ప్రాణం తీసిన విష వాయువు | Taken on a life of its poisonous gas | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన విష వాయువు

Published Fri, Oct 3 2014 3:39 AM | Last Updated on Tue, Sep 18 2018 7:34 PM

Taken on a life of its poisonous gas

విష వాయువు పీల్చుకొని ఇరువురు మృతి
 ప్రొద్దుటూరు క్రైం: పండుగ వేళ ప్రొద్దుటూరులో విషాదం చోటు చేసుకుంది.  మెయిన్‌బజార్‌లోని తల్లం జ్యువెలర్స్‌లో విషవాయువు వ్యాపించడంతో ఊపిరి పీల్చుకోలేక షాపులో పని చేస్తున్న సేల్స్‌మెన్‌లు బలిమెడి రాజశేఖర్ (23), సగినాదం సుబ్బరాయుడ (36) మృతి చెందారు. మరో సేల్స్‌మెన్ గంజికుంట నారాయణస్వామి ప్రాణాలతో బయట పడ్డాడు. పోలీసుల కథనం మేరకు...స్థానిక మెయిన్‌బజార్‌లో తల్లం జ్యూవెలర్స్ షాపును తల్లం శేషయ్య  సోదరులు నిర్వహిస్తున్నారు. వారి సొంత దుకాణంలో మరమ్మతు పనులు చేయిస్తుండటంతో ఎదురుగా ఉన్న ఇంటిని బాడుగకు తీసుకుని దుకాణం నిర్వహిస్తున్నారు.

ఈ షాపులో ఈశ్వరరెడ్డినగర్‌కు చెందిన బలిమిడి రాజశేఖర్, సగినాదం సుబ్బరాయుడు, గంజి కుంట నారాయణ స్వామి సేల్స్‌మెన్‌లుగా పని చేస్తున్నారు. అద్దె ఇళ్లు కావడంతో భద్రత సరిగా ఉండదని భావించిన నిర్వాహకులు ముగ్గురు సేల్స్‌మెన్‌లను రాత్రి సమయాల్లో షాపులోనే పడుకోవాలని చె ప్పారు. దీంతో గత నెల రోజుల నుంచి ముగ్గురు రాత్రి వేళల్లో షాపులోని నిద్రిస్తున్నారు.
 
ఎంత పిలిచినా తలుపులు తీయకపోవడంతో..
ఎప్పటి లాగే గురువారం ఉదయం 9 గంటల సమయంలో నిర్వాహకులు షాపు తెరవడానికి వచ్చారు. దుకాణంలో పడుకున్న ముగ్గురు సేల్స్‌మేన్‌లు ప్రతి రోజూ ఉదయం 7 గంటలలోపు నిద్రలేచి ఇంటికి వెళ్తారు. అయితే 9గంటలు దాటినా వారు తలుపులు తీయలేదు. షాపు యజమాని సుబ్రమణ్యం గట్టిగా అరచినప్పటికీ లోపల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో సుబ్రమణ్యం తన వద్దనున్న స్మార్ట్‌ఫోన్‌లో సీసీకెమెరా ఫుటేజీలను చూశారు.

ముగ్గురిలో నారాయణ స్వామి మాత్రం బయటి రూం వాకిలి వద్ద పడి ఉన్నట్లు గుర్తించారు. సిబ్బంది సాయంతో తలుపులు పగులకొట్టారు. అపస్మారక స్థితిలో పడిపోయిన నారాయణస్వామిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  మధ్యలో ఉన్న రూంలో సుబ్బరాయుడు పడిపోయి ఉన్నాడు. బాత్‌రూంలోకి  వెళ్లి చూడగా రాజశేఖర్ చనిపోయి ఉన్నాడు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అపస్మారక స్థితిలో పడిపోయిన సుబ్బరాయుడును వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీ లించి మృతి చెందాడని నిర్ధరించారు.
 
ఎలా వ్యాపించింది..?

తల్లం జ్యూవెలర్స్ షాపు నిర్వహిస్తున్న దుకాణం ఇళ్లు  మెయిన్‌బజార్ నుంచి పొడవునా ఎల్లప్పగారి వీధిలోకి ఉంది. ఈ గదికి బాత్‌రూం కూడా ఎల్లప్పగారి వీధి వైపున ఉంది. బాత్‌రూం పక్కనే వాడని ఆల్‌కాగ్‌లో బంగారు ఆభరణాల తయారీకి  ఉపయోగించే కెమికల్స్ వ్యర్థాలు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.  తల్ల జ్యూవెలర్స్ షాపులో బంగారు నగలను విక్రయిస్తారు. ఆభరణాల తయారీ జరగదు కావున నిర్వాహకులు కెమికల్స్ వ్యర్థాలు బయట పడేసే అవకాశం లేదు.

గతంలో ఈ ఇంటిలో బంగారు దుకాణం నిర్వహించిన వారెవరైనా కెమికల్స్ వ్యర్థాలు పడేసి ఉండవచ్చని పోలీసులతో పాటు వ్యాపారులు అంటున్నారు. మృతి చెందిన వ్యక్తులలో ఎవరో ఒకరు సిగరెట్ తాగి ఆల్‌కాగ్‌లో వేయడం వల్ల పొగవ్యాపించి ఉంటుందని తెలుస్తోంది. రెండు మూడు రకాల కెమికల్స్ వ్యర్థాలు ఉండటం వల్ల  అది విష వాయువుగా మారి ఉంటుందని భావిస్తున్నారు.
 
దసరా రోజున విషాదం
దసరా పండుగ రోజున రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. బలిమిడి రాజశేఖర్ జమ్మలమడుగు రోడ్డులోని కేశన్నసత్రం వీధిలో నివాసం ఉంటున్నాడు. అతను గత ఏడేళ్ల నుంచి తల్ల జ్యూవెలర్స్‌లో పనిచేస్తున్నాడు. సగినాదం సుబ్బరాయుడు ఈశ్వరరెడ్డినగర్‌లో నివాసం ఉంటున్నాడు. అతను గత పదేళ్ల నుంచి ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నాడు. త్రివేణి, శ్రీలక్ష్మి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఇద్దరి మృతితో ఆ కుటుంబాల్లో విషాదం అలుముకుంది.
 
కోలుకుంటున్న నారాయణస్వామి
నారాయణస్వామి ఈశ్వరరెడ్డినగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఏడాది నుంచి సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. తీవ్ర అస్వస్థతకు గురైన నారాయణస్వామిని హోమస్‌పేటలోని హర్ష ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతన్ని ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. ప్రాణాపాయం తప్పిందని, భయపడాల్సిన పనిలేదని వైద్యులు తెలిపారు.
 
బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే రాచమల్లు

ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి జిల్లా ఆస్పత్రికి చేరుకుని సుబ్బరాయుడు, రాజశేఖర్ మృతదేహాలను సందర్శించారు. రోదిస్తున్న వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం ప్రమాదం జరిగిన జ్యూవెలర్స్ షాపుకు చేరుకుని సంఘటన ఎలా జరిగిందో పోలీసులను అడిగి తెలుసుకున్నారు. డీఎస్పీతో కలిసి సీసీ పుటేజ్‌లను పరిశీలించారు. మున్సిపల్ చైర్మన్ ఉండేల గురివిరెడ్డి, వైస్ చైర్మన్ జబివుల్లా ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్ సీఐ టీవీ సత్యనారాయణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement