సాక్షి, ముంబై: నగర వాసులకు నీటి సరఫరా చేస్తున్న పైపుల లీకేజీ అరికట్టేందుకు మహానగర పాలక సంస్థ (బీఎంసీ) నడుం బిగించింది. ఈ పనులను మూడు దశల్లో పూర్తిచేయాలని బీఎంసీ పరిపాలన విభాగం నిర్ణయించింది. అందులో భాగంగా సుమారు రూ.40 కోట్ల వ్యయంతో మొదటి దశ పనులు పూర్తిచేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రతిరోజు ముంబైకి సరఫరా అవుతున్న 3,750 ఎమ్మెల్డీల నీటిలో రోజుకు కనీసం 20 శాతం నీరు చోరీకి గురవుతోంది. అలాగే దాదాపు 600 లీటర్లకు పైగా నీరు లీకేజీ వల్ల వృథా అవుతోంది.
ప్రస్తుతం నీటి సరఫరా చేస్తున్న పైపులు పురాతనమైనవి కావడంతో అవి తుప్పుపట్టాయి. దీంతో పైపులు పలు చోట్ల పగిలిపోయి నీరు లీకేజీ అవుతోంది. వీటిని మార్చాలని బీఎంసీ భావిస్తోంది. ఇందులో భాగంగా మొదటి దశ బాంద్రా, ఖార్ రోడ్, శాంతాక్రూజ్ (తూర్పు, పశ్చిమ), తూర్పు విలేపార్లే, తూర్పు అంధేరి, తూర్పు జోగేశ్వరి, చార్‌కోప్, బోరివలి, కాందివలి, గోరాయి, దహిసర్, చెంబూర్, గోవండీ, మాన్‌ఖుర్ద్ తదితరా ప్రాంతాల్లో పైపులకు మరమ్మతు పనులు జరగనున్నాయి.
దీనికి సంబంధించిన ప్రతిపాదిత పనులు ఒకట్రెండు రోజుల్లో స్థాయి సమితీ ముందుకు తీసుకురానున్నారు. అనుమతి లభించగానే త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి.
నీటి లీకేజీపై బీఎంసీ దృష్టి
Published Wed, Feb 25 2015 11:12 PM | Last Updated on Wed, Apr 3 2019 4:53 PM
Advertisement