బళ్లారి: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో తుంగభద్ర హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీ కాలువల మరమ్మతులకు భారీగా లెస్‌కే టెండర్లు దాఖలు చేశారు. ప్రతి ఏటా మరమ్మతులు చేపడుతున్న సంగతి తెలిసిందే. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా తక్కువ మొత్తానికే టెండర్లు దాఖలు చేయడంతో పనుల్లో నాణ్యత ప్రశ్నార్థకమవుతోంది.
హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీ కాలువల గుండా నీరు సక్రమంగా వెళ్లేందుకు కాలువలు బాగా దెబ్బ తిన్న ప్రాంతాల్లో మరమ్మతులు చేసేందుకు నిధులు విడుదల చేశారు. ఇందులో ఎల్‌ఎల్‌సీ కాలువ కింద తుంగభద్ర డ్యాం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా సరిహద్దు వరకు కాలువ పొడవునా బాగా దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మతులకు దాదాపు రూ.9 కోట్ల నిధులు విడుదల చేశారు. హెచ్‌ఎల్‌సీ కాలువ కూడా దాదాపు రూ.6 కోట్లకు పైగా నిధులు విడుదల చేశారు. తుంగభద్ర డ్యాం నుంచి హెచ్‌ఎల్‌సీ కాలువ ద్వారా అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండల బార్డర్ వరకు మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. ఎల్‌ఎల్‌సీ కాలువ గుండా 131 పనులు, హెచ్‌ఎల్‌సీ కాలువ గుండా 70కి పైగా మరమ్మతులకు టెండర్లను అధికారులు పిలిచారు. అధికారులు టెండర్లు ఓపెన్ చేయగా ప్రతి పనికి 20 నుంచి 40 శాతం వరకు తక్కువకే టెండర్లు దాఖలు కావడం విశేషం.
ఉదాహరణకు లక్ష రూపాయల పనికి ప్రభుత్వం టెండర్లు పిలిస్తే, కాంట్రాక్టర్ 40 శాతం తక్కువకే టెండర్లు దాఖలు చేసి పనులు దక్కించుకున్నారు. పోటాపోటీగా టెండర్లు దాఖలు చేసి పనులు దక్కించుకునేందుకు కాంట్రాక్టర్లపై పోటీ పడ్డారు. ఈ లెక్కన రూ.10 లక్షల పనులకు కూడా రూ.6 లక్షలకు టెండర్ వేసి పనులు దక్కించుకోవడంతో ఇక పనుల్లో నాణ్యత ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అసలే తుంగభద్ర కాలువల గుండా నీరు సక్రమంగా వెళ్లడం లేదని ప్రతి ఏటా రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం పిలిచిన మరమ్మతు టెండర్లు అన్నింటికీ దాదాపుగా తక్కువ మొత్తానికే పనులు దక్కించుకోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. తుంగభద్ర కాలువల మరమ్మతుల్లో అధికారులు, కాంట్రాక్టర్లు ఆడిందే ఆట పాడిందే పాటగా మారడంతో రైతులకు శాపంగా మారింది. ఎల్‌ఎల్‌సీ ఈఈ నారాయణ నాయక్ ‘సాక్షి’తో మాట్లాడుతూ ప్రొసీజర్ ప్రకారం టెండర్లు దాఖలు చేయడంతో తాము ఓపెన్ చేశామన్నారు. లెస్‌కు టెండర్లు దాఖలు చేసినా నాణ్యతపై రాజీ పడేది లేదన్నారు.
‘తుంగభద్ర’ పనుల్లో నాణ్యత లేనట్లేనా?
Published Sun, May 10 2015 5:18 AM | Last Updated on Sun, Sep 3 2017 1:44 AM
Advertisement