ఇన్ఫోసిస్ ఫలితాలు ఓకే.. | Infosys Q1 profit up 21.6% at Rs 2886 crore, beats estimates | Sakshi
Sakshi News home page

ఇన్ఫోసిస్ ఫలితాలు ఓకే..

Published Sat, Jul 12 2014 1:51 AM | Last Updated on Sat, Sep 2 2017 10:09 AM

ఇన్ఫోసిస్ ఫలితాలు ఓకే..

ఇన్ఫోసిస్ ఫలితాలు ఓకే..

బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాల బోణీ చేసింది. ఈ ఏడాది  ఏప్రిల్-జూన్ తొలి త్రైమాసికం(2014-15, క్యూ1)లో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.2,886 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఆర్జించిన రూ.2,374 కోట్లతో పోలిస్తే వార్షిక ప్రాతిపదికన లాభం 21.5 శాతం ఎగబాకింది. ఇక మొత్తం ఆదాయం కూడా రూ. 11,267 కోట్ల నుంచి రూ.12,770 కోట్లకు పెరిగింది. వార్షికంగా 13.3 శాతం వృద్ధి నమోదైంది. కంపెనీలో ఇటీవలే భారీగా యాజమాన్యపరమైన మార్పులు చోటుచేసుకున్న నేపథ్యంలో కంపెనీ సీఈఓ, ఎండీ ఎస్‌డీ శిబులాల్ చిట్టచివరి ఆర్థిక ఫలితాల ప్రకటన ఇది.

 త్రైమాసికంగా తగ్గింది...: గతేడాది ఆఖరి క్వార్టర్(క్యూ4)తో పోలిస్తే ఈ ఏడాది క్యూ1లో(త్రైమాసిక ప్రాతిపదికన) ఇన్ఫీ లాభాలు 3.5 శాతం తగ్గాయి. క్యూ4లో రూ.2,992 కోట్ల లాభం నమోదైంది. కాగా, మొత్తం ఆదాయం కూడా 0.8 శాతం(క్యూ4లో రూ.12,875 కోట్లు) స్వల్పంగా తగ్గింది. అయితే, డాలరు రూపంలో ఏప్రిల్-జూన్ ఆదాయం 1.95 శాతం పెరిగి 2.133 బిలియన్ డాలర్లకు చేరింది.

 గెడైన్స్ యథాతథం...: ప్రస్తుత 2014-15 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయ వృద్ధి అంచనా(గెడైన్స్)లను గతంలో ప్రకటించిన మాదిరిగానే యథాతథంగా కొనసాగించింది. క్యూ4 ఫలితాల సందర్భంగా డాలరు రూపంలో ఆదాయ గెడైన్స్‌ను 7-9 శాతంగా కంపెనీ ప్రకటించింది. ఇప్పుడు ఇదే గెడైన్స్‌ను కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. ఇక రూపాయి ప్రాతిపదికన గెడైన్స్ 5.6-7.6 శాతంగా ఉండొచ్చని వెల్లడించింది. డాలరుతో రూపాయి మారకం విలువ 60 చొప్పున ప్రాతిపదికగా తీసుకున్నట్లు ఇన్ఫీ తెలిపింది.

 విశ్లేషకుల అంచనాలకు పైనే...
 బ్రోకరేజి కంపెనీలకు చెందిన విశ్లేషకులు క్యూ1లో ఇన్ఫీ ఆదాయం సగటున రూ.12,814 కోట్లు, నికర లాభం రూ.2,667 కోట్లుగా అంచనావేశారు. ఈ అంచనాల కంటే మెరుగ్గానే ఫలితాలు వెలువడ్డాయి.

 ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ...
క్యూ1లో 5 మల్టీమిలియన్ డాలర్ కాంట్రాక్టులు ఇన్ఫోసిస్ దక్కించుకుంది. వీటి విలువ 70 కోట్ల డాలర్లు. ఇక ఈ కాలంలో మొత్తం 61 క్లయింట్లు కొత్తగా జతయ్యారు.
 
ఇన్ఫీ నిర్వహణ మార్జిన్ క్రితం క్యూ1తో పోలిస్తే 23.5 శాతం నుంచి 25.1 శాతానికి మెరుగుపడింది.

జూన్ చివరినాటికి కంపెనీ వద్దనున్న నగదు తత్సంబంధ నిల్వలు కాస్త తగ్గి రూ.29,748 కోట్లుగా నమోదైంది. ఈ ఏడాది మార్చిచివరికి ఈ మొత్తం రూ.30,251 కోట్లుగా ఉన్నాయి.

 ఏప్రిల్-జూన్ కాలంలో సబ్సిడరీలతో సహా కంపెనీలో కొత్తగా 11,506 మంది ఉద్యోగులు చేరారు. అయితే, కంపెనీని 10,627 మంది వీడటంతో నికరంగా 879 మందికి మాత్రమే జతైనట్లు లెక్క. దీంతో జూన్ చివరికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,61,284కు చేరింది.

ఉద్యోగుల వలసల(అట్రిషన్) రేటు 19.5 శాతానికి ఎగబాకింది. క్రితం ఏడాది క్యూ1లో ఈ రేటు 16.9 శాతం కాగా, క్యూ4లో 18.7%.

 ఫలితాల నేపథ్యంలో శుక్రవారం కంపెనీ షేరు ధర బీఎస్‌ఈలో 1 శాతం లాభపడి రూ. 3,326 వద్ద స్థిరపడింది.
 
 మార్పులు... చేర్పులు..

 కొత్త సీఈఓ, ఎండీగా విశాల్ సిక్కా నియామకానికి ఆమోదం కోసం ఈ నెల 30న అసాధారణ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనున్నట్లు కంపెనీ తెలిపింది.

 క్యూ1లోనే ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నారాయణ మూర్తి, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఎస్. గోపాలకృష్ణన్‌లు పదవుల నుంచి వైదొలిగారు. అయితే, అక్టోబర్ 10 వరకూ వాళ్లు ఈ పదవుల్లో తాత్కాలికంగా కొనసాగనున్నారు. అక్టోబర్ 11 నుంచి గౌరవ చైర్మన్‌గా నారాయణ మూర్తి వ్యవహరిస్తారు. అదే రోజు నుంచి కేవీ కామత్ బోర్డు చైర్మన్ బాధ్యతలు స్వీకరిస్తారు. కాగా, ఈ మార్పుల సందర్భంగానే ప్రెసిడెంట్, హోల్‌టైమ్ డెరైక్టర్ యూబీ ప్రవీణ్ రావు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ)గా పదోన్నతి పొందారు.

 మార్పును స్వాగతిస్తున్నా: శిబులాల్
 ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ప్రస్తుత సీఈఓ, ఎండీ ఎస్‌డీ శిబులాల్... తన ఆఖరి ఫలితాల ప్రకటనలో కొంత వేదాంత ధోరణితో మాట్లాడారు. శిబులాల్ స్థానంలో శాప్ మాజీ ఎగ్జిక్యూటివ్ విశాల్ సిక్కాకు వచ్చే నెల 1న బాధ్యతలను అప్పగించనున్న సంగతి తెలిసిందే. మూడు దశాబ్దాల క్రితం తనతోపాటు మొత్తం ఏడుగురు కలసి ఏర్పాటు చేసిన ఇన్ఫీ ఇప్పుడు 8 బిలియన్ డాలర్ల ఆదాయార్జనగల కంపెనీగా ఎదిగింది. కాగా, ఇప్పటిదాకా కంపెనీ సీఈఓలుగా ఏడుగురు సహవ్యవస్థాపకులే కొనసాగారు. తొలిసారి సిక్కా రూపంలో బయటివ్యక్తి పగ్గాలు చేపట్టనుండటం విశేషం.

 ‘అత్యంత పటిష్టమైన మూలాలతో ఉన్న కంపెనీని విడిచివెళ్తున్నా. బలమైన యంత్రాంగాన్ని ఉపయోగించుకుని సిక్కా కంపెనీని మరింత ఉన్నత స్థానాలకు తీసుకెళ్తారన్న సంపూర్ణ విశ్వాసం ఉంది. ఆయన టీమ్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మార్పులనేవి జీవితంలో ఒక భాగమేనని నేను భావిస్తా. అయితే, నా ప్రయాణం చాలా గొప్పగానే సాగింది.

గడచిన మూడేళ్లుగా మేం ఎదుర్కొంటున్న అనేక కఠిన పరిస్థితుల నుంచి ఇప్పుడు బయటికొస్తున్నాం. ఇంటాబయటా ముఖ్యంగా సిబ్బంది వలసల నుంచి క్లయింట్లను అట్టిపెట్టుకోవడం ఇలా పలు సవాళ్లను మేం దీటుగా ఎదుర్కొన్నాం. ఇప్పుడు ఈ సవాళ్లన్నీ తొలగినట్టే. ఇన్ఫీని వీడుతున్నందుకు నేనేమీ చింతించడం లేదు. జరిగిపోయిన విషయాలపై అతిగా అలోచించే వ్యక్తిని కూడా కాదు. కంపెనీ మార్జిన్లు మెరుగుపడుతున్నాయి. ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ మా నుంచి ఒక్క క్లయింట్ కూడా జారిపోలేదు.

యూరప్‌లో కీలకమైన లోడ్‌స్టోన్‌ను కొనుగోలు చేయడం మేం తీసుకున్న వ్యూహాత్మకమైన నిర్ణయం. అంతేకాదు.. 2012-13తో పోలిస్తే గతేడాది మా ఆదాయం రెట్టింపుస్థాయిలో పెరగడం కూడా గమనించాల్సిన విషయం. మా కంపెనీలో అట్రిషన్ రేటు పెరగడం కొంత ఆందోళనకరమైన అంశమే. అయితే, ఐటీ పరిశ్రమలో నిపుణులైన సిబ్బందికి డిమాండ్ అధికంగాఉందన్న పరిస్థితిని ఇది తెలియజేస్తోంది. ఈ ఏడాదికి సంబంధించి మొత్తం 22,000 ఫ్రెషర్లకు కంపెనీ క్యాంపస్ ఆఫర్‌లు ఇచ్చింది. వ్యాపారపరిస్థితికి అనుగుణంగా వీళ్లను దశలవారీగా నియమించుకుంటాం’ అని శిబులాల్ ప్రస్తుత కంపెనీ పరిస్థితిని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement