సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ ఏడో బ్లాక్ 20వ పియర్ భారీ శబ్దంతో కుంగిపోయింది. బ్యారేజ్ దెబ్బతినడంతో సరిహద్దులో తెలంగాణ, మహారాష్ట్రల మధ్య అక్టోబరు 21వ తేదీ నుంచి రాకపోకలను నిలిపేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక తెలంగాణ ఎన్నికల వేళ రాజకీయపరమైన విమర్శలకు తావిచ్చింది. ఒకవైపు బ్యారేజ్ వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. మరోవైపు డ్యామేజ్ పనులు జరుగుతున్నట్లు సమాచారం.
పిలర్లు కుంగిపోయిన ఏడో బ్లాక్ పరిధిలో పనులు కొనసాగుతున్నట్లు సమాచారం. నీటిని మళ్లించినా ఎగువ ప్రాంతం నుంచి ప్రవాహం కొనసాగుతోంది. ప్రాణహిత నుంచి బ్యారేజ్‌కు నీరు చేరుతోంది. మేడిగడ్డ బ్యారేజ్ పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలు. ఎగువ నుంచి 26,350 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా 61 గేట్లు ఎత్తి 22,590 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు నదిలో కాఫర్ డ్యాం పనులు సాగుతున్నట్లు తెలుస్తోంది.
అన్నారం బుంగల కోసం గ్రౌటింగ్
అన్నారం (సరస్వతి) బ్యారేజీ బుంగలు ఏర్పడిన విషషయమూ తెలిసిందే. ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో ఇసుక, రాళ్లతో కూడిన సంచులు వేసినా పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదని సమాచారం.
దీంతో రెండు పియర్ల వద్ద సీపేజీ (బుంగలు) ఏర్పడగా వాటి మరమ్మతులకు ఢిల్లీ నుంచి నిపుణుల బృందం రానున్నట్లు సమాచారం. 2020లో ఇలాంటి పరిస్థితి ఎదురుకాగా పాలియూరిథిన్ (పీయు) గ్రౌటింగ్ ద్వారా బుంగలను పూడ్చారు. ఈ సారి కూడా ఇదే పద్ధతిని అవలంబించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: మేడిగడ్డ పంచాయతీ.. బారికేడ్లతో బ్యారేజ్ మూసివేత
Comments
Please login to add a commentAdd a comment