మరమ్మతుల కోసం ఐఏఎఫ్ చాపర్‌తో తరలిస్తుండగా ఘటన
ప్రాణనష్టం సంభవించలేదన్న అధికారులు
రుద్రప్రయాగ(ఉత్తరాఖండ్): దాదాపు మూడు నెలలుగా మరమ్మతుల కోసం ఎదురు చూస్తున్న ఓ హెలికాప్టర్‌ను తరలించేందుకు చేపట్టిన ప్రయత్నం విఫలమైంది. బ్యాలెన్స్ తప్పడంతో ప్రమాదాన్ని శంకించిన వైమానిక దళ(ఐఏఎఫ్) ఎంఐ–17 చాపర్ పైలట్ ఆ హెలికాప్టర్‌ను కొద్దిదూరం వెళ్లాక కిందికి వదిలేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. క్రిస్టల్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు చెందిన హెలికాప్టర్ మే 24వ తేదీన కేదార్‌నాథ్‌కు తీర్థయాత్రికులతో వచ్చింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆ హెలికాప్టర్ గిరికీలు కొడుతూ హెలిప్యాడ్‌కు సమీపంలో ల్యాండయ్యింది. అదృష్టవశాత్తూ అందులోని యాత్రికులు, పైలట్ సహా ఏడుగురు సురక్షితంగా బయటపడ్డారు. అప్పటి నుంచి ఆ హెలికాప్టర్ అక్కడే ఉండిపోయింది. దానిని మరమ్మతుల కోసం గౌచార్‌కు తరలించాలని అధికారులు భావించారు.
వైమానిక దళానికి చెందిన ఎంఐ –17 రకం చాపర్ శనివారం ఉదయం దానిని తీసుకుని బయలుదేరింది. గాల్లోకి లేచి ముందుకు సాగిన కొద్దిసేపటికే బ్యాలెన్స్ తప్పింది. హెలికాప్టర్ బరువెక్కువగా ఉండటంతోపాటు, కొండప్రాంతం కావడంతో పైలట్ ప్రమాదాన్ని శంకించారు. అధికారుల సూచనలతో థారు క్యాంప్‌కు సమీపంలోని కొండ ప్రాంతంలో జన సంచారం లేని చోట హెలికాప్టర్‌ను వదిలేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఆ హెలికాప్టర్‌లో ఎటువంటి కూడా సామగ్రి లేదన్నారు. ఘటనాస్థలికి నిపుణుల బృందం చేరుకుని, పరిశీలన చేపట్టినట్లు చెప్పారు. హెలికాప్టర్ కూలిందంటూ వస్తున్న వార్తలను నమ్మొద్దని ప్రజలను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment