పార్లమెంట్‌ను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగం, లోక్‌సభలో స్పీకర్ వ్యవహార శైలి, జూలై 1 నుంచి అమలులోకి వచ్చిన కొత్త నేర చట్టాలు వంటి వాటిని గమనిస్తే 50 ఏళ్ల నాటి ఎమర్జెన్సీ చీకటి రోజులు మళ్లీ రాబోతున్నాయనిపిస్తోంది. ముఖ్యంగా కొత్త క్రిమినల్ చట్టాలు ప్రజాస్వామికవాదులనూ, పౌరహక్కుల కార్యకర్తలనూ ఉక్కుపాదంతో అణచేలా ఉన్నాయి.
గుజరాత్ నమూనా అంటూ ఊదరగొట్టిన మోదీ– అమిత్ షాలు దశాబ్ద కాలంగా చేస్తున్న నరమేధపు రక్తపు మరకలను ఎమర్జెన్సీ బూచి చూపి తుడిచి వేయలేరు. బిల్కిస్ బానో కేసులో ముద్దాయిలను స్వాగత సత్కారాలతో విడుదల చేయటం, డేరా బాబా లాంటి వారికి పెరోల్ ఇవ్వటం, గోవింద్ పాన్స్‌రే, స్టాన్ స్వామి లాంటి వారి ప్రాణాలను హరించి, ప్రొఫెసర్ సాయిబాబా లాంటి వారిని ఆరు సంవత్సరాలు నేరం నిరూపణ కాకుండానే నిర్బంధించటం, వరవరరావు, సుధా భరద్వాజ్‌లను అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో ఎట్టకేలకు విడుదల చేయటం... వంటివన్నీ మోదీ పాలన ఎంత అమానవీయంగా, అన్యాయంగా సాగుతున్నదో తెలిపే కొన్ని ఉదాహరణలు మాత్రమే.
ప్రాథమిక హక్కులను కాలరాసేలా ఉపా, దేశ ద్రోహం, మనీ లాండరింగ్ చట్టాలను రాజ్యాంగ విరుద్ధంగా సవరించారు. డా‘‘ నరేంద్ర దాభోల్కర్, కామ్రేడ్ గోవింద్, ప్రొఫెసర్ ఎమ్‌ఎమ్ కల్బుర్గి, గౌరీ లంకేశ్ ప్రాణాలను బలిగొన్నారు. ఇటువంటి తరుణంలో అమలులోకి తెచ్చిన కొత్త నేర చట్టాలు పోలీసులకు అపరిమిత అధికారాలను దఖలు పరుస్తున్నాయి.
కేసులు నమోదు చేయడంలో వారికి హద్దూ అదుపూ లేకుండా చేస్తున్న ఈ చట్టాలు మానవహక్కుల కార్యకర్తలూ, రాజకీయ కార్యకర్తల మనుగడనే కాదు, సామాన్యుల బతుకులనూ ప్రశ్నార్థకం చేస్తున్నాయి. కాబట్టి ఈ చట్టాలను వెంటనే ఉపసంహరించుకునేలా ప్రజలు ఉద్యమించాలి. – దినవహి హరినాథ్, సీపీఐ (ఎమ్‌ఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment