కుప్పకూలిన భారత హెలికాప్టర్ (ఫైల్). మీడియాతో మాట్లాడుతున్న వాయుసేన చీఫ్ భదౌరియా (ఇన్‌సెట్‌లో)
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఫిబ్రవరి చివరలో.. తమ సొంత హెలికాప్టర్‌ను కశ్మీర్లో తామే కూల్చివేయడం అతిపెద్ద తప్పిదమని వైమానిక దళ(ఐఏఎఫ్) ప్రధానాధికారి రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా అంగీకరించారు. పాక్ వైపు నుంచి జరిగే ఏ దాడులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తక్కువ సమయంలోనే స్పందించి, సైన్యం, నౌకాదళంతో సమన్వయం చేసుకుని దాడులు చేయగలమన్నారు. ఫిబ్రవరి 27న పొరపాటున బుద్గాం జిల్లాలో ఐఏఎఫ్‌కు చెందిన ఎంఐ 17 చాపర్‌ను వైమానిక దళం భూమి మీది నుంచి ఆకాశంపై ప్రయోగించగల క్షిపణి ద్వారా కూల్చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు ఐఏఎఫ్ అధికారులు, ఒక పౌరుడు మరణించారు.
ఈ ఘటనపై జరిపిన అంతర్గత విచారణ ముగిసిందని, బాధ్యులుగా తేలిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని భదౌరియా శుక్రవారం తన తొలి ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. ఇద్దరు సీనియర్ అధికారులపై కోర్టు మార్షల్ ప్రక్రియ ప్రారంభించామన్నారు.అంతకుముందు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని బాలాకోట్‌లో ఉన్న ఉగ్ర స్థావరాలపై ఐఏఎఫ్ చేసిన దాడులకు సంబంధించిన వీడియో క్లిప్‌లను ప్రదర్శించారు. చాపర్‌లోని సిబ్బంది, కంట్రోల్ సెంటర్‌లోని అధికారుల మధ్య సమాచార లోపం విచారణలో స్పష్టంగా కనిపించిందని భదౌరియా తెలిపారు. కూల్చివేతకు గురైన సమయంలో చాపర్‌లోని ‘ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫ్రెండ్ ఆర్ ఫో’(ఐఎఫ్‌ఎఫ్– మిత్రుడా, శత్రువా గుర్తించడం) సిస్టమ్ నిలిపేసి ఉందని వాయుసేన వర్గాలు వెల్లడించాయి. దాంతో శత్రు చాపర్‌గా భావించి దానిని క్షిపణి ద్వారా కూల్చివేశారన్నారు. ఫిబ్రవరి 27న కశ్మీర్లోని నౌషేరాలో భారత్, పాక్‌ల మధ్య యుద్ధ విమానాలు భీకర పోరు సలుపుతున్న సమయంలో భారత్‌కు చెందిన ఎంఐ 17 కూల్చివేతకు గురైన విషయం తెలిసిందే.
డ్రోన్‌లతో ముప్పు
సరిహద్దుల్లో డ్రోన్ల ద్వారా ఆయుధాలను జారవిడవడం కొత్త ముప్పుగా మారిందని భదౌరియా పేర్కొన్నారు. పాక్‌లోని ఉగ్ర సంస్థలే దీనికి పాల్పడుతున్నాయన్నారు. టిబెట్ ప్రాంతంలో చైనా భారీగా మిలటరీ కేంద్రాలను ఏర్పాటు చేస్తుండటాన్ని నిశితంగా గమనిస్తున్నామన్నారు.అయితే, దానిపై అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పాక్ ఒప్పుకోకపోయినా, ఫిబ్రవరి 27న పాక్‌కు చెందిన ఎఫ్ 16ను భారత్ కూల్చివేయడం వాస్తవమేనని స్పష్టం చేశారు.
మరో బాలాకోట్ తరహా దాడులకు సిద్ధమేనా అన్న ప్రశ్నకు.. ప్రభుత్వ ఆదేశాలపై, లక్ష్యాలేవైనా, వాటి పని పడ్తామని సంసిద్ధత వ్యక్తం చేశారు. భారత వైమానిక దళ సమాచార వ్యవస్థను భవిష్యత్తులో పాక్ అడ్డుకునే వీలు లేకుండా సాంకేతికతను మెరుగుపర్చామన్నారు. పాక్ ఎఫ్ 16ను కూల్చేసిన అనంతరం భారత వింగ్ కమాండర్ వర్ధమాన్ అభినందన్‌కు భారత వాయుసేన నుంచి సందేశాలు నిలిచిపోవడం వల్లనే, ఆయన ప్రయాణిస్తున్న మిగ్ 21ను పాక్ దళాలు కూల్చివేయగలిగాయని అప్పట్లో వార్తలు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment