
సాక్షి, హైదరాబాద్ : ఉస్మానియా ఆస్పత్రి రోగులను మురుగు ముప్పు ఇంకా వెంటాడుతూనే ఉంది. ఆస్పత్రిలోని డ్రైనేజీ వ్యవస్థ శిథిలమవడంతో వర్షపునీరు వెళ్లే మార్గంలేక అంతర్గత రోడ్లపైనే పొంగిపొర్లుతోంది. సెక్యూరిటీ ఆఫీసు సమీపం నుంచి పాతభవనంలోకి నీరు చేరుతోంది. దీంతో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీం గురువారం ఆస్పత్రికి చేరుకుని తాత్కాలిక మరమ్మతులు నిర్వహించింది. వార్డులోకి చేరిన నీటిని పాతభవనం డోమ్ గేట్ ద్వారా బయటికి ఎత్తిపోసింది. తడిసిన పడకలు, పీపీఈ కిట్‌బాక్స్‌లను ఆరబెట్టింది. అయితే, డ్రైనేజీ లైన్లను ఇంకా పునరుద్ధరించలేదు. దీంతో మళ్లీ వర్షం వస్తే వార్డుల్లోకి వరదనీరు చేరే ప్రమాదముందని పాతభవనంలోని రోగులు, వైద్యసిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాతభవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో చికిత్స పొందుతున్నవారందరినీ గురువారం ఫస్ట్‌ఫ్లోర్‌కు తరలించారు. కానీ, ఆయావార్డులను శుభ్రం చేయకపోవడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. ఇదే ప్రాంగణంలో ఉన్న మరో భవనం(కులీకుతుబ్ షా) ఐదో అంతస్తులోకి కూడా వర్షపునీరు లీక్ అవుతోంది. దీంతో ఆ వార్డులో ఉన్న డయాలసిస్ యంత్రాలపై నీరుపడి పాడైపోయాయి. ఈ భవనంపై అదనపు అంతస్థు నిర్మిస్తుండటం, నిర్మాణ సమయంలో స్లాబు, గోడలకు పగుళ్లు ఏర్పడటంవల్ల వర్షపునీరు కిందికి ఇంకుతున్నట్లు అక్కడి డాక్టర్లు చెబుతున్నారు.