త్వరలో ఓలా ఐపీఓ
న్యూఢిల్లీ/బెంగళూరు: ట్యాక్సీ అగ్రిగేటర్ ఓలా త్వరలో ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు రానున్నది. త్వరలో ఐపీఓకు వస్తామని ఓలా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రాజీవ్ బన్సాల్ చెప్పారు. ఆయన కచ్చితంగా ఎప్పుడు ఐపీఓకు వచ్చేది వెల్లడించలేదు. గతంలో ఇన్ఫోసిస్‌లో డెరైక్టర్‌గా పనిచేసిన బన్సాల్ ఈ ఏడాది జనవరిలో ఓలాలో చేరారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన స్టార్టప్ అయిన ఉబెర్‌తో పెరుగుతున్న పోటీని దీటుగా తట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నామని, తాము తగిన స్థాయిలో పనిచేస్తే మరో ఇన్ఫోసిస్ అవుతామని వివరించారు. లాభదాయకత మెరుగుపరచుకునేందుకు ఓలా కేఫ్ తదితర వ్యాపారాల నుంచి వైదొలగనున్నట్లు బన్సాల్ చెప్పారు. ముంబై-ఐఐటీ పట్టభద్రులైన భవిష్ అగర్వాల్, అంకిత్ భాటిలు ఓలాను స్థాపించారు. గత నవంబర్‌లో ఈ సంస్థ 50 కోట్ల డాలర్ల నిధులను సమీకరించింది. అప్పుడు ఈ కంపెనీ విలువను 500 కోట్ల డాలర్లుగా అంచనా కట్టారు.
ధనికుల పన్ను ఎగవేతల నిరోధానికి టెక్నాలజీ: సీబీడీటీ
న్యూఢిల్లీ: ధనికుల పన్ను ఎగవేతల నిరోధానికి అత్యాధునిక సాంకేతికను వినియోగిస్తామని ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) చైర్మన్ అతులేష్ జిందాల్ పేర్కొన్నారు. ఏడాదికి కోటి రూపాయలకు మించి ఆదాయం వస్తున్న వారి సంఖ్య కోటికన్నా తక్కువగానే ఉన్నప్పటికీ, వీరిలో కొందరు ట్యాక్స్ రిటర్న్స్ విషయంలో... తమ ఆదాయాలను తక్కువచేసి చూపుతున్నారన్న విమర్శల్లో నిజం ఉందన్నారు.