ఎస్సై శ్రీధర్ ఆత్మహత్యకు కారణం ఇదేనా?
- ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానాలు
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనకు బందోబస్తులో భాగంగా ఉన్న ఎస్ఐ శ్రీధర్ ఆత్మహత్యకు కారణాలు ఏమిటన్నదానిపై పలు విషయాలు వెలుగుచూశాయి. ప్రధాని పర్యటన భద్రతా ఏర్పాట్లలో భాగంగా మెహిదీపట్నం నుంచి శంషాబాద్ వెళ్లే పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వేపై 174వ నెంబరు పిల్లరు వద్ద ఉప్పర్‌పల్లి సమీపంలో ఉన్న శ్రీధర్ తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రేమ వ్యవహారం కారణంగానే శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.
శ్రీధర్‌కు సన్నిహితంగా ఉండే సందీప్ అనే హోంగార్డ్ ఆయన ఆత్యహత్య గురించి పలు విషయాలు వెల్లడించాడు. ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని శ్రీధర్ తరచూ తనతో చెప్పేవాడని వెల్లడించాడు. అయితే, తన పెళ్లికి ఇంట్లోవాళ్లు ఒప్పుకోవడం లేదని శ్రీధర్ బాధపడేవాడని తెలిపాడు. ‘నిన్నే చనిపోతానని నాకు చెప్పాడు. వద్దని వారించాను. రాత్రి ఎనిమిది గంటల సమయంలో శ్రీధర్‌తో మాట్లాడి వెళ్లిపోయాను. ఉదయం కాల్ చేశాను. లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి వెళ్లాను. అప్పటికే శ్రీధర్ చనిపోయి ఉన్నాడు’ అని హోంగార్డ్ సందీప్ తెలిపాడు.
వరంగల్ జిల్లా పైడిపల్లికి చెందిన శ్రీధర్ వృత్తి జీవితం అంత స్థిరంగా లేదని తెలుస్తోంది. నాలుగేళ్లలో నాలుగు పోలీసు స్టేషన్లు మారారు. గతంలో గుడిహత్నూర్, ముధోల్, కాగజ్‌నగర్ స్టేషన్లలో చేసిన ఆయన.. ఇప్పుడు చింతనమనేపల్లి స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు.