గుజరాత్‌లోని మోర్బీ వద్ద జరిగిన తీగల వంతెన ప్రమాదం నిర్లక్ష్యానికి నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తోంది. పదుల మంది ఉత్తి పుణ్యానికి ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ పాలనా సామర్థ్య లోపం ఫలితంగానే ప్రజల్ని సరాసరి మృత్యువు నోట్లోకి నెట్టేసినట్లయిందని నివేదికలు చెబుతున్నాయి. మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? నెపం ఇంకెవరి మీదకో నెట్టేసి నాయకులు చేతులు దులిపేసుకుంటారా? ఒకప్పుడు లాల్‌బహదూర్ శాస్త్రి లాంటివారు రైలు ప్రమాదం జరిగినప్పుడు నైతిక బాధ్యత వహించి తమ పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగతంగా వారి దోషం లేకపోయినా ఒక ఉన్నతమైన ఆదర్శాన్ని నెలకొల్పారు. అలాంటి స్పందనను గుజరాత్ నాయకుల నుంచి మనం ఇప్పుడు చూడగలమా?
‘‘గుజరాత్‌లోని ‘మోర్బీ’ వద్ద 143 ఏళ్ల నాడు నిర్మించిన సస్పెన్షన్ బ్రిడ్జి ప్రసిద్ధ టూరిస్టు కేంద్రంగా ఉన్న ఆ పట్టణం గుండా ప్రవహించే మచ్ఛు నదిలో అకస్మాత్తుగా కూలిపోయిన ఫలితంగా వందలాదిమంది సందర్శకులు పిల్లాజెల్లాతో ఘోరమైన విషాదానికి గురయ్యారు. పైగా ఇటీవలనే మరమ్మత్తులు పూర్తయి పునఃప్రారం భమైన వంతెన కాస్తా కూలిపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. వంతెనల నిర్మాణంలో సరైన అనుభవం, నైపుణ్యం లేని ఒక ప్రయివేట్ కంపెనీకి వంతెన నిర్మాణ కాంట్రాక్టు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా, ఒకే సమయంలో 150 మందికి మించి భరించగల బ్రిడ్జి కాదని మాత్రం నివేదికలు తెల్పుతున్నాయి. వివిధ స్థాయుల్లో ప్రభుత్వ పాలనా సామర్థ్య లోపం ఫలితంగానే సరాసరి ప్రజల్ని మృత్యువు నోట్లోకి నెట్టేసినట్లయిందని నివేదికలు తెల్పుతున్నాయి. ఈ విషయమై పూర్తి విచారణ జరిపి, బాధ్యత ఎవరిదో తేల్చాలి. ఇందుకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి.’’
– ‘ది హిందూ’ సంపాదకీయం (1 నవంబర్ 2022)
ప్రజలు విషాద ఘటనల బారిన పడినప్పుడు పాలకులు కనీస నైతిక బాధ్యత వహించవలసిన అవసరం ఉందని లాల్ బహదూర్ శాస్త్రి గుర్తించారు. జవహర్‌లాల్ నెహ్రూ మంత్రివర్గంలోని సీనియర్ సభ్యు నిగా లాల్ బహదూర్ శాస్త్రి నెలకొల్పిన ‘సువర్ణ ప్రమాణాల్ని’ మరో సారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది 1956 ఆగస్టు. మహబూబ్‌నగర్ వద్ద ఘోరమైన రైలు ప్రమాదం జరిగింది. ఆ దుర్ఘట నలో 112 మంది చనిపోయారు. లాల్ బహదూర్ ఆ ఘటనకు కలత చెంది, తన పదవికి రాజీనామా చేస్తూ, ఆ లేఖను నెహ్రూకు పంపారు. ‘వద్దు, వద్దు’ అని నెహ్రూ నివారించడంవల్ల, లాల్‌బహదూర్ తాత్కా లికంగా ఆగారే గానీ అరియలూర్ (తమిళనాడు)లో అదే సంవత్సరం మరో రైలు ప్రమాదం జరిగి 144 మంది మరణించారు. ఈ రెండు వరుస విషాదకర ఘటనలతో లాల్‌బహదూర్ ఆవేదన నిలుపుకోలేక వెంటనే నెహ్రూకు రాజీనామా లేఖ సమర్పిస్తూ... ‘ఇక నన్ను ఒత్తిడి చేయవద్దు, వెంటనే ఆమోదించవలసింది’ అని కోరారు.
ఆ విషయమై నెహ్రూ లోక్‌సభలో ఒక ప్రకటన చేస్తూ లాల్ బహదూర్ నిర్ణయం పట్ల అత్యంత గౌరవాన్ని వ్యక్తం చేశారు. ‘‘విశాల మైన మనస్సుతో ఆలోచిస్తే, ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు మనం ఆదర్శంగా నిలబడటం రాజ్యాంగ విలువల దృష్ట్యా గొప్ప ఉదాహరణగా నిలిచిపోతుంది. ఇలాంటి సందర్భాల్లో ఏది ఏమైనా సరే మనం పట్టించుకోకుండా తలొంచుకుని పోదామనే ధోరణి సరై నది కాదు’’ అని నెహ్రూ చెబుతూ రాజ్యాంగ మర్యాదను పాటిం చడం ధర్మమని ప్రకటించాల్సి వచ్చింది. అయితే నెహ్రూ ప్రకటనను పత్రికలు తప్పుబట్టాయి. 30 మంది పార్లమెంట్ సభ్యులు కూడా లాల్‌బహదూర్ రాజీనామాను అంగీకరించ‘వద్దు్ద’ అని నెహ్రూకు విజ్ఞప్తి చేశారు. శాస్త్రి వ్యక్తిగతంగా రైలు ప్రమాదాలకు కారకుడు కారు గనుక రాజీనామాను ఆమోదించవద్దని విజ్ఞప్తి చేశారు. అయినా లాల్ బహదూర్ నిర్ణయాన్ని ఎవరూ ఆపలేకపోయారు.
‘లాల్ బహదూర్ శాస్త్రి – రాజకీయాలు ఆపైన’ (పాలిటిక్స్ అండ్ బియాండ్) అన్న గ్రంథంలో ప్రసిద్ధ వ్యాఖ్యాత సందీప్ శాస్త్రి ఈ విషయం గురించి చెబుతూ – ‘‘లాల్‌బహదూర్ నెలకొల్పిన ఉత్తమ సంప్రదాయం దేశ చరిత్రలో, నాయకుల చరిత్రలో ఒక ఉన్నత ప్రమా ణాన్ని నెలకొల్పింది. ఇతరులు ఆ ప్రమాణాన్ని పాటించక పోవచ్చు. కానీ, రాజకీయ ప్రమాణాలకు, వైశిష్ట్యానికి లాల్‌బహదూర్ నెల కొల్పిన ఆదర్శాలు ఉన్నతమైనవి’’ అన్నారు. రెండు రైలు ప్రమాద దుర్ఘటనల తర్వాత ఆరు దశాబ్దాలు గడిచిపోయాయి. అయినా ఇప్ప టికీ లాల్‌బహదూర్ శాస్త్రి ఆదర్శం, నెలకొల్పిన నైతిక విలువల వైశి ష్ట్యాన్ని గురించి అంచనాలు కొనసాగుతూనే ఉన్నాయి.
గుజరాత్ ‘మోర్బీ’ బ్రిడ్జి కంటే ముందే, సుమారు 150 ఏళ్లనాడు గోదావరి నదిపై ఆనకట్ట తలపెట్టారు సర్ ఆర్థర్ కాటన్. కాలం ముగియకముందే జాగ్రత్తలు తీసుకుంటే వంతెన ఆయుష్షును పెంచు కోవచ్చునని చెప్పిన మహనీయుడు కూడా ఆయన. కరువు కాటకాల వాతబడి కోట్లాదిమంది గోదావరి జిల్లాల ప్రజలు అల్లల్లాడిపోతున్న సమయంలో ఆనకట్ట నిర్మాణం కోసం తన బ్రిటన్ సామ్రాజ్య పాల కులపైనే ఒత్తిడి తెచ్చిన ధీశాలి కాటన్. ‘మన (బ్రిటన్) డబ్బంతా తీసుకుపోయి అక్కడ పోస్తే, మనకేం లాభం?’ అని బ్రిటిష్ పాలకులు కాటన్‌కు పాఠం చెప్పబోతే, వారి బుర్రల్ని తెలివిగా ‘చిత్రిక పట్టి’ గోదావరి జిల్లాలను కరువు కాటకాల నుంచి రక్షించారు కాటన్. ‘నీకు ఆదాయం రావాలన్నా ముందుగా ప్రజలు బతికి బట్టకట్టాలి కదా. తద్వారా పన్నుల రూపంలో వచ్చే ఆదాయం మన బ్రిటన్‌కే వస్తుంది కదా’ అని పాఠం చెప్పారు. అలా ఉభయతారకంగా వ్యవహరించిన రాజనీతిజ్ఞుడు కాటన్. అందుకే ఈ రోజుకీ గోదావరి జిల్లాల ప్రజలు చిన్నాపెద్దా ఏ శుభముహూర్తాలు తమ ఇళ్లలో జరిగినా ‘కాటనాయ నమః’ అని కీర్తించుకుంటూ ఉంటారు.
నదుల మధ్య అనుసంధానం నెలకొల్పి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో నాడు మగ్గుతున్న ఆంధ్ర ప్రాంతాలలో జలవనరుల అవసరం తీర్చడానికి శ్రద్ధతో స్కీములు వేసిన మహనీయుడు కాటన్. ఆంధ్ర రాజకీయ, సామాజిక, వివిధ నిర్మాణ రంగాలలో ఉద్దండులైన ముక్త్యాల రాజా, ఇంజనీర్ కె.ఎల్. రావు, మోటూరు సత్యనారాయణ, ఆచార్య రంగా ఇత్యాది ప్రభృతులు కాటన్ కృషిని మరింతగా ముందుకు తీసుకువెళ్లారు. నెహ్రూ ఆశీస్సులతో బహూళార్ధ సాధక నాగార్జున సాగర్ ప్రాజెక్టు లాంటి నిర్మాణాన్ని సుసాధ్యం చేసు కోగలిగారు. అంతేగాదు, కాటన్ మహాశయుడు దక్షిణాది రాష్ట్రాల సౌభాగ్య గరిమకు చేదోడువాదోడు కావడమేగాక, ఉత్తరాది సరిహద్దు లలో తిష్ఠ వేసిన బ్రహ్మపుత్రతో వియ్యమందుకుని, ఆంధ్ర మున్నగు దక్షిణ భారత రాష్ట్రాలకు జల విద్యుత్ సౌభాగ్యాన్ని అందించాలని కూడా పథకాలు వేశాడు. అసలు బ్రహ్మపుత్ర ఆధారంగా మధ్య భారతం దన్నుగా యావద్భారతం నలుమూలలకూ ఆరుగాలమూ జల, విద్యుత్ సంపద పంపిణీ అయ్యేందుకూ బృహత్ పథకం రచిం చాడు. ఆ స్ఫూర్తితోనే మన కె.ఎల్. రావు, శొంఠి రామ్మూర్తి ప్రభృతులు మరికొన్ని పథకాలు రూపొందిస్తూ వచ్చారని మరవరాదు.
కానీ, ఎందుకని ఈ మహనీయుల కృషిని మరింత ముందుకు తీసుకుపోవడంలో దేశీయ పాలకులు విఫలమవుతున్నారు? ఎందుకు వారిలా శ్రద్ధ చూపడం లేదు? రాజ్యాంగం గుర్తించిన ఫెడరల్ వ్యవస్థ స్వరూప స్వభావాల్ని నాశనం చేస్తూ ‘ఒక దేశం, ఒకే ఎన్నిక’... ఒకడే నాయకుడు, ఒకటే పార్టీ అని మాత్రం యాగీ చేస్తున్నారు. ప్రణాళికా వ్యవస్థ రద్దయింది. ప్రభుత్వ రంగాన్ని చాపచుట్టి, కార్పొరేట్ గుజరాత్ రాజ్యం యావద్భారతాన్ని చుట్టబెడుతోంది. ‘భారత ప్రజలమైన మేము మాకుగా భారత రాజ్యాంగాన్ని రూపొందించుకుని అంకిత మిచ్చుకుంటున్న మౌలిక పత్రం ఇది’ అని రాజ్యాంగం ముందు మాటలోనే స్పష్టం చేసినా – పాలకుల చేతుల్లో దాని ముఖ వర్చస్సు అంతా చెదిరిపోయింది. కనుకనే నేటి దుర్బుద్ధులూ, పెడబుద్ధులూ! రోజుకో తీరు చొప్పున చెదిరిపోతున్న మౌలిక రాజ్యాంగ స్ఫూర్తి. ఇది నిలవాంటే, పౌర బాధ్యతల అధ్యాయపు కనీస విలువను కాపాడు కోవడానికైనా ఉద్యమించవలసిన అవసరం ఉంది. 2024 వచ్చేలోగానే పౌర సమాజం తన గాఢ నిద్రను వదిలించుకోగలగాలి!
అవును మరి –
‘‘ఏది పలికినా శాసనమైతే ఎందుకు వేరే జనవాక్యం
ఏది ముట్టినా కాంచనమైతే ఏది శ్రమశక్తికి మూల్యం?’’
– సినారె
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment