సాక్షి, సిటీబ్యూరో: శంషాబాద్ విమానాశ్రయాన్ని తక్కువ సమయంలో చేరుకునేందుకు వీలుగా నగరంలో నిర్మించిన ‘పీవీ నర్సింహారావు(పీవీఎన్‌ఆర్) ఎక్స్‌ప్రెస్ వే’ సరికొత్త రూపును సంతరించుకుంటోంది. వాహనదారుల ప్రయాణానికి ఇబ్బందులు లేకుండా పాత బీటీ రోడ్డును తొలగించి కోల్డ్ మిల్లీమిషన్ ద్వారా చేపట్టిన కొత్త రోడ్డు పనులను శరవేగంగా చేస్తున్న హెచ్‌ఎండీఏ ఇంజినీరింగ్ అధికారులు.. ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్లకు వెదర్ ప్రూఫ్ ఎమల్షన్ పెయింటింగ్‌తో సరికొత్త లుక్ తెస్తున్నారు. వీటితో పాటు ఎక్స్‌ప్రెస్ వే శ్లాబుల వద్ద సోడియం పేపర్ లైట్‌ల స్థానంలో విద్యుత్ వినియోగం తగ్గించే ఎల్‌ఈడీ బల్బులను అమర్చే ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారు. సుమారు రూ.24.50 కోట్లతో ఈ ఎక్స్‌ప్రెస్ వే సరికొత్త హంగులతో వాహనదారులకు ఆహ్లాదరకమైన జర్నీ అనుభూతినిచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
విమానశ్రయానికి సాఫీ జర్నీ
దేశంలోని ఇతర రాష్ట్రాలు, విదేశాలకు వెళ్లే ప్రయాణికులు పీవీ ఎక్స్‌ప్రెస్ వే మీదుగానే శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అయితే, ఈ మార్గం నిర్మించాక ఎనిమిదేళ్ల క్రితం చిన్నచిన్న మరమ్మతులు చేశారు. ప్రస్తుతం రోడ్డు మార్గం ప్రమాదకరంగా ఉండడంతో పాటు వాహనదారుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న హెచ్‌ఎండీఏ అధికారులు పాత బీటీ రోడ్డును తొలగించి మరమ్మతులు చేస్తున్నారు. రూ.12.50 కోట్లతో మే 22 నుంచి సాగుతున్న ఈ మరమ్మతులు తుది దశకు చేరుకున్నాయి. ఈ పనులతో శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే వాహనాలకు మాత్రమే అనుమతించిన అధికారులు తిరుగు ప్రయాణంలో వచ్చే వాహనాలను ఎక్స్‌ప్రెస్‌వే కింద రహదారి మీదుగా మళ్లిస్తున్నారు.
పిల్లర్లకు కొత్తరూపు
మెహదీపట్నంలోని సరోజినిదేవి కంటి ఆస్పత్రి నుంచి మొదలై ఆరాంఘర్ ఎక్స్ రోడ్డు వద్ద ముగిసే ఈ ఎక్స్‌ప్రేస్ వే మార్గంలో 325 పిల్లర్లు ఉన్నాయి. అయితే, కొన్ని ప్రముఖ జంక్షన్ల వద్ద పిల్లర్లకు వర్టికల్ గార్డెనింగ్(పచ్చని రూపు)ను హెచ్‌ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ అధికారులు చేశారు. ఆ పిల్లర్లకు రెండు నెలల నుంచి వెదర్‌ప్రూఫ్ ఎమల్షన్ పెయింటింగ్‌తో సరికొత్త లుక్ తీసుకొస్తున్నారు. రూ.9.50 కోట్లతో పిల్లర్ల రూపురేఖలు మారుస్తున్నారు. అదే సమయంలో ఎంతో మదికి చిరునామాలకు ఐకాన్‌గా ఉన్న పిల్లర్ల నంబర్లను సైతం పెయింటింగ్‌తో వేస్తున్నారు.
ఎల్‌ఈడీ బల్బులతో వెలుగు
ఓవైపు రోడ్డు మరమ్మతు పనులు, మరోవైపు పిల్లర్ల పెయింటింగ్‌తో సరికొత్త రూపు సంతరించకుంటున్న పీవీ ఎక్స్‌ప్రెస్ వేలో ఎల్‌ఈడీ బల్బులు బిగించే పనులపై హెచ్‌ఎండీఏ ఇంజినీరింగ్ విభాగ అధికారులు దృష్టి సారించారు. రూ.2.5 కోట్లతో 1350 ఎల్‌ఈడీ బల్బులు అమర్చే పనులను టెండర్ ద్వారా కాంట్రాక్టర్‌కు అప్పగించనున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ పనులు పూర్తిచేసే ఆలోచనలో అధికారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment