Repair works
-
హెలికాప్టర్‌ను కిందికి వదిలేశారు
రుద్రప్రయాగ(ఉత్తరాఖండ్): దాదాపు మూడు నెలలుగా మరమ్మతుల కోసం ఎదురు చూస్తున్న ఓ హెలికాప్టర్‌ను తరలించేందుకు చేపట్టిన ప్రయత్నం విఫలమైంది. బ్యాలెన్స్ తప్పడంతో ప్రమాదాన్ని శంకించిన వైమానిక దళ(ఐఏఎఫ్) ఎంఐ–17 చాపర్ పైలట్ ఆ హెలికాప్టర్‌ను కొద్దిదూరం వెళ్లాక కిందికి వదిలేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. క్రిస్టల్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు చెందిన హెలికాప్టర్ మే 24వ తేదీన కేదార్‌నాథ్‌కు తీర్థయాత్రికులతో వచ్చింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆ హెలికాప్టర్ గిరికీలు కొడుతూ హెలిప్యాడ్‌కు సమీపంలో ల్యాండయ్యింది. అదృష్టవశాత్తూ అందులోని యాత్రికులు, పైలట్ సహా ఏడుగురు సురక్షితంగా బయటపడ్డారు. అప్పటి నుంచి ఆ హెలికాప్టర్ అక్కడే ఉండిపోయింది. దానిని మరమ్మతుల కోసం గౌచార్‌కు తరలించాలని అధికారులు భావించారు. వైమానిక దళానికి చెందిన ఎంఐ –17 రకం చాపర్ శనివారం ఉదయం దానిని తీసుకుని బయలుదేరింది. గాల్లోకి లేచి ముందుకు సాగిన కొద్దిసేపటికే బ్యాలెన్స్ తప్పింది. హెలికాప్టర్ బరువెక్కువగా ఉండటంతోపాటు, కొండప్రాంతం కావడంతో పైలట్ ప్రమాదాన్ని శంకించారు. అధికారుల సూచనలతో థారు క్యాంప్‌కు సమీపంలోని కొండ ప్రాంతంలో జన సంచారం లేని చోట హెలికాప్టర్‌ను వదిలేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఆ హెలికాప్టర్లో ఎటువంటి కూడా సామగ్రి లేదన్నారు. ఘటనాస్థలికి నిపుణుల బృందం చేరుకుని, పరిశీలన చేపట్టినట్లు చెప్పారు. హెలికాప్టర్ కూలిందంటూ వస్తున్న వార్తలను నమ్మొద్దని ప్రజలను కోరారు. -
నేడు రెండోరోజు తుంగభద్ర డ్యామ్ కు ఎక్స్ పర్ట్ టీమ్
-
Garisenda Tower: వాలుతున్న వెయ్యేళ్ల టవర్
ఇటలీ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది పీసా నగరంలోని ప్రపంచ ప్రఖ్యాత లీనింగ్ టవరే. నాలుగు డిగ్రీల కోణంలో ఒకవైపు వాలిపోయి అందరికీ ఆకట్టుకుంటూ కని్పస్తుందా కట్టడం. అయితే ఇటలీలోనే మరో లీనింగ్ టవర్ కూడా ఉంది. అది కూడా కాస్త అటూ ఇటుగా పీసా టవర్ అంత ఎత్తు ఉంటుంది. అలాంటి టవర్ కాస్తా ఇప్పుడు ఏ క్షణమైనా కుప్పకూలేలా కని్పస్తూ గుబులు రేపుతోంది....! ఇటలీలోని బొలోగ్నా నగరంలో గారిసెండా టవర్ ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. పీసా టవర్ మాదిరిగానే ఇది కూడా నానాటికీ ఓ పక్కకు వాలిపోతుండటమే ఇందుకు కారణం. అలా ఈ టవర్ ఇప్పటిదాకా 4 డిగ్రీల కోణంలో పక్కకు ఒరిగింది. దీనికి తోడు దాని పునాదులు కొంతకాలంగా బాగా బలహీనపడుతూ వస్తున్నట్టు అధికారులు తేల్చారు. దాంతో నగర కౌన్సిల్ హుటాహుటిన సమావేశమై దీని గురించి కూలంకషంగా చర్చించింది. టవర్ ఏ క్షణమైనా కుప్పకూలే ప్రమాదముందని ధ్రువీకరించింది. అదే జరిగితే శిథిలాల ధాటికి పరిసర చుట్టుపక్కల అతి సమీపంలో ఉన్న పలు నివాస, వాణిజ్య సముదాయాలు తీవ్రంగా దెబ్బ తినే ప్రమాదముంది. దీన్ని నివారించేందుకు ముందు జాగ్రత్త చర్యగా టవర్ చుట్టూ యుద్ధ ప్రాతిపదికన 5 మీటర్ల ఎత్తున బారియర్ నిర్మిస్తున్నారు. 2024 ఏప్రిల్ లోపు దాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాంతోపాటు టవర్ చుట్టూ మెటల్ రాక్ ఫాల్ వలలను ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా అది కూలినా పరిసర నిర్మాణాలకు ఎలాంటి నష్టమూ లేకుండా చూసేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ నుంచి టవర్, దాని గ్రౌండ్ ఫ్లోర్‌లోని ప్లాజాలోకి సందర్శకులకు అనుమతి నిరాకరించారు. సందర్శనపై నిషేధం మరికొన్నేళ్ల దాకా (టవర్ కూలని పక్షంలో) కొనసాగుతుందని ఇప్పటికే ప్రకటించారు. బారియర్ నిర్మాణ వ్యయం 37 లక్షల పౌండ్లు(దాదాపు రూ.39.10 కోట్లు)గా అంచనా వేశారు. దీనికోసం ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తుండటం విశేషం! ‘‘నగరవాసులతో పాటు బొలోగ్నా నగరాన్ని, దాని ప్రఖ్యాత పర్యాటక చిహా్నలను కాపాడాలని తపిస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రియులందరూ ఈ బృహత్తర యజ్ఞంలో భాగస్వాములు కావాలి’’ అంటూ నగర కౌన్సిల్ పిలుపునిచి్చంది. నిలబెట్టేందుకు తీవ్ర యత్నాలు గారిసెండా టవర్ కూలిపోకుండా కాపాడేందుకు ఇటలీ శాయశక్తులా ప్రయతి్నస్తోంది. పీసా టవర్ కూడా క్రమంగా మరింత పక్కకు వాలి త్వరలో కూలిపోవడం ఖాయమని కొన్నేళ్ల క్రితం వార్తలొచ్చాయి. కానీ ప్రభుత్వం ఏళ్ల తరబడి నానా ప్రయత్నాలూ చేసి దాని ఒంపును కొంతమేర సరిచేసింది. ప్రస్తుతానికి అది కుప్పకూలే ముప్పు లేదని తేలి్చంది. అలా పీసా టవర్‌ను కాస్త సురక్షితంగా మార్చిన అనుభవాన్నంతా గారిసెండా విషయంలో రంగరిస్తున్నారు. ఇందుకోసం సివిల్ ప్రొటెక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. తొలి దశలో దీన్ని వీలైనంత సురక్షితంగా తీర్చిదిద్దే పనిలో పడ్డారు. సంబంధిత పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. రెట్టింపు ఎత్తైన జంట టవర్ గారిసెండా నిజానికి బొలోగ్నా నగరానికి ప్రధాన ఆకర్షణగా నిలిచిన జంట టవర్లలో ఒకటి మాత్రమే! పైగా చిన్నది. ఎందుకంటే, దీని పక్కనే ఉన్న అసినెల్లీ టవర్ దీనికంటే దాదాపు రెట్టింపు పొడవైంది! అంటే దాదాపు 90 మీటర్లన్నమాట. ప్రఖ్యాత పీసా టవర్ ఎత్తు 56 మీటర్లే. అంటే, ఇది పీసాను తలదన్నేంత ఎత్తుందన్నమాట! అసినెల్లీ టవర్ నిర్మాణం గారిసెండా తర్వాత పదేళ్లకే, అంటే 1,119లో జరిగింది. ఇది కూడా కాస్త పక్కకు ఒరిగే ఉండటం విశేషం. అయితే ఆ ఒంపు మరీ పీసా, గారిసెండా అంతగా లేదు గనుక ప్రస్తుతానికి దీనికి వచి్చన ముప్పేమీ లేనట్టే! దాదాపు వెయ్యేళ్ల నాటిది! ► గారిసెండా టవర్ ఇప్పటిది కాదు. మధ్య యుగానికి చెందినది. ►దీన్ని దాదాపు వెయ్యేళ్ల క్రితం, అంటే క్రీస్తుశకం 1,109 సంవత్సరంలో నిర్మించారు. ►టవర్ ప్రస్తుత ఎత్తు 47 మీటర్లు (154 అడుగులు). ►నిర్మించినప్పుడు ఇది చాలా ఎత్తుండేది. ►200 ఏళ్లకే టవర్ ఒక పక్కకు ఒరగడం మొదలైంది. ►దాంతో 14వ శతాబ్దంలో దాని ఎత్తును బాగా తగ్గించారు. ►డాంటే 1321 సంవత్సరంలో ముగించిన అజరామర పద్య కావ్యం ‘ది డివైన్ కామెడీ’లో కూడా గారిసెండా టవర్ ప్రస్తావన ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మేడిగడ్డ ఏడో బ్లాక్ పరిధిలో పనులు
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ ఏడో బ్లాక్ 20వ పియర్ భారీ శబ్దంతో కుంగిపోయింది. బ్యారేజ్ దెబ్బతినడంతో సరిహద్దులో తెలంగాణ, మహారాష్ట్రల మధ్య అక్టోబరు 21వ తేదీ నుంచి రాకపోకలను నిలిపేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక తెలంగాణ ఎన్నికల వేళ రాజకీయపరమైన విమర్శలకు తావిచ్చింది. ఒకవైపు బ్యారేజ్ వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. మరోవైపు డ్యామేజ్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. పిలర్లు కుంగిపోయిన ఏడో బ్లాక్ పరిధిలో పనులు కొనసాగుతున్నట్లు సమాచారం. నీటిని మళ్లించినా ఎగువ ప్రాంతం నుంచి ప్రవాహం కొనసాగుతోంది. ప్రాణహిత నుంచి బ్యారేజ్‌కు నీరు చేరుతోంది. మేడిగడ్డ బ్యారేజ్ పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలు. ఎగువ నుంచి 26,350 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా 61 గేట్లు ఎత్తి 22,590 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు నదిలో కాఫర్ డ్యాం పనులు సాగుతున్నట్లు తెలుస్తోంది. అన్నారం బుంగల కోసం గ్రౌటింగ్ అన్నారం (సరస్వతి) బ్యారేజీ బుంగలు ఏర్పడిన విషషయమూ తెలిసిందే. ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో ఇసుక, రాళ్లతో కూడిన సంచులు వేసినా పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదని సమాచారం. దీంతో రెండు పియర్ల వద్ద సీపేజీ (బుంగలు) ఏర్పడగా వాటి మరమ్మతులకు ఢిల్లీ నుంచి నిపుణుల బృందం రానున్నట్లు సమాచారం. 2020లో ఇలాంటి పరిస్థితి ఎదురుకాగా పాలియూరిథిన్ (పీయు) గ్రౌటింగ్ ద్వారా బుంగలను పూడ్చారు. ఈ సారి కూడా ఇదే పద్ధతిని అవలంబించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: మేడిగడ్డ పంచాయతీ.. బారికేడ్లతో బ్యారేజ్ మూసివేత -
రిపేరు హక్కు ఉద్యమంలో భాగంగా ఏసీఎంఏ..
న్యూఢిల్లీ: వాహనాలను వినియోగదారులు ఎవరిదగ్గరైనా మరమ్మతు చేయించుకునే హక్కును సాధించుకునేందుకు అంతర్జాతీయంగా సాగుతున్న ఉద్యమానికి తాము కూడా మద్దతునిస్తున్నట్లు దేశీ ఆటో విడిభాగాల తయారీ సంస్థల సమాఖ్య ఏసీఎంఏ వెల్లడించింది. వివరాల్లోకి వెడితే.. వైర్లెస్ విధానంలో కనెక్టెడ్‌గా ఉంటున్న వాహనాల డేటా అంతా కూడా వాటి తయారీ సంస్థలకు చేరుతోంది. దీంతో వాటికి ఏమైనా రిపేర్లు వస్తే బైట వేరే వారి దగ్గర మరమ్మతు చేయించుకోనివ్వకుండా కంపెనీలు నిరోధించేందుకు ఆస్కారం ఏర్పడుతోంది. ఫలితంగా వినియోగదారులు తాము కోరుకున్న చోట రిపేరు చేయించుకునే హక్కులకు భంగం కలుగుతోంది. తప్పనిసరిగా కంపెనీనే ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే రిపేర్ హక్కుల ఉద్యమం తెరపైకి వచ్చింది. వారంటీ వ్యవధి ముగిసిపోయిన వాహనాలకు వచ్చే మరమ్మతుల్లో 70 శాతం భాగాన్ని స్వతంత్ర రిపేర్ షాపులే చేస్తున్నాయి. కొనుగోలు అనంతర సేవలకు సంబంధించిన ఆఫ్టర్‌మార్కెట్ విభాగం దేశీయంగా 10.1 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో వినియోగదారులు కోరుకుంటున్న రిపేర్ హక్కులకు మద్దతునిస్తున్న ఇతర అంతర్జాతీయ సంస్థలతో పాటు తామూ సంఘీభావం ప్రకటిస్తున్నట్లు ఏసీఎంఏ తెలిపింది. రైట్ టు రిపేర్ కింద దేశీయంగానూ చట్టం తీసుకొస్తే భారత్‌లో ఆఫ్టర్‌మార్కెట్ విభాగం మరింతగా విస్తరించగలదని పేర్కొంది. అంతర్జాతీయంగా అమెరికాలో ఈ ఉద్యమం మొదలైంది. -
చౌమహల్లా ప్యాలెస్.. చూద్దాం పదండి
సాక్షి, హైదరాబాద్: యూరోపియన్ శైలిలో నిర్మించిన శ్వేతసౌధం. అసఫ్ జాహీల పాలనకు నిలువుటద్దం పాతబస్తీలోని చౌమహల్లా ప్యాలెస్. రెండో నిజాం కాలంలో చార్మినార్– లాడ్‌బజార్‌కు అతి సమీపంలో నిర్మించిన చారిత్రక ప్యాలెస్ ఇది. 2020 జూన్ 27న ఖిల్వత్ క్రీడా మైదానం వైపు ఉన్న చౌమహల్లా ప్యాలెస్ ప్రహరీ పైభాగంలోని కిటికీ దిమ్మె కూలి కింద పడింది. సుమారు రెండేళ్ల పాటు కొనసాగిన మరమ్మతు పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. (క్లిక్: చౌమహల్లా ప్యాలెస్ గురించి ఈ ఆసక్తికర విషయాలు) ప్రస్తుతం ఈ ప్యాలెస్ అందంగా ముస్తాబై పర్యాటకులను ఆకట్టుకుంటోంది. టెహ్రాన్‌లోని షా ప్యాలెస్ ఆర్కిటెక్చర్‌ను పోలి ఉంది. 1912లో ఏడో నిజాం ప్యాలెస్‌కు చేయించిన మరమ్మతులతో మరింత శోభాయమానంగా మారింది. దాదాపు 2.90 లక్షల గజాల విస్తీర్ణంలో విశాలమైన ప్రాంగణంలో నిర్మితమైన ఈ ప్యాలెస్ ఒకప్పుడు నిజాంల నివాస గృహం. ప్రస్తుతం విద్యుద్దీపాలతో షాండిలియర్లు దేదీప్యమానంగా వెలుగుతూ చౌమహల్లా ప్యాలెస్‌కు మరింత శోభ తెస్తున్నాయి. (క్లిక్: సముద్రం పాలైన ‘హైదరాబాద్’ కరెన్సీ) -
ఉస్మానియాలో మరమ్మతులు
సాక్షి, హైదరాబాద్ : ఉస్మానియా ఆస్పత్రి రోగులను మురుగు ముప్పు ఇంకా వెంటాడుతూనే ఉంది. ఆస్పత్రిలోని డ్రైనేజీ వ్యవస్థ శిథిలమవడంతో వర్షపునీరు వెళ్లే మార్గంలేక అంతర్గత రోడ్లపైనే పొంగిపొర్లుతోంది. సెక్యూరిటీ ఆఫీసు సమీపం నుంచి పాతభవనంలోకి నీరు చేరుతోంది. దీంతో డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం గురువారం ఆస్పత్రికి చేరుకుని తాత్కాలిక మరమ్మతులు నిర్వహించింది. వార్డులోకి చేరిన నీటిని పాతభవనం డోమ్ గేట్ ద్వారా బయటికి ఎత్తిపోసింది. తడిసిన పడకలు, పీపీఈ కిట్బాక్స్లను ఆరబెట్టింది. అయితే, డ్రైనేజీ లైన్లను ఇంకా పునరుద్ధరించలేదు. దీంతో మళ్లీ వర్షం వస్తే వార్డుల్లోకి వరదనీరు చేరే ప్రమాదముందని పాతభవనంలోని రోగులు, వైద్యసిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాతభవనం గ్రౌండ్ ఫ్లోర్లో చికిత్స పొందుతున్నవారందరినీ గురువారం ఫస్ట్‌ఫ్లోర్‌కు తరలించారు. కానీ, ఆయావార్డులను శుభ్రం చేయకపోవడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. ఇదే ప్రాంగణంలో ఉన్న మరో భవనం(కులీకుతుబ్ షా) ఐదో అంతస్తులోకి కూడా వర్షపునీరు లీక్ అవుతోంది. దీంతో ఆ వార్డులో ఉన్న డయాలసిస్ యంత్రాలపై నీరుపడి పాడైపోయాయి. ఈ భవనంపై అదనపు అంతస్థు నిర్మిస్తుండటం, నిర్మాణ సమయంలో స్లాబు, గోడలకు పగుళ్లు ఏర్పడటంవల్ల వర్షపునీరు కిందికి ఇంకుతున్నట్లు అక్కడి డాక్టర్లు చెబుతున్నారు. -
సరికొత్తగా పీవీ ఎక్స్‌ప్రెస్ వే
సాక్షి, సిటీబ్యూరో: శంషాబాద్ విమానాశ్రయాన్ని తక్కువ సమయంలో చేరుకునేందుకు వీలుగా నగరంలో నిర్మించిన ‘పీవీ నర్సింహారావు(పీవీఎన్ఆర్) ఎక్స్‌ప్రెస్ వే’ సరికొత్త రూపును సంతరించుకుంటోంది. వాహనదారుల ప్రయాణానికి ఇబ్బందులు లేకుండా పాత బీటీ రోడ్డును తొలగించి కోల్డ్ మిల్లీమిషన్ ద్వారా చేపట్టిన కొత్త రోడ్డు పనులను శరవేగంగా చేస్తున్న హెచ్ఎండీఏ ఇంజినీరింగ్ అధికారులు.. ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్లకు వెదర్ ప్రూఫ్ ఎమల్షన్ పెయింటింగ్‌తో సరికొత్త లుక్ తెస్తున్నారు. వీటితో పాటు ఎక్స్‌ప్రెస్ వే శ్లాబుల వద్ద సోడియం పేపర్ లైట్ల స్థానంలో విద్యుత్ వినియోగం తగ్గించే ఎల్ఈడీ బల్బులను అమర్చే ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారు. సుమారు రూ.24.50 కోట్లతో ఈ ఎక్స్‌ప్రెస్ వే సరికొత్త హంగులతో వాహనదారులకు ఆహ్లాదరకమైన జర్నీ అనుభూతినిచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విమానశ్రయానికి సాఫీ జర్నీ దేశంలోని ఇతర రాష్ట్రాలు, విదేశాలకు వెళ్లే ప్రయాణికులు పీవీ ఎక్స్‌ప్రెస్ వే మీదుగానే శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అయితే, ఈ మార్గం నిర్మించాక ఎనిమిదేళ్ల క్రితం చిన్నచిన్న మరమ్మతులు చేశారు. ప్రస్తుతం రోడ్డు మార్గం ప్రమాదకరంగా ఉండడంతో పాటు వాహనదారుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న హెచ్ఎండీఏ అధికారులు పాత బీటీ రోడ్డును తొలగించి మరమ్మతులు చేస్తున్నారు. రూ.12.50 కోట్లతో మే 22 నుంచి సాగుతున్న ఈ మరమ్మతులు తుది దశకు చేరుకున్నాయి. ఈ పనులతో శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే వాహనాలకు మాత్రమే అనుమతించిన అధికారులు తిరుగు ప్రయాణంలో వచ్చే వాహనాలను ఎక్స్‌ప్రెస్‌వే కింద రహదారి మీదుగా మళ్లిస్తున్నారు. పిల్లర్లకు కొత్తరూపు మెహదీపట్నంలోని సరోజినిదేవి కంటి ఆస్పత్రి నుంచి మొదలై ఆరాంఘర్ ఎక్స్ రోడ్డు వద్ద ముగిసే ఈ ఎక్స్‌ప్రేస్ వే మార్గంలో 325 పిల్లర్లు ఉన్నాయి. అయితే, కొన్ని ప్రముఖ జంక్షన్ల వద్ద పిల్లర్లకు వర్టికల్ గార్డెనింగ్(పచ్చని రూపు)ను హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ అధికారులు చేశారు. ఆ పిల్లర్లకు రెండు నెలల నుంచి వెదర్‌ప్రూఫ్ ఎమల్షన్ పెయింటింగ్‌తో సరికొత్త లుక్ తీసుకొస్తున్నారు. రూ.9.50 కోట్లతో పిల్లర్ల రూపురేఖలు మారుస్తున్నారు. అదే సమయంలో ఎంతో మదికి చిరునామాలకు ఐకాన్‌గా ఉన్న పిల్లర్ల నంబర్లను సైతం పెయింటింగ్‌తో వేస్తున్నారు. ఎల్ఈడీ బల్బులతో వెలుగు ఓవైపు రోడ్డు మరమ్మతు పనులు, మరోవైపు పిల్లర్ల పెయింటింగ్‌తో సరికొత్త రూపు సంతరించకుంటున్న పీవీ ఎక్స్‌ప్రెస్ వేలో ఎల్ఈడీ బల్బులు బిగించే పనులపై హెచ్ఎండీఏ ఇంజినీరింగ్ విభాగ అధికారులు దృష్టి సారించారు. రూ.2.5 కోట్లతో 1350 ఎల్ఈడీ బల్బులు అమర్చే పనులను టెండర్ ద్వారా కాంట్రాక్టర్‌కు అప్పగించనున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ పనులు పూర్తిచేసే ఆలోచనలో అధికారులు ఉన్నారు. -
చార్మినార్.. నో హాకర్స్ జోన్
సాక్షి,సిటీబ్యూరో: చారిత్రక ప్రాధాన్యం గల చార్మినార్‌కు భద్రతతో పాటు ఇక్కడికి వచ్చే సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ కట్టడం పరిసరాలు చిరు వ్యాపారులతో నిండిపోయి టూరిస్టులకు ఇబ్బందికరంగా మారాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని చార్మినార్ చుట్టూ ఎలాంటి వ్యాపారాలు జరగకుండా చర్యలు చేపట్టారు. అందులో భాగంగా చారిత్రక కట్టడానికి నాలుగు వైపులా 50 అడుగుల వరకు ‘నో హాకర్ జోన్’ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ప్రందేశంలోకి చిరు వ్యాపారులు ప్రవేశించకుండా బొల్లార్డ్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా గురువారం మార్కింగ్ పనులు ప్రారంభించారు. ఈ పరిధి వరకు సందర్శకులు తప్ప ఇంకెవరూ లోపలకు రాకుండా ఉండేందుకు, చార్మినార్ అందాల్ని వీక్షించేవారికి ఆటంకం కలుగకుండా దాదాపు రెండు అడుగుల ఎత్తు బొల్లార్డ్స్‌ను బిగించనున్నారు. తద్వారా దీన్ని నో హాకర్స్ జోన్‌గా మార్చనున్నారు. చార్మినార్ కట్టడం నుంచి నాలుగు వైపులా గుల్జార్‌హౌస్, మక్కా మసీదు, సర్దార్ మహల్, లాడ్‌బజార్ వైపు ఈ జోన్ ఉంటుంది. ప్రస్తుతం చార్మినార్ వరకు కూడా చిరు వ్యాపారులు తమ వ్యాపారాలురెయిలింగ్స్పై కూడా సామగ్రిని ఉంచుతుండటంతో పర్యాటక ప్రాంతం వద్ద తీవ్ర రద్దీ ఏర్పడుతోంది. పర్యాటకులకు.. ముఖ్యంగా విదేశీ పర్యాటకులకు ఈ తొక్కిసలాట సంకటంగా మారుతోంది. దీన్ని నిరోధిస్తూ, చార్మినార్ అందాలను ప్రశాంతంగా వీక్షించేలా 50 అడుగుల మేర హాకర్లెవరూ లేకుండా ఈ బొల్లార్డ్స్ ఏర్పాటు చేయనున్నారు. అందుకుగాను అవసరమైన మార్కింగ్ తోపాటు ఒకవైపు తవ్వకం పనులు కూడా చేపట్టారు. ఈ 50 అడుగుల మేర వలయాకారం నుంచి 100 అడుగుల వరకు పర్యాటకులు కూర్చునేందుకు అవసరమైన బెంచీలు.. ఫొటోలు తీసుకునేందుకు ఏర్పాట్లు, అందమైన పూలకుండీలు వంటివి ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఇందుకు దాదాపు రూ.80 లక్షలు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. వీటితోపాటు సుందరమైన ల్యాండ్‌స్కేప్ గార్డెన్ తదితర పనులు చేసే యోచనలో ఉన్నారు. అంతేకాదు.. భవిష్యత్‌లో అందుబాటులోకి రానున్న లైట్ అండ్ సౌండ్ షోను వీక్షించేవారి కోసం సీటింగ్ ఏర్పాట్లకు కూడా ఈ స్థలాన్ని వినియోగించుకోవాలని భావిస్తున్నారు. చార్మినార్ పాదచారుల పథకంలో భాగంగా వాహనాలు రాకుండా దాదాపు రూ.3.5 కోట్లతో హైడ్రాలిక్ బొల్లార్డ్‌లను ఏర్పాటు చేయనున్నారు. వీవీఐపీలు వచ్చినప్పుడు, ఇతర అవసర సందర్భాల్లో మాత్రం ఇవి భూమిలోకి వెళ్లి వాహనాలకు దారిస్తాయి. ఇందుకు అవసరమైన కంట్రోల్‌రూమ్‌ను సమీపంలోని భవనంలో ఏర్పాటు చేయనున్నారు. నో హాకర్స్ జోన్లో మాత్రం కదలికలకు తావులేకుండా శాశ్వత బొల్లార్డ్‌లను ఏర్పాటు చేస్తారు. స్వచ్ఛ ఐకానిక్ పనుల్లో.. ఇక స్వచ్ఛ ఐకానిక్ చార్మినార్ పనుల్లో భాగంగా చార్మినార్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేందుకు రూ.2 కోట్లతో నాలుగు ప్రత్యేక స్వీపింగ్ మెషిన్లు కొనుగోలు చేశారు. వీటిని త్వరలో వినియోగంలోకి తేనున్నట్లు చార్మినార్ ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి, జీహెచ్ఎంసీ డైరెక్టర్(ప్లానింగ్) కె.బి. శ్రీనివాసరావు తెలిపారు. అఫ్జల్‌గంజ్ నుంచి గుల్జార్‌హౌస్ వరకు బ్యాటరీ వాహనాలను ప్రవేశపెట్టే ఆలోచన కూడా ఉంది. పాదచారుల పథకంలో భాగంగా తవ్విన డక్ట్‌లలో కేబుళ్ల అమరిక పనులు పూర్తి చేయాల్సి ఉంది. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అడ్డదిడ్డంగా వేలాడుతున్న విద్యుత్ తీగలు, ఫ్లెక్సీలు వంటివి తొలగించి, ఆయా మార్గాలను సూచించే సైన్‌బోర్డులు కూడా ఏర్పాటు చేయనున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. -
ఎప్పుడు పూర్తయ్యేనో!
సాక్షి, సిటీబ్యూరో: చారిత్రక మక్కా మసీదు నిర్వహణ, మరమ్మతు పనులు నత్తకు నడక నేర్పుతున్నాయి. మసీదు దుస్థితిపై అప్పట్లో ‘సాక్షి’ దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితం కావడంతో అధికారులు స్పందించి మరమ్మతు పనులకు శ్రీకారం చుట్టారు. 2017 ఆగస్ట్ 23న రూ. 8.48 కోట్లు ని«ధులు కేటాయించి పనులు ప్రారంభించారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. కానీ గడువు ముంచుకువస్తున్నా పనుల్లో పురోగతి మాత్రం కనిపించడంలేదు. రూ.2 కోట్లు మాత్రమే విడుదల కావడంతో పనులు ముందుకు సాగడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పురావస్తు శాఖ పర్యవేక్షణలో.. మక్కా మసీదు మరమ్మతు పనులను వక్ఫ్ బోర్డు ద్వారా రాష్ట్ర పురావస్తు శాఖ పర్యవేక్షణలో చేయలని నిర్ణయించారు. మొదటి దశలో మసీదు పైకప్పు మరమ్మతులతో పాటు గోడల్లో నీరు రాకుండా పనులు చేపట్టారు. పురావస్తు శాఖ అనుభవజ్ఞులైన సిబ్బంది, అధికారుల పర్యవేక్షణలో పనులు ప్రారంభించారు. కాగా.. ఇప్పటికీ 70 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. ముంబైకి చెందిన ఓ కాంట్రాక్టర్ టెండర్ దక్కించుకుని నిర్మాణ పనులు చేస్తున్నారు. మసీదు పైకప్పు, నిజాం సమాధుల పనులు 80 శాతం వరకు పూర్తి కాగా మసీదు లోపలి డోమ్‌ల పనులు ఇటీవలే ప్రారంభమయ్యాయి. సౌండ్, లైట్ సిస్టమ్‌ల కోసం టెండర్లు కూడా ఇంకా ప్రకటించలేదు. చారిత్రక కట్టడం కావడంతో రాష్ట్ర పురావస్తు శాఖ సూచనల మేరకు పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. వచ్చే నెలలో మసీదు పనులు పూర్తి స్థాయిలో పూర్తి కావాల్సి ఉండగా పలు పనులు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. చారిత్రక కట్టడం కావడంతో పనుల్లో జాప్యం ఏర్పడుతోందని, నిధులు సకాలంలో అందకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు. పురావస్తు శాఖ ఇంజినీరింగ్ విభాగం అధికారులు ఎప్పటికప్పుడు బిల్లులు అందజేస్తే నిధులు వక్ఫ్ బోర్డు ద్వారా జారీ చేస్తామని మైనార్టీ శాఖ అధికారులు చెబుతున్నారు. శాఖల మధ్య కొరవడిన సమన్వయం.. మక్కా మసీదు మరమ్మతు పనులు పురావస్తు శాఖ పర్యవేక్షణలో జరుగుతున్నా.. నిధులు మాత్రం మైనార్టీ సంక్షేమ శాఖ వక్ఫ్ బోర్డు చెల్లిస్తోంది. అడపాదడపా మైనార్టీ సంక్షేమ శాఖ సలహాదారులు, కార్యదర్శి, వక్ఫ్ బోర్డు చైర్మన్ మసీదు పనులను పరిశీలించి వారం రోజుల్లో పనులు పూర్తి అవుతాయని, మరికొంత మంది నెల రోజుల్లో పూర్తి అవుతాయని ప్రకటనలు చేస్తున్నారు. కానీ ఇంత వరకు మైనార్టీ సలహాదారుడు తప్ప ఎవరికీ మసీదు నిర్మాణానికి సంబంధించిన పూర్తి సమాచారం లేకుండాపోయింది. దీంతో పనులు పూర్తి కావడానికి మరో ఏడాది పట్టే విధంగా ఉంది. రెండు శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతోనే పనులు నిర్లక్ష్యంగా సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. ఆరు నెలల్లో పూర్తి చేస్తాం.. మొదట్లో అనుకున్న సమయానికి మసీదుల పనులు పూర్తి చేయడానికి ప్రణాళికలు చేశాం. కానీ పలు మరమ్మతులు పనులు చాలా సున్నితంగా చేయాల్సి వస్తోంది. పైకప్పుతో పాటు సమాధుల, మదర్సా పనులు చివరి దశలో ఉన్నాయి. మా అంచనా ప్రకారం మరో ఆరు నెలల్లో పనులు పూర్తవుతాయని భావిస్తున్నాం. – విశాలాక్షి, రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్ -
రూ.42.79 కోట్లను మళ్లించేసిన మంత్రి
-
17న నీటి సరఫరా బంద్
సిటీబ్యూరో: కృష్ణా మూడోదశ పైప్‌లైన్‌కు మరమ్మతుల కారణంగా ఈనెల 17న పలు ప్రాంతాలకు నీటిసరఫరా నిలిపివేస్తున్నట్టు జలమండలి అధికారులు ప్రకటించారు. దీంతో మంగళవారం మౌలాలి, కైలాశ్గిగి, చాణక్యపురి, లాలాపేట్, బాలాపూర్, మైలార్‌దేవ్‌పల్లి, బుద్వేల్, రాజేంద్రనగర్, అత్తాపూర్, హైదర్‌గూడ, ఆళ్లబండ, ఆసిఫ్‌నగర్, భోజగుట్ట, షేక్‌పేట్, ప్రశాసన్‌నగర్, గచ్చిబౌలి ప్రాంతాలకు నీటిసరఫరా ఉండదని తెలిపారు. మరమ్మతులు పూర్తయిన వెంటనే సరఫరా పునరుద్ధరిస్తామన్నారు. -
‘తుంగభద్ర’ పనుల్లో నాణ్యత లేనట్లేనా?
బళ్లారి: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో తుంగభద్ర హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ కాలువల మరమ్మతులకు భారీగా లెస్‌కే టెండర్లు దాఖలు చేశారు. ప్రతి ఏటా మరమ్మతులు చేపడుతున్న సంగతి తెలిసిందే. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా తక్కువ మొత్తానికే టెండర్లు దాఖలు చేయడంతో పనుల్లో నాణ్యత ప్రశ్నార్థకమవుతోంది. హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ కాలువల గుండా నీరు సక్రమంగా వెళ్లేందుకు కాలువలు బాగా దెబ్బ తిన్న ప్రాంతాల్లో మరమ్మతులు చేసేందుకు నిధులు విడుదల చేశారు. ఇందులో ఎల్ఎల్సీ కాలువ కింద తుంగభద్ర డ్యాం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా సరిహద్దు వరకు కాలువ పొడవునా బాగా దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మతులకు దాదాపు రూ.9 కోట్ల నిధులు విడుదల చేశారు. హెచ్ఎల్సీ కాలువ కూడా దాదాపు రూ.6 కోట్లకు పైగా నిధులు విడుదల చేశారు. తుంగభద్ర డ్యాం నుంచి హెచ్ఎల్సీ కాలువ ద్వారా అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండల బార్డర్ వరకు మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. ఎల్ఎల్సీ కాలువ గుండా 131 పనులు, హెచ్ఎల్సీ కాలువ గుండా 70కి పైగా మరమ్మతులకు టెండర్లను అధికారులు పిలిచారు. అధికారులు టెండర్లు ఓపెన్ చేయగా ప్రతి పనికి 20 నుంచి 40 శాతం వరకు తక్కువకే టెండర్లు దాఖలు కావడం విశేషం. ఉదాహరణకు లక్ష రూపాయల పనికి ప్రభుత్వం టెండర్లు పిలిస్తే, కాంట్రాక్టర్ 40 శాతం తక్కువకే టెండర్లు దాఖలు చేసి పనులు దక్కించుకున్నారు. పోటాపోటీగా టెండర్లు దాఖలు చేసి పనులు దక్కించుకునేందుకు కాంట్రాక్టర్లపై పోటీ పడ్డారు. ఈ లెక్కన రూ.10 లక్షల పనులకు కూడా రూ.6 లక్షలకు టెండర్ వేసి పనులు దక్కించుకోవడంతో ఇక పనుల్లో నాణ్యత ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అసలే తుంగభద్ర కాలువల గుండా నీరు సక్రమంగా వెళ్లడం లేదని ప్రతి ఏటా రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం పిలిచిన మరమ్మతు టెండర్లు అన్నింటికీ దాదాపుగా తక్కువ మొత్తానికే పనులు దక్కించుకోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. తుంగభద్ర కాలువల మరమ్మతుల్లో అధికారులు, కాంట్రాక్టర్లు ఆడిందే ఆట పాడిందే పాటగా మారడంతో రైతులకు శాపంగా మారింది. ఎల్ఎల్సీ ఈఈ నారాయణ నాయక్ ‘సాక్షి’తో మాట్లాడుతూ ప్రొసీజర్ ప్రకారం టెండర్లు దాఖలు చేయడంతో తాము ఓపెన్ చేశామన్నారు. లెస్‌కు టెండర్లు దాఖలు చేసినా నాణ్యతపై రాజీ పడేది లేదన్నారు. -
నీటి లీకేజీపై బీఎంసీ దృష్టి
సాక్షి, ముంబై: నగర వాసులకు నీటి సరఫరా చేస్తున్న పైపుల లీకేజీ అరికట్టేందుకు మహానగర పాలక సంస్థ (బీఎంసీ) నడుం బిగించింది. ఈ పనులను మూడు దశల్లో పూర్తిచేయాలని బీఎంసీ పరిపాలన విభాగం నిర్ణయించింది. అందులో భాగంగా సుమారు రూ.40 కోట్ల వ్యయంతో మొదటి దశ పనులు పూర్తిచేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రతిరోజు ముంబైకి సరఫరా అవుతున్న 3,750 ఎమ్మెల్డీల నీటిలో రోజుకు కనీసం 20 శాతం నీరు చోరీకి గురవుతోంది. అలాగే దాదాపు 600 లీటర్లకు పైగా నీరు లీకేజీ వల్ల వృథా అవుతోంది. ప్రస్తుతం నీటి సరఫరా చేస్తున్న పైపులు పురాతనమైనవి కావడంతో అవి తుప్పుపట్టాయి. దీంతో పైపులు పలు చోట్ల పగిలిపోయి నీరు లీకేజీ అవుతోంది. వీటిని మార్చాలని బీఎంసీ భావిస్తోంది. ఇందులో భాగంగా మొదటి దశ బాంద్రా, ఖార్ రోడ్, శాంతాక్రూజ్ (తూర్పు, పశ్చిమ), తూర్పు విలేపార్లే, తూర్పు అంధేరి, తూర్పు జోగేశ్వరి, చార్కోప్, బోరివలి, కాందివలి, గోరాయి, దహిసర్, చెంబూర్, గోవండీ, మాన్‌ఖుర్ద్ తదితరా ప్రాంతాల్లో పైపులకు మరమ్మతు పనులు జరగనున్నాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదిత పనులు ఒకట్రెండు రోజుల్లో స్థాయి సమితీ ముందుకు తీసుకురానున్నారు. అనుమతి లభించగానే త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. -
ప్రాణం తీసిన విష వాయువు
విష వాయువు పీల్చుకొని ఇరువురు మృతి ప్రొద్దుటూరు క్రైం: పండుగ వేళ ప్రొద్దుటూరులో విషాదం చోటు చేసుకుంది. మెయిన్‌బజార్‌లోని తల్లం జ్యువెలర్స్‌లో విషవాయువు వ్యాపించడంతో ఊపిరి పీల్చుకోలేక షాపులో పని చేస్తున్న సేల్స్మెన్లు బలిమెడి రాజశేఖర్ (23), సగినాదం సుబ్బరాయుడ (36) మృతి చెందారు. మరో సేల్స్‌మెన్ గంజికుంట నారాయణస్వామి ప్రాణాలతో బయట పడ్డాడు. పోలీసుల కథనం మేరకు...స్థానిక మెయిన్‌బజార్‌లో తల్లం జ్యూవెలర్స్ షాపును తల్లం శేషయ్య సోదరులు నిర్వహిస్తున్నారు. వారి సొంత దుకాణంలో మరమ్మతు పనులు చేయిస్తుండటంతో ఎదురుగా ఉన్న ఇంటిని బాడుగకు తీసుకుని దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ షాపులో ఈశ్వరరెడ్డినగర్కు చెందిన బలిమిడి రాజశేఖర్, సగినాదం సుబ్బరాయుడు, గంజి కుంట నారాయణ స్వామి సేల్స్మెన్లుగా పని చేస్తున్నారు. అద్దె ఇళ్లు కావడంతో భద్రత సరిగా ఉండదని భావించిన నిర్వాహకులు ముగ్గురు సేల్స్మెన్లను రాత్రి సమయాల్లో షాపులోనే పడుకోవాలని చె ప్పారు. దీంతో గత నెల రోజుల నుంచి ముగ్గురు రాత్రి వేళల్లో షాపులోని నిద్రిస్తున్నారు. ఎంత పిలిచినా తలుపులు తీయకపోవడంతో.. ఎప్పటి లాగే గురువారం ఉదయం 9 గంటల సమయంలో నిర్వాహకులు షాపు తెరవడానికి వచ్చారు. దుకాణంలో పడుకున్న ముగ్గురు సేల్స్మేన్లు ప్రతి రోజూ ఉదయం 7 గంటలలోపు నిద్రలేచి ఇంటికి వెళ్తారు. అయితే 9గంటలు దాటినా వారు తలుపులు తీయలేదు. షాపు యజమాని సుబ్రమణ్యం గట్టిగా అరచినప్పటికీ లోపల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో సుబ్రమణ్యం తన వద్దనున్న స్మార్ట్‌ఫోన్‌లో సీసీకెమెరా ఫుటేజీలను చూశారు. ముగ్గురిలో నారాయణ స్వామి మాత్రం బయటి రూం వాకిలి వద్ద పడి ఉన్నట్లు గుర్తించారు. సిబ్బంది సాయంతో తలుపులు పగులకొట్టారు. అపస్మారక స్థితిలో పడిపోయిన నారాయణస్వామిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మధ్యలో ఉన్న రూంలో సుబ్బరాయుడు పడిపోయి ఉన్నాడు. బాత్రూంలోకి వెళ్లి చూడగా రాజశేఖర్ చనిపోయి ఉన్నాడు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అపస్మారక స్థితిలో పడిపోయిన సుబ్బరాయుడును వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీ లించి మృతి చెందాడని నిర్ధరించారు. ఎలా వ్యాపించింది..? తల్లం జ్యూవెలర్స్ షాపు నిర్వహిస్తున్న దుకాణం ఇళ్లు మెయిన్‌బజార్ నుంచి పొడవునా ఎల్లప్పగారి వీధిలోకి ఉంది. ఈ గదికి బాత్రూం కూడా ఎల్లప్పగారి వీధి వైపున ఉంది. బాత్రూం పక్కనే వాడని ఆల్కాగ్లో బంగారు ఆభరణాల తయారీకి ఉపయోగించే కెమికల్స్ వ్యర్థాలు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. తల్ల జ్యూవెలర్స్ షాపులో బంగారు నగలను విక్రయిస్తారు. ఆభరణాల తయారీ జరగదు కావున నిర్వాహకులు కెమికల్స్ వ్యర్థాలు బయట పడేసే అవకాశం లేదు. గతంలో ఈ ఇంటిలో బంగారు దుకాణం నిర్వహించిన వారెవరైనా కెమికల్స్ వ్యర్థాలు పడేసి ఉండవచ్చని పోలీసులతో పాటు వ్యాపారులు అంటున్నారు. మృతి చెందిన వ్యక్తులలో ఎవరో ఒకరు సిగరెట్ తాగి ఆల్కాగ్లో వేయడం వల్ల పొగవ్యాపించి ఉంటుందని తెలుస్తోంది. రెండు మూడు రకాల కెమికల్స్ వ్యర్థాలు ఉండటం వల్ల అది విష వాయువుగా మారి ఉంటుందని భావిస్తున్నారు. దసరా రోజున విషాదం దసరా పండుగ రోజున రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. బలిమిడి రాజశేఖర్ జమ్మలమడుగు రోడ్డులోని కేశన్నసత్రం వీధిలో నివాసం ఉంటున్నాడు. అతను గత ఏడేళ్ల నుంచి తల్ల జ్యూవెలర్స్‌లో పనిచేస్తున్నాడు. సగినాదం సుబ్బరాయుడు ఈశ్వరరెడ్డినగర్‌లో నివాసం ఉంటున్నాడు. అతను గత పదేళ్ల నుంచి ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నాడు. త్రివేణి, శ్రీలక్ష్మి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఇద్దరి మృతితో ఆ కుటుంబాల్లో విషాదం అలుముకుంది. కోలుకుంటున్న నారాయణస్వామి నారాయణస్వామి ఈశ్వరరెడ్డినగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఏడాది నుంచి సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. తీవ్ర అస్వస్థతకు గురైన నారాయణస్వామిని హోమస్‌పేటలోని హర్ష ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతన్ని ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. ప్రాణాపాయం తప్పిందని, భయపడాల్సిన పనిలేదని వైద్యులు తెలిపారు. బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే రాచమల్లు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి జిల్లా ఆస్పత్రికి చేరుకుని సుబ్బరాయుడు, రాజశేఖర్ మృతదేహాలను సందర్శించారు. రోదిస్తున్న వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం ప్రమాదం జరిగిన జ్యూవెలర్స్ షాపుకు చేరుకుని సంఘటన ఎలా జరిగిందో పోలీసులను అడిగి తెలుసుకున్నారు. డీఎస్పీతో కలిసి సీసీ పుటేజ్‌లను పరిశీలించారు. మున్సిపల్ చైర్మన్ ఉండేల గురివిరెడ్డి, వైస్ చైర్మన్ జబివుల్లా ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్ సీఐ టీవీ సత్యనారాయణ తెలిపారు. -
రూ.15 లక్షలకు ‘సున్నం’!
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : కొత్త పాలకవర్గం కొలువుదీరినా జిల్లా పరిషత్‌లో అక్రమాలకు అడ్డుకట్ట పడటం లేదు. ఇటీవల జెడ్పీ పరిధిలోని ఉద్యోగుల అక్రమ డిప్యూటేషన్ల వ్యవహారం నడిపిన అధికారులు ఇప్పుడు మరమ్మతు పనుల పేరుతో మరో అక్రమానికి తెరలేపారు. నిబంధనలు తుంగలో తొక్కి పనులు చేస్తూ ప్రజల సొమ్మును నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. సుమారు మూడేళ్ల అనంతరం జిల్లా పరిషత్‌కు కొత్త పాలకవర్గం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో జెడ్పీ భవనానికి మరమ్మతు పనులు చేపట్టాలని నిర్ణయించారు. జిల్లా పరిషత్ భవనానికి సున్నం, రంగులు వేయాలని భావించారు. చైర్పర్సన్ గదికి,వేచి ఉండే గదికి మరమ్మతులు చేపట్టా రు. నిబంధనల ప్రకారం రూ.లక్ష అంచ నా వ్యయం దాటిన పనులకు ఈ-ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లు నిర్వహిం చాలి. కానీ, ఎలాంటి టెండర్లు పిలువకుండానే రూ.15లక్షల అంచనా వ్యయం కలిగిన పనులు తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు అప్పగించారు. పైగా రికార్డుల్లో మాత్రం డిపార్ట్మెంట్ వర్క్‌గా పేర్కొంటున్నారు. పర్సెంటేజీలతో సం తృప్తి పరిచే ఈ కాంట్రాక్టరుకే అధికారులు గతంలో కూడా పనులు కట్టబెట్టారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పనులు రెండుగా విభజించి.. సాధారణంగా తక్కువ అంచనా వ్యయం కలిగిన చిన్నచిన్న అభివృద్ధి పనులను ఒకే పని(ప్యాకేజీ)గా మార్చి టెండర్లు ని ర్వహిస్తుంటారు. కానీ అక్రమాల్లో ఆరితేరిన ఈ అధికారులు మాత్రం రూ.లక్షల్లో అంచనా వ్యయం కలిగిన పనులను చిన్నచిన్న పనులుగా విభజించి డిపార్ట్మెంట్ వర్క్ పేరుతో కాంట్రాక్టర్లకు అప్పగించా రు. రూ.5 లక్షలతో జెడ్పీ చైర్పర్సన్ గది, జెడ్పీటీసీల వెయిటింగ్ గది మరమ్మతు లు చేపట్టారు. రూ.10 లక్షలతో జెడ్పీ భవనానికి సున్నం వేసే పనులుగా రికా ర్డు చేశారు. ఈ రెండు పనులను కలిపి ఒ కే పనిగా టెండర్లు నిర్వహించాల్సిన అధికారులు ఇలా రెండుగా విభజించారు. పైగా అత్యవసర పనులను మాత్రమే డిపార్ట్మెంట్ వర్క్ చేపట్టాలి. లేని పక్షం లో టెండర్లు నిర్వహించి ఏ కాంట్రాక్టరు తక్కువ కోట్‌చేస్తే ఆ కాంట్రాక్టరుకు పనులు అప్పగించాలి. టెండర్ల విధానం ద్వారా ప్రభుత్వ ఖాజానాకు భారం తగ్గుతుంది. కానీ ఇక్కడ ఎలాంటి అత్యవసరం లేకుండానే అధికారులు డిపార్ట్మెంట్ ద్వారా పనులు చేస్తున్నారు. పనుల నాణ్యత ప్రశ్నార్థకం నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఈ పనుల్లో నాణ్యత ప్రశ్నార్థకమనే అభిప్రా యం వ్యక్తమవుతోంది. భవనానికి వేస్తు న్న రంగులు నిర్ణీత సంవత్సరాల వరకు మన్నేలా నాణ్యమైన రంగులు వేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం వినియోగిస్తున్న సున్నం, రంగుల్లో ఈ మేరకు నాణ్యత లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఆగమేఘాలపై జరుగుతున్న మరమ్మతు పనుల్లో కూడా నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాక్షాత్తు జిల్లా పరిషత్ కార్యాలయంలోనే జరుగుతున్న ఈ అక్రమ పనులపై జెడ్పీ పాలకవర్గం చర్యలకు శ్రీకారం చుడుతుందా? ప్రతిపక్ష పార్టీల సభ్యులైనా దీనిపై స్పందిస్తారా? వేచి చూడాల్సిందే. అధికారులేమన్నారంటే.. ఈ పనులకు టెండరు విధానం కాకుం డా, డిపార్ట్మెంట్ వర్క్ చేసేందుకు జిల్లా పరిషత్ నుంచి అనుమతి వచ్చిందని, ఈ మేరకే తాము ఈ పనులను చేపట్టామని పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అమీనొద్దీన్ పేర్కొన్నారు. టెండరు నిబంధనల విషయమై ‘సాక్షి’ ప్రతినిధి ప్రస్తావించగా అది జెడ్పీ అధికారులు చూసుకుంటారని ఆయన పేర్కొన్నారు. -
నేడు పలు మార్గాల్లో మెగాబ్లాక్
కొన్ని రైళ్ల రద్దు: మరికొన్నింటి దారి మళ్లింపు ముంబై, సెంట్రల్, న్యూస్‌లైన్: సెంట్రల్, హార్బర్ రైల్వే మార్గాల్లో ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. ఈ సమయంలో రైల్వే ట్రాక్‌లు, ఓవర్ హెడ్ వైర్ల మరమ్మతు పనులు చేపడతారు. తత్ఫలితంగా కొన్ని లోకల్ రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని ఇతర మార్గాల మీదుగా మళ్లించనున్నారు. అలాగే కొన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈ విషయాన్ని శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలోు రైల్వే ప్రజాసంబంధాల అధికారులు తెలియజేశారు. సెంట్రల్మార్గంలో... ములుండ్-మాటుంగా స్టేషన్ల మధ్య అప్ స్లో లైన్లో మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఠాణే తర్వాత రైళ్లను మాటుంగా వరకు ఫాస్ట్ ట్రాక్పైకిమళ్లిస్తారు. ఈ కారణంగా ఇరు స్టేషన్ల మధ్య ములుండ్, భాండుప్, విక్రోలి, ఘాట్కోపర్, కుర్లా, సైన్ స్టేషన్లలో మాత్రమే రైళ్లు ఆగుతాయి. మాటుంగా తర్వాత మళ్లీ స్లో లైన్లో నడుపుతారు. అదేవిధంగా డౌన్ ఫాస్ట్ లైన్లో రైళ్లు ఘాట్కోపర్, విక్రోలి, భాండుప్, ములుండ్ స్టేషన్లలో కూడా ఆపుతారు. అప్ స్లో మార్గంలో నాహుర్, కాంజుర్మార్గ్, విద్యావిహార్ స్టేషన్లలో రైళ్లు ఆగనున్నాయి. ఈ మార్గంలో రైళ్లన్నీ 15 నిమిషాలమేర ఆలస్యంగా నడుస్తాయి. హార్బర్మార్గంలో... హార్బర్ మార్గంలో పన్వెల్-నెరూల్ స్టేషన్ల మధ్య లోకల్ రైలు సేవలను రద్దు చేయనున్నారు. అదేవిధంగా ట్రాన్స్‌హార్బర్ మార్గంలో పన్వెల్-నెరూల్ స్టేషన్ల మధ్య కూడా రద్దు చేయనున్నారు. పన్వెల్-అంధేరీల మధ్య సేవలు ఉండవు. అయితే ప్రయాణికులు అసౌకర్యానికి గురి కాకుండా ఉండకూడదనే ఉద్దేశంతో సీఎస్టీ-నెరూల్, ఠాణే-నెరూల్ సెక్షన్లలో ప్రత్యేక రైళ్లను నడుపుతారు.