![Dandamraju Ramchander Rao's Comments On The West Bengal Train Accident](/styles/webp/s3/article_images/2024/06/24/bengal-train.jpg.webp?itok=Qjn5kYwW)
పశ్చిమ బెంగాల్‌లోని రంగపాణి రైల్వే స్టేషన్ సమీపంలో మరో ఘోర రైలు ప్రమాదం జరిగింది. డౌన్ కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు వెనుక నుండి ఢీకొట్టడంతో చాలా మంది మరణించారు. అనేకమంది గాయపడ్డారు. రైల్వేవారు భద్రతా ప్రమాణాల పట్ల సరియైన శ్రద్ధ, చిత్తశుద్ధి కనపరచడం లేదనటానికి ఈ ప్రమాదం ఒక నిదర్శనం. ఈ ప్రమాదం అనేక ప్రశ్నలు రేకెత్తిస్తోంది. గూడ్స్ రైలు నిర్దేశించిన వేగం కంటే అధిక వేగంతో నడపడానికి ఎందుకు అనుమతించారు? అసలు రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పై వెళ్ళటానికి బాధ్యులు ఎవరు?
ఈ సంఘటన మానవ తప్పిదమని, దుర్ఘటనకు గూడ్స్‌రైలు డ్రైవర్ కారణమని రైల్వే వర్గాలు తెలుపుతున్నాయి. ఈ సందర్భంగా మానవ వనరుల కొరత సంగతీ వెలుగులోకి వస్తోంది. లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలను దాదాపు ఇరవై వేలు ఏళ్లతరబడి నింపకుండా వదిలేశారు. ఈ మానవ వనరుల కొరత... రైలు డ్రైవర్లు ఎక్కువ షిఫ్టులలో పనిచేయడానికి దారితీస్తోంది. ఫలితంగా ఘోరమైన ప్రమాదాలు జరుగుతున్నాయి.
2016లో ప్రారంభించిన ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ (కవచ్)ను ఫీల్డ్ ట్రయల్స్ కోసం కేవలం 1,500 కిలోమీటర్ల కంటే తక్కువ రైల్వే ట్రాక్‌లలో మాత్రమే ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. భారతీయ రైల్వేల మొత్తం ట్రాక్ దాదాపు 70 వేల కిలోమీటర్లు. కాలానుగుణంగా అవసరాలకు తగ్గట్టు కవచ్ వంటి భద్రతా వ్యవస్థల ఏర్పాటుతోపాటు, మౌలిక సదుపాయాల ఆధునికీకరణ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి.
నాణ్యతతో కూడిన భద్రతా పరికరాలు ఏర్పాటు చేయాలి. ఈ దుర్ఘటనపై న్యాయవిచారణ జరిపి బాధ్యులైన వారిని గుర్తించి శిక్షించాలి. అదేవిధంగా ఇటువంటి దుర్ఘటనలు మునుముందు ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా ప్రభుత్వం, రైల్వే బోర్డు వారు, రైల్వే శాఖలోని అన్ని విభాగాల ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు, సాంకేతిక నిపుణులు, మేధావులు, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కూడిన ఒక సంఘాన్ని ఏర్పాటు చే సి; దాని సూచనలతో కఠినమైన భద్రతా నియమ నిబంధనలు రూపొందించాలి.
వీటిని కఠినంగా అమలుపరచడానికి అవసరమైతే పార్లమెంట్‌లో ఒక చట్టం చేయాలి. రైల్వేలోని అన్ని విభాగాలలో ఖాళీలను వెనువెంటనే భర్తీ చేయాలి. ఆధునిక అత్యంత సాంకేతికతతో వేగంగా నడిచే ‘వందే భారత్’ రైళ్ళతో సమానంగా అదే స్థాయిలో భద్రతతో కూడిన సురక్షితమైన ప్రయాణ పరిస్థితులు కల్పించినప్పుడే భారత రైల్వే పట్ల ప్రయాణికులకు ఒక భరోసా కలుగుతుంది. – దండంరాజు రాంచందర్ రావు, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment