pv express way
-
హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు.. ఈ ఫ్లైఓవర్లపై నో ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి జనవరి 1వ తేదీ 5 గంటల వరకు ఓఆర్ఆర్, పీవీ ఎక్స్‌ప్రెస్ వేను మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. కేవలం విమానాశ్రయానికి వెళ్లే వాహనాలను మాత్రమే అనుమతించనున్నట్లు తెలిపారు. సైబరాబాద్ పరిధిలోని శిల్పా లే అవుట్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, షేక్‌పేట, మైండ్‌స్పేస్, సైబర్ టవర్, ఫోరం మాల్, జేఎన్టీయూ, ఖైతలాపూర్, బాలానగర్ ఫ్లై ఓవర్లు, దుర్గం చెరువు వంతెనలను 31వ తేదీ రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు మూసివేస్తామని వెల్లడించారు. న్యూఇయర్ వేడుకల సందర్భంగా క్యాబ్, ఆటో డ్రైవర్లకు తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని సైబరాబాద్ పోలీసులు ఆదేశించారు. అధిక చార్జీలు వసూలు చేస్తే పెనాల్టీతోపాటు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి వివరాలను వాట్సప్ నెంబర్ 94906-17346కు ఫిర్యాదు చేయవచ్చనని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. పబ్‌లలో మద్యం సేవించి వాహనం నడపకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈవెంట్ నిర్వాహకులదేనని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకుండా పోలీసులు స్పెషల్ కెమెరాలు ఏర్పాటు చేశారు. డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచి సైబరాబాద్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టున్నట్లు తెలిపారు. మద్యం మత్తులో తాగి రోడ్డు ప్రమాద మరణానికి కారణం అయితే వారిపై మర్డర్ కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. . చదవండి: కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు -
సరికొత్తగా పీవీ ఎక్స్‌ప్రెస్ వే
సాక్షి, సిటీబ్యూరో: శంషాబాద్ విమానాశ్రయాన్ని తక్కువ సమయంలో చేరుకునేందుకు వీలుగా నగరంలో నిర్మించిన ‘పీవీ నర్సింహారావు(పీవీఎన్ఆర్) ఎక్స్‌ప్రెస్ వే’ సరికొత్త రూపును సంతరించుకుంటోంది. వాహనదారుల ప్రయాణానికి ఇబ్బందులు లేకుండా పాత బీటీ రోడ్డును తొలగించి కోల్డ్ మిల్లీమిషన్ ద్వారా చేపట్టిన కొత్త రోడ్డు పనులను శరవేగంగా చేస్తున్న హెచ్ఎండీఏ ఇంజినీరింగ్ అధికారులు.. ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్లకు వెదర్ ప్రూఫ్ ఎమల్షన్ పెయింటింగ్‌తో సరికొత్త లుక్ తెస్తున్నారు. వీటితో పాటు ఎక్స్‌ప్రెస్ వే శ్లాబుల వద్ద సోడియం పేపర్ లైట్ల స్థానంలో విద్యుత్ వినియోగం తగ్గించే ఎల్ఈడీ బల్బులను అమర్చే ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారు. సుమారు రూ.24.50 కోట్లతో ఈ ఎక్స్‌ప్రెస్ వే సరికొత్త హంగులతో వాహనదారులకు ఆహ్లాదరకమైన జర్నీ అనుభూతినిచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విమానశ్రయానికి సాఫీ జర్నీ దేశంలోని ఇతర రాష్ట్రాలు, విదేశాలకు వెళ్లే ప్రయాణికులు పీవీ ఎక్స్‌ప్రెస్ వే మీదుగానే శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అయితే, ఈ మార్గం నిర్మించాక ఎనిమిదేళ్ల క్రితం చిన్నచిన్న మరమ్మతులు చేశారు. ప్రస్తుతం రోడ్డు మార్గం ప్రమాదకరంగా ఉండడంతో పాటు వాహనదారుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న హెచ్ఎండీఏ అధికారులు పాత బీటీ రోడ్డును తొలగించి మరమ్మతులు చేస్తున్నారు. రూ.12.50 కోట్లతో మే 22 నుంచి సాగుతున్న ఈ మరమ్మతులు తుది దశకు చేరుకున్నాయి. ఈ పనులతో శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే వాహనాలకు మాత్రమే అనుమతించిన అధికారులు తిరుగు ప్రయాణంలో వచ్చే వాహనాలను ఎక్స్‌ప్రెస్‌వే కింద రహదారి మీదుగా మళ్లిస్తున్నారు. పిల్లర్లకు కొత్తరూపు మెహదీపట్నంలోని సరోజినిదేవి కంటి ఆస్పత్రి నుంచి మొదలై ఆరాంఘర్ ఎక్స్ రోడ్డు వద్ద ముగిసే ఈ ఎక్స్‌ప్రేస్ వే మార్గంలో 325 పిల్లర్లు ఉన్నాయి. అయితే, కొన్ని ప్రముఖ జంక్షన్ల వద్ద పిల్లర్లకు వర్టికల్ గార్డెనింగ్(పచ్చని రూపు)ను హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ అధికారులు చేశారు. ఆ పిల్లర్లకు రెండు నెలల నుంచి వెదర్‌ప్రూఫ్ ఎమల్షన్ పెయింటింగ్‌తో సరికొత్త లుక్ తీసుకొస్తున్నారు. రూ.9.50 కోట్లతో పిల్లర్ల రూపురేఖలు మారుస్తున్నారు. అదే సమయంలో ఎంతో మదికి చిరునామాలకు ఐకాన్‌గా ఉన్న పిల్లర్ల నంబర్లను సైతం పెయింటింగ్‌తో వేస్తున్నారు. ఎల్ఈడీ బల్బులతో వెలుగు ఓవైపు రోడ్డు మరమ్మతు పనులు, మరోవైపు పిల్లర్ల పెయింటింగ్‌తో సరికొత్త రూపు సంతరించకుంటున్న పీవీ ఎక్స్‌ప్రెస్ వేలో ఎల్ఈడీ బల్బులు బిగించే పనులపై హెచ్ఎండీఏ ఇంజినీరింగ్ విభాగ అధికారులు దృష్టి సారించారు. రూ.2.5 కోట్లతో 1350 ఎల్ఈడీ బల్బులు అమర్చే పనులను టెండర్ ద్వారా కాంట్రాక్టర్‌కు అప్పగించనున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ పనులు పూర్తిచేసే ఆలోచనలో అధికారులు ఉన్నారు. -
ఎయిర్పోర్ట్ దాకా..
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి హైదరాబాద్ నగరం నుంచి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సులువుగా రాకపోకలు సాగించేందుకు పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వేను పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఫ్లై ఓవర్‌ను ఎయిర్పోర్ట్ వరకు విస్తరించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ప్రస్తుతం మాసబ్‌ట్యాంక్‌లోని సరోజినీదేవి కంటి ఆస్పత్రి నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు ఉన్న ఈ ఫ్లై ఓవర్‌ను బెంగళూరు జాతీయ రహదారి నుంచి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే మార్గంతో అనుసంధానం చేయాలని ప్రతిపాదించింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పీవీ ఎక్స్‌ప్రెస్ వేకు అంకురార్పణ జరిగింది. సుమారు రూ.600 కోట్ల వ్యయంతో, 11.06 కిలోమీటర్ల పొడవున నిర్మితమైన ఈ ఫ్లైఓవర్ దేశంలోనే అతి పెద్దది. ఈ వంతెనతో బెంగళూరు జాతీయ రహదారి, ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే వాహనదారులకు కొంత ఊరట కలుగుతోంది. ఈ నేపథ్యంలో ఆరాంఘర్ వద్ద ముగుస్తున్న ఈ ఫ్లై ఓవర్‌ను విమానాశ్రయం వరకు పొడిగిస్తే ప్రయాణం మరింత సులువుగా ఉంటుందనే అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న సర్కారు ఆ దిశగా కసరత్తు మొదలు పెట్టింది. వంతెన ముగిసిన తర్వాత వెంటనే గగన్ పహాడ్ ‘వై’జంక్షన్ ఉండటం, శంషాబాద్ పట్టణంలో విపరీతమైన ట్రాఫిక్ పెరిగిన నేపథ్యంలో ఈ ఫ్లై ఓవర్‌ను ఎయిర్‌పోర్టు వరకు కొనసాగిస్తే బాగుంటుందనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ఈ మేరకు ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణ బాధ్యతను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కు అప్పగించింది. సుమారు 10 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ మార్గం డిజైన్‌ను ఎన్హెచ్ఏఐ రూపొందిస్తోంది. రూ.400 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేస్తున్న ఇంజనీరింగ్ విభాగం.. మార్గమధ్యంలో రెండు చోట్ల దిగేలా ర్యాంపులు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం కొన్ని చోట్ల భూ సేకరణ చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. -
ప్రధాని బందోబస్తులో ఉన్న ఎస్ఐ ఆత్మహత్య!
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లలో ఉన్న ఓ ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీధర్ అనే ఈ ఎస్ఐ తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు కోల్పోయాడు. మెహిదీపట్నం నుంచి శంషాబాద్ వెళ్లే పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వేపై 174వ నెంబరు పిల్లరు వద్ద ఉప్పర్‌పల్లి సమీపంలో ఉన్న ఆయన.. నేరుగా గుండెకు గురిపెట్టుకుని కాల్చుకుని చనిపోయాడు. శ్రీధర్.. కొమురం భీమ్ జిల్లా పెంచికల్పేట్ ఎస్ఐగా ఉన్న శ్రీధర్ 2012 బ్యాచ్‌కు చెందిన అధికారి. ఈయన ప్రధాని భద్రత కోసమే హైదరాబాద్ వచ్చారు. ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో ఈ ప్రాంతమంతా భద్రత కట్టుదిట్టంగా ఉంది. పైగా ఉప్పర్‌పల్లి అంటే ప్రధాని బసచేసిన పోలీసు అకాడమీకి చాలా దగ్గరలో్ ఉంటుంది. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన సంభవించింది. దాంతో ఒక్కసారిగా ఇక్కడ అంతా కలకలం రేగింది. పోలీసులు ఈ ప్రాంతం మొత్తాన్ని దిగ్బంధం చేశారు. ఎవరినీ అటువైపు అనుమతించడం లేదు. డ్యూటీలో ఉన్న ఎస్ఐ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం ఇంతవరకు నిర్ధారణ కాలేదు. సంఘటన జరిగిన తర్వాత అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు గానీ, అప్పటికే మరణించినట్లు తెలుస్తోంది. మీడియా సహా ఎవ్వరినీ అక్కడకు రానివ్వడం లేదు. చింతనమనేపల్లి ఎస్ఐ శ్రీధర్.. ఉప్పర్‌పల్లి సమీపంలోని హేపీ హోం అపార్టుమెంటు పై నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. అక్కడే ఆయన తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకున్నారు. ప్రాథమికంగా అందుతున్న సమాచారాన్ని బట్టి కుటుంబ కలహాల వల్లే ఈయన ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది గానీ, ఈ విషయాన్ని ఇంకా ఎవరూ నిర్ధారించలేదు. వరంగల్ జిల్లా పైడిపల్లికి చెందిన శ్రీధర్.. నాలుగేళ్లలో నాలుగు పోలీసు స్టేషన్లు మారారు. గతంలో గుడిహత్నూర్, ముధోల్, కాగజ్‌నగర్ స్టేషన్లలో చేసిన ఆయన.. ఇప్పుడు చింతనమనేపల్లి స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నారు. -
పీవీ ఎక్స్‌ప్రెస్ వే పై నాలుగు కార్లు ఢీ
హైదరాబాద్: రాజేంద్రనగర్ లోని పీవీ ఎక్స్‌ప్రెస్ వే పై వేగంగా వెళ్తున్న నాలుగు కార్లు సోమవారం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలవ్వగా, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గురైన కార్లు ఎక్స్ ప్రెస్ వేపై నిలిచి ఉండటంతో కిలో మీటర్ మేర ట్రాఫిక్ జాం అయింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గురైన కార్లను అక్కడ నుంచి తొలగించి ట్రాఫిక్ నియంత్రించే పనిలో నిమగ్నమయ్యారు.