సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : కొత్త పాలకవర్గం కొలువుదీరినా జిల్లా పరిషత్‌లో అక్రమాలకు అడ్డుకట్ట పడటం లేదు. ఇటీవల జెడ్పీ పరిధిలోని ఉద్యోగుల అక్రమ డిప్యూటేషన్ల వ్యవహారం నడిపిన అధికారులు ఇప్పుడు మరమ్మతు పనుల పేరుతో మరో అక్రమానికి తెరలేపారు. నిబంధనలు తుంగలో తొక్కి పనులు చేస్తూ ప్రజల సొమ్మును నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. సుమారు మూడేళ్ల అనంతరం జిల్లా పరిషత్‌కు కొత్త పాలకవర్గం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో జెడ్పీ భవనానికి మరమ్మతు పనులు చేపట్టాలని నిర్ణయించారు.
జిల్లా పరిషత్ భవనానికి సున్నం, రంగులు వేయాలని భావించారు. చైర్‌పర్సన్ గదికి,వేచి ఉండే గదికి మరమ్మతులు చేపట్టా రు. నిబంధనల ప్రకారం రూ.లక్ష అంచ నా వ్యయం దాటిన పనులకు ఈ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా టెండర్లు నిర్వహిం చాలి. కానీ, ఎలాంటి టెండర్లు పిలువకుండానే రూ.15లక్షల అంచనా వ్యయం కలిగిన పనులు తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు అప్పగించారు. పైగా రికార్డుల్లో మాత్రం డిపార్ట్‌మెంట్ వర్క్‌గా పేర్కొంటున్నారు. పర్సెంటేజీలతో సం తృప్తి పరిచే ఈ కాంట్రాక్టరుకే అధికారులు గతంలో కూడా పనులు కట్టబెట్టారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
పనులు రెండుగా విభజించి..
సాధారణంగా తక్కువ అంచనా వ్యయం కలిగిన చిన్నచిన్న అభివృద్ధి పనులను ఒకే పని(ప్యాకేజీ)గా మార్చి టెండర్లు ని ర్వహిస్తుంటారు. కానీ అక్రమాల్లో ఆరితేరిన ఈ అధికారులు మాత్రం రూ.లక్షల్లో అంచనా వ్యయం కలిగిన పనులను చిన్నచిన్న పనులుగా విభజించి డిపార్ట్‌మెంట్ వర్క్ పేరుతో కాంట్రాక్టర్లకు అప్పగించా రు. రూ.5 లక్షలతో జెడ్పీ చైర్‌పర్సన్ గది, జెడ్పీటీసీల వెయిటింగ్ గది మరమ్మతు లు చేపట్టారు. రూ.10 లక్షలతో జెడ్పీ భవనానికి సున్నం వేసే పనులుగా రికా ర్డు చేశారు.
ఈ రెండు పనులను కలిపి ఒ కే పనిగా టెండర్లు నిర్వహించాల్సిన అధికారులు ఇలా రెండుగా విభజించారు. పైగా అత్యవసర పనులను మాత్రమే డిపార్ట్‌మెంట్ వర్క్ చేపట్టాలి. లేని పక్షం లో టెండర్లు నిర్వహించి ఏ కాంట్రాక్టరు తక్కువ కోట్‌చేస్తే ఆ కాంట్రాక్టరుకు పనులు అప్పగించాలి. టెండర్ల విధానం ద్వారా ప్రభుత్వ ఖాజానాకు భారం తగ్గుతుంది. కానీ ఇక్కడ ఎలాంటి అత్యవసరం లేకుండానే అధికారులు డిపార్ట్‌మెంట్ ద్వారా పనులు చేస్తున్నారు.
పనుల నాణ్యత ప్రశ్నార్థకం
నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఈ పనుల్లో నాణ్యత ప్రశ్నార్థకమనే అభిప్రా యం వ్యక్తమవుతోంది. భవనానికి వేస్తు న్న రంగులు నిర్ణీత సంవత్సరాల వరకు మన్నేలా నాణ్యమైన రంగులు వేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం వినియోగిస్తున్న సున్నం, రంగుల్లో ఈ మేరకు నాణ్యత లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఆగమేఘాలపై జరుగుతున్న మరమ్మతు పనుల్లో కూడా నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాక్షాత్తు జిల్లా పరిషత్ కార్యాలయంలోనే జరుగుతున్న ఈ అక్రమ పనులపై జెడ్పీ పాలకవర్గం చర్యలకు శ్రీకారం చుడుతుందా? ప్రతిపక్ష పార్టీల సభ్యులైనా దీనిపై స్పందిస్తారా? వేచి చూడాల్సిందే.
అధికారులేమన్నారంటే..
ఈ పనులకు టెండరు విధానం కాకుం డా, డిపార్ట్‌మెంట్ వర్క్ చేసేందుకు జిల్లా పరిషత్ నుంచి అనుమతి వచ్చిందని, ఈ మేరకే తాము ఈ పనులను చేపట్టామని పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అమీనొద్దీన్ పేర్కొన్నారు. టెండరు నిబంధనల విషయమై ‘సాక్షి’ ప్రతినిధి ప్రస్తావించగా అది జెడ్పీ అధికారులు చూసుకుంటారని ఆయన పేర్కొన్నారు.
రూ.15 లక్షలకు ‘సున్నం’!
Published Tue, Aug 19 2014 12:48 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement