MI-17 Military Transport Helicopter
-
హెలికాప్టర్‌ను కిందికి వదిలేశారు
రుద్రప్రయాగ(ఉత్తరాఖండ్): దాదాపు మూడు నెలలుగా మరమ్మతుల కోసం ఎదురు చూస్తున్న ఓ హెలికాప్టర్‌ను తరలించేందుకు చేపట్టిన ప్రయత్నం విఫలమైంది. బ్యాలెన్స్ తప్పడంతో ప్రమాదాన్ని శంకించిన వైమానిక దళ(ఐఏఎఫ్) ఎంఐ–17 చాపర్ పైలట్ ఆ హెలికాప్టర్‌ను కొద్దిదూరం వెళ్లాక కిందికి వదిలేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. క్రిస్టల్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు చెందిన హెలికాప్టర్ మే 24వ తేదీన కేదార్‌నాథ్‌కు తీర్థయాత్రికులతో వచ్చింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆ హెలికాప్టర్ గిరికీలు కొడుతూ హెలిప్యాడ్‌కు సమీపంలో ల్యాండయ్యింది. అదృష్టవశాత్తూ అందులోని యాత్రికులు, పైలట్ సహా ఏడుగురు సురక్షితంగా బయటపడ్డారు. అప్పటి నుంచి ఆ హెలికాప్టర్ అక్కడే ఉండిపోయింది. దానిని మరమ్మతుల కోసం గౌచార్‌కు తరలించాలని అధికారులు భావించారు. వైమానిక దళానికి చెందిన ఎంఐ –17 రకం చాపర్ శనివారం ఉదయం దానిని తీసుకుని బయలుదేరింది. గాల్లోకి లేచి ముందుకు సాగిన కొద్దిసేపటికే బ్యాలెన్స్ తప్పింది. హెలికాప్టర్ బరువెక్కువగా ఉండటంతోపాటు, కొండప్రాంతం కావడంతో పైలట్ ప్రమాదాన్ని శంకించారు. అధికారుల సూచనలతో థారు క్యాంప్‌కు సమీపంలోని కొండ ప్రాంతంలో జన సంచారం లేని చోట హెలికాప్టర్‌ను వదిలేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఆ హెలికాప్టర్లో ఎటువంటి కూడా సామగ్రి లేదన్నారు. ఘటనాస్థలికి నిపుణుల బృందం చేరుకుని, పరిశీలన చేపట్టినట్లు చెప్పారు. హెలికాప్టర్ కూలిందంటూ వస్తున్న వార్తలను నమ్మొద్దని ప్రజలను కోరారు. -
ఐఏఎఫ్ అధికారులకు కోర్ట్ మార్షల్
న్యూఢిల్లీ: సొంత క్షిపణి దాడి కారణంగా భారత వైమానిక దళ చాపర్ కూలిపోయిన ఘటనలో ఇద్దరు ఎయిర్‌ఫోర్స్ అధికారులు కోర్టు మార్షల్ ఎదుర్కోనున్నారు. పీఓకేలోని బాలకోట్ ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపిన తరువాత, ఫిబ్రవరి 27న పొరపాటున చేసిన క్షిపణి దాడిలో ఐఏఎఫ్ ఎంఐ 17 చాపర్ ఒకటి కశ్మీర్‌లోని బుద్గాంలో కూలిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో ఆరుగురు సిబ్బంది, ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై అంతర్గత విచారణ జరిపి, ఐఏఎఫ్ అధికారుల మధ్య సమాచార లోపం కారణంగానే ఈ దుర్ఘటన జరిగినట్లు తేల్చారు. ఈ ఘటనకు సంబంధించి ఒక గ్రూప్ కెప్టెన్, మరో వింగ్ కమాండర్ కోర్టు మార్షల్‌ను ఎదుర్కొంటారని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఇద్దరు ఎయిర్ కమాండర్లు, ఇద్దరు ఫ్లైట్ లెఫ్ట్నెంట్లపైనా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని వెల్లడించాయి. -
సొంత హెలికాప్టర్‌ను కూల్చడం పెద్ద తప్పు
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఫిబ్రవరి చివరలో.. తమ సొంత హెలికాప్టర్‌ను కశ్మీర్లో తామే కూల్చివేయడం అతిపెద్ద తప్పిదమని వైమానిక దళ(ఐఏఎఫ్) ప్రధానాధికారి రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా అంగీకరించారు. పాక్ వైపు నుంచి జరిగే ఏ దాడులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తక్కువ సమయంలోనే స్పందించి, సైన్యం, నౌకాదళంతో సమన్వయం చేసుకుని దాడులు చేయగలమన్నారు. ఫిబ్రవరి 27న పొరపాటున బుద్గాం జిల్లాలో ఐఏఎఫ్‌కు చెందిన ఎంఐ 17 చాపర్‌ను వైమానిక దళం భూమి మీది నుంచి ఆకాశంపై ప్రయోగించగల క్షిపణి ద్వారా కూల్చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు ఐఏఎఫ్ అధికారులు, ఒక పౌరుడు మరణించారు. ఈ ఘటనపై జరిపిన అంతర్గత విచారణ ముగిసిందని, బాధ్యులుగా తేలిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని భదౌరియా శుక్రవారం తన తొలి ప్రెస్మీట్లో వెల్లడించారు. ఇద్దరు సీనియర్ అధికారులపై కోర్టు మార్షల్ ప్రక్రియ ప్రారంభించామన్నారు.అంతకుముందు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని బాలాకోట్‌లో ఉన్న ఉగ్ర స్థావరాలపై ఐఏఎఫ్ చేసిన దాడులకు సంబంధించిన వీడియో క్లిప్‌లను ప్రదర్శించారు. చాపర్‌లోని సిబ్బంది, కంట్రోల్ సెంటర్లోని అధికారుల మధ్య సమాచార లోపం విచారణలో స్పష్టంగా కనిపించిందని భదౌరియా తెలిపారు. కూల్చివేతకు గురైన సమయంలో చాపర్‌లోని ‘ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫ్రెండ్ ఆర్ ఫో’(ఐఎఫ్ఎఫ్– మిత్రుడా, శత్రువా గుర్తించడం) సిస్టమ్ నిలిపేసి ఉందని వాయుసేన వర్గాలు వెల్లడించాయి. దాంతో శత్రు చాపర్‌గా భావించి దానిని క్షిపణి ద్వారా కూల్చివేశారన్నారు. ఫిబ్రవరి 27న కశ్మీర్‌లోని నౌషేరాలో భారత్, పాక్‌ల మధ్య యుద్ధ విమానాలు భీకర పోరు సలుపుతున్న సమయంలో భారత్‌కు చెందిన ఎంఐ 17 కూల్చివేతకు గురైన విషయం తెలిసిందే. డ్రోన్లతో ముప్పు సరిహద్దుల్లో డ్రోన్ల ద్వారా ఆయుధాలను జారవిడవడం కొత్త ముప్పుగా మారిందని భదౌరియా పేర్కొన్నారు. పాక్‌లోని ఉగ్ర సంస్థలే దీనికి పాల్పడుతున్నాయన్నారు. టిబెట్ ప్రాంతంలో చైనా భారీగా మిలటరీ కేంద్రాలను ఏర్పాటు చేస్తుండటాన్ని నిశితంగా గమనిస్తున్నామన్నారు.అయితే, దానిపై అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పాక్ ఒప్పుకోకపోయినా, ఫిబ్రవరి 27న పాక్‌కు చెందిన ఎఫ్ 16ను భారత్ కూల్చివేయడం వాస్తవమేనని స్పష్టం చేశారు. మరో బాలాకోట్ తరహా దాడులకు సిద్ధమేనా అన్న ప్రశ్నకు.. ప్రభుత్వ ఆదేశాలపై, లక్ష్యాలేవైనా, వాటి పని పడ్తామని సంసిద్ధత వ్యక్తం చేశారు. భారత వైమానిక దళ సమాచార వ్యవస్థను భవిష్యత్తులో పాక్ అడ్డుకునే వీలు లేకుండా సాంకేతికతను మెరుగుపర్చామన్నారు. పాక్ ఎఫ్ 16ను కూల్చేసిన అనంతరం భారత వింగ్ కమాండర్ వర్ధమాన్ అభినందన్‌కు భారత వాయుసేన నుంచి సందేశాలు నిలిచిపోవడం వల్లనే, ఆయన ప్రయాణిస్తున్న మిగ్ 21ను పాక్ దళాలు కూల్చివేయగలిగాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. -
ఏడాది చివరికి ‘ఎంఐ–17’ ఒప్పందం పూర్తి
జుకోవ్స్కీ(రష్యా): ఎంఐ–17 మిలటరీ రవాణా హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందానికి సంబంధించి భారత్‌తో చర్చలు జరుపుతున్నట్లు రష్యా ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఏడాది చివరినాటికల్లా 48 ఎంఐ–17 చాపర్ల కొనుగోలు ఒప్పందం పూర్తవుతుందని తెలిపారు. ఎంఐ–8, ఎంఐ–17 మోడల్స్‌కు చెందిన 300కు పైగా మిలటరీ హెలికాప్టర్లు భారత్ వద్ద ఉన్నాయని, మరో 48 ఎంఐ–17 హెలికాప్టర్ల కోసం రష్యాతో భారత్ చర్చలు జరుపుతోందని రోసోబోరాన్ ఎక్స్‌పోర్ట్స్ సీఈవో అలెగ్జాండర్ మైఖీవ్ తెలిపారు. 2008లో 80 ఎంఐ–17 చాపర్లను భారత్‌కు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్న రోసోబోరాన్ ఎక్స్‌పోర్ట్స్.. 2011–13లో వాటిని అందజేసింది. 2012–13లో మరో 71 చాపర్ల కోసం భారత్ మూడు అదనపు ఒప్పందాలు కుదుర్చుకుంది.