ప్రధాని బందోబస్తులో ఉన్న ఎస్ఐ ఆత్మహత్య!
ప్రధాని బందోబస్తులో ఉన్న ఎస్ఐ ఆత్మహత్య!
Published Sat, Nov 26 2016 10:16 AM | Last Updated on Sun, Sep 2 2018 5:06 PM
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లలో ఉన్న ఓ ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీధర్ అనే ఈ ఎస్ఐ తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు కోల్పోయాడు. మెహిదీపట్నం నుంచి శంషాబాద్ వెళ్లే పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వేపై 174వ నెంబరు పిల్లరు వద్ద ఉప్పర్‌పల్లి సమీపంలో ఉన్న ఆయన.. నేరుగా గుండెకు గురిపెట్టుకుని కాల్చుకుని చనిపోయాడు. శ్రీధర్.. కొమురం భీమ్ జిల్లా పెంచికల్‌పేట్ ఎస్ఐగా ఉన్న శ్రీధర్ 2012 బ్యాచ్‌కు చెందిన అధికారి. ఈయన ప్రధాని భద్రత కోసమే హైదరాబాద్ వచ్చారు.
ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో ఈ ప్రాంతమంతా భద్రత కట్టుదిట్టంగా ఉంది. పైగా ఉప్పర్‌పల్లి అంటే ప్రధాని బసచేసిన పోలీసు అకాడమీకి చాలా దగ్గరలో్ ఉంటుంది. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన సంభవించింది. దాంతో ఒక్కసారిగా ఇక్కడ అంతా కలకలం రేగింది. పోలీసులు ఈ ప్రాంతం మొత్తాన్ని దిగ్బంధం చేశారు. ఎవరినీ అటువైపు అనుమతించడం లేదు. డ్యూటీలో ఉన్న ఎస్ఐ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం ఇంతవరకు నిర్ధారణ కాలేదు. సంఘటన జరిగిన తర్వాత అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు గానీ, అప్పటికే మరణించినట్లు తెలుస్తోంది. మీడియా సహా ఎవ్వరినీ అక్కడకు రానివ్వడం లేదు.
చింతనమనేపల్లి ఎస్ఐ శ్రీధర్.. ఉప్పర్‌పల్లి సమీపంలోని హేపీ హోం అపార్టుమెంటు పై నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. అక్కడే ఆయన తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకున్నారు. ప్రాథమికంగా అందుతున్న సమాచారాన్ని బట్టి కుటుంబ కలహాల వల్లే ఈయన ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది గానీ, ఈ విషయాన్ని ఇంకా ఎవరూ నిర్ధారించలేదు.
వరంగల్ జిల్లా పైడిపల్లికి చెందిన శ్రీధర్.. నాలుగేళ్లలో నాలుగు పోలీసు స్టేషన్లు మారారు. గతంలో గుడిహత్నూర్, ముధోల్, కాగజ్‌నగర్ స్టేషన్లలో చేసిన ఆయన.. ఇప్పుడు చింతనమనేపల్లి స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు.
Advertisement
Advertisement