భారత ద్వితీయ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి మరణంపై అనేక అనుమానాలు ఉన్నాయి. అది హత్యా? సహజ మరణమా? లేక ఇన్‌సైడర్ (లోపలి వ్యక్తి) పనా? అయిదు దశాబ్దాలు గడిచినా, ఏ ఇన్వెస్టిగేషన్, ఏ ఎంక్వైరీ కమిషన్‌కు నోచుకోకుండానే ఆయన మరణం దేశ చరిత్ర పుటల్లో మిస్టరీగానే మిగిలిపోయింది!
1965 భారత్–పాక్ యుద్ధానంతరం, 1966 జనవరి 4న రష్యాలోని తాష్కెంట్‌లో ప్రారంభమైన ఇరు దేశాల చర్చలు జన వరి 10 రాత్రి ‘నోవార్ ప్యాక్ట్ ’ అగ్రిమెంటుతో ముగిశాయి. ఆ తర్వాత తనకు ఏర్పాటు చేసిన ‘డాచా’ (గెస్ట్ హౌజ్ విల్లా)లోని విశాలమైన బెడ్ రూంలో కెళ్ళిపోయారు శాస్త్రి. భోజనానంతరం, కుక్ రావ్‌ునాథ్ తెచ్చిన గ్లాసులోని పాలు త్రాగి నిద్రకు ఉపక్రమించారు.
రాత్రి 1.20 గంటలకు ప్రధాని పర్సనల్ సెక్రెటరీ జగన్నాథ్ సహాయ్ బెడ్ రూం తలుపును ఎవరో తడుతున్న చప్పుడు. తలుపులు తెరచిన ఆయనకు ఎదురుగా కుడి చేత్తో ఛాతీ వత్తుకుంటూ, ‘డాక్టర్ సాబ్ కహా హై’ వగరుస్తూ ప్రధాని ఆర్థింపు. సంగతి తెలిసిపోయింది పీఏ సహాయ్‌కి. అసిస్టెంట్లు ఇద్దరు కలిసి శాస్త్రిజీని ఆయన రూంలోకి తీసు కెళ్ళి గ్లాసులో ఆయనకు నీళ్లు ఇచ్చారు. బెడ్‌పై ఆయనను పడుకోబెట్టి, పక్కరూంలో ఉన్న ప్రధాని పర్సనల్ వైద్యుడు డాక్టర్ ఆర్‌ఎన్ చుఘ్‌కు కబురు చేశాడు పీఏ క్షణాల్లో మెడికల్ కిట్‌తో శాస్త్రీజీ రూంలో కొచ్చి ఆయన పల్స్ చెక్ చేశాడు. శ్వాస పీల్చుకోలేక, ‘మేరే రామ్’ అంటూ అవస్థ పడుతున్నారాయన.
ప్రధాని గుండెపోటుకు గురయ్యారని నిర్ధారణకు వచ్చి వెంటనే ఒక ఇంజెక్షన్ చేసి ఛాతీ వత్తడం ప్రారంభించాడు డాక్టర్ అయినా శాస్త్రీజీ క్రమంగా స్పృహ కోల్పోయారు. ఆఖరు ప్రయత్నంగా మరో ఇంజెక్షన్‌ను నేరుగా శాస్త్రిజీ గుండె దగ్గరే ఇచ్చాడు చుఘ్. అయినా లాభం లేకపోయింది. ఆశ వదలుకుని, గద్గద స్వరంతో ‘బాబూజీ, ఆప్నే ముజె మౌకా నహీ దియా (నాకు మీరు తగిన సమయం ఇవ్వలేదు)’ అంటూ ఆశ్రునయనాలతో శాస్త్రీజీ పల్స్‌ను వదిలేశాడు డాక్టర్ చుఘ్. తాష్కెంట్‌లో అప్పుడు సమయం రాత్రి 1.32 గంటలు.
‘యువర్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ డైయింగ్’ అన్న ఒక రష్యన్ లేడీ విలేకరి మాటతో, నిద్రలో నుండి హుటా హుటిన లేచి చెప్పులు లేకుండానే తన గది నుండి ఆదుర్దాగా శాస్త్రిజీ బెడ్ రూవ్‌ు వైపు పరుగు తీశాడు ఆయన ప్రెస్ సెక్రెటరీ కులదీప్ నయ్యర్. అప్పటికే అంతా అయి పోయింది. ఆయన బెడ్ దగ్గర రష్యన్ ప్రధాని కోసిగిన్, పాక్ నేత ఆయూబ్ ఖాన్, ప్రధాని సహచరులు, మంత్రులూ అయిన స్వర్ణ సింగ్, యశ్వంత్ రావు చవాన్ దీన వదనాలతో శిల్పాల్లా నిలుచున్నారు. ఆ నిశాంత నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, పాక్ ప్రెసిడెంట్ అయూబ్ ఖాన్, కుల్దీప్ వైపు చూస్తూ ‘హియర్ ఈస్ ఏ మేన్ ఆఫ్ పీస్, హూ గేవ్ హిస్ లైఫ్ ఫర్ ఎమిటీ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్’ అంటూ వాపోయాడు.
ఆ రోజు మధ్యాహ్నం 2.30 గం.కు జాతీయ జెండాలో చుట్టిన ప్రధాని పార్థివ దేహంతో సోవియట్ ఎయిరోఫ్లోట్ విమానం తాష్కెంట్ నుండి ఢిల్లీ పాలవ్‌ు ఎయిర్ పోర్ట్ చేరు కుంది. అక్కడి నుంచి గన్ క్యారేజ్‌లో శాస్త్రీజీ డెడ్ బాడీని ఆ సాయంత్రం 4.10 గంటలకు 10, జనపథ్‌కు చేర్చారు. రోడ్డంతా శోకసంద్రంలో మునిగిన ఢిల్లీ వాసులతో నిండింది. ఏమీ తోచని ప్రధాని కుటుంబీకులు వారిస్తున్నా ఆగమేఘాల మీద ఏ పోస్టుమార్టం లేకుండానే అదే రోజు శాంతివన్‌లో శాస్త్రీజీ అంత్యక్రియలు జరిపారు.
ఊహించని రీతిలో నిష్క్రమించిన ప్రధాని లాల్ బహదూర్ స్థానంలో నూతన నాయకుణ్ణి ఎన్నుకోవటానికి, కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు సభ్యులు పలుమార్లు సమా వేశమయ్యారు. సీనియర్ కాంగ్రెస్ నేత మొరార్జీ దేశాయ్ ఈ పదవికి గట్టి పోటీ ఇచ్చారు. కరడు గట్టిన గాంధేయవాది అయినప్పటికీ దేశాయ్‌ది నిరంకుశ తత్వం. పార్టీ అధ్యక్షుడు కామరాజ్ నాడార్‌కు ఇది మింగుడు పడలేదు.
చాణక్య రీతితో దేశాయ్‌ని పోటీ నుండి తప్పించి, నెహ్రూ తనయ, ఇందిరా గాంధీ పేరును పార్లమెంటరీ బోర్డు నాయకురా లిగా తెరపైకి తేగలిగారు కింగ్ మేకర్ కామరాజ్. రేపో మాపో లండన్ బ్రిటిష్ హైకమిషనర్‌గా వెళ్లవలసిన అప్పటి ఇన్ఫర్మేషన్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్టర్ ఇందిర చేతిలోకి 1966 జనవరి 24న నాటకీయంగా దేశ ప్రధాని పగ్గాలు వెళ్లిపోయాయి.
జిల్లా గోవర్ధన్
వ్యాసకర్త విశ్రాంత ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ మొబైల్: 98190 96949
(అనూజ్ ధర్ పుస్తకం ‘యువర్ ప్రైమ్ మినిష్టర్ ఈజ్ డెడ్’, ఆధారంగా. నేడు లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి)
అసలు... ఆ రాత్రి ఏం జరిగింది?
Published Thu, Jan 11 2024 12:01 AM | Last Updated on Thu, Jan 11 2024 12:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment