కాదు. ఈ సంవత్సరం ప్రారంభంలో తమ ఏఐ- పవర్డ్ బింగ్ సెర్చ్ ఇంజిన్‌ను ప్రారంభించిన తర్వాత సెర్చ్ వ్యాపారం పరంగా గూగుల్ ఎడ్జ్ గురించి నాదెళ్ల మాట్లాడారు. సెర్చ్ ఇంజిన్ మార్కెట్లో గూగుల్‌ను '800-పౌండ్ల గొరిల్లా' అని అభివర్ణించారు. తమ ఆవిష్కరణలతో గూగుల్‌ను ఆట ఆడిస్తామని చెప్పారు. బ్లూమ్‌బెర్గ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పిచాయ్.. మైక్రోసాఫ్ట్ బాస్‌కు కౌంటర్ ఇచ్చారు. తాము వేరొకరి మ్యూజిక్‌కు ఆడబోమంటూ బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment