ఇప్పుడిక మనం 18వ లోక్‌సభను ఎన్నుకున్నందున ప్రాథమికమైన రెండు ప్రశ్నలను లేవనెత్తాల్సిన సమయం ఆసన్నమయింది. మొదటిది– లోక్‌సభ మన ఆశలకు అనుగుణంగానే పని చేస్తోందా? రెండవది – కేవలం పాలక పక్షాలు చెప్పింది వినడం వరకే కాక, భారత ప్రజల గొంతును కూడా వినిపించేందుకు తగినంతగా సమయాన్ని సాధించేలా ప్రతిపక్షాన్ని ఒప్పించటానికి ఎలాంటి మార్పులు అవసరం?
17వ లోక్‌సభ కేవలం 1,354 గంటలు మాత్రమే పని చేసిందని పీఆర్‌ఎస్ (పాలసీ రీసెర్చ్ స్టడీస్) లెజిస్లేటివ్ రీసెర్చ్ ప్రచురించిన వాస్తవాలు తెలియజేస్తున్నాయి. మొత్తం అన్ని పూర్తి–కాల లోక్‌సభల పనిగంటల సగటు కంటే నలభై శాతం తక్కువగా 1,615 గంటలు మాత్రమే పని చేసిన 16వ లోక్‌సభ కన్నా కూడా ఇది తక్కువ. నిజానికి 17వ లోక్‌స¿¶ 15 సమావేశాలలో 11 సమావేశాలు నిర్దిష్ట సమయానికి ముందే వాయిదా పడ్డాయి. మొత్తం అన్ని పూర్తి–కాల లోక్‌సభలలో ఒక్క 17వ లోక్‌సభ మాత్రమే అతి తక్కువగా కేవలం 274 సార్లు మాత్రమే సమావేశం అయింది.
ఏడాదికి 135 రోజులు సమావేశం అయిన తొలి లోక్‌సభతో పోల్చి చూస్తే 17వ లోక్‌సభ ఏడాదికి కేవలం 55 రోజులు మాత్రమే సమావేశమైంది. ఇది చట్ట నిర్వహణ విధానంపై స్పష్టమైన ప్రభావం చూపింది. బిల్లులు చాలావరకు వాటిని ప్రవేశపెట్టిన రెండు వారాల లోపే ఆమోదం పొందాయి. 35 శాతం బిల్లులు గంట కంటే తక్కువ చర్చతోనే చట్టరూపం దాల్చాయి. పార్లమెంటరీ కమిటీల పరిశీలన కోసం కేవలం 16 శాతం మాత్రమే వెళ్లాయి. ఆ ముందరి మూడు లోక్‌సభలలో పరిశీలనకు వెళ్లినవాటి కంటే ఇది తక్కువ.
అంటే, లోక్‌సభ పని గంటలు తగ్గిపోతుండటమే కాకుండా, అందులోనూ మళ్లీ... బిల్లుల నిశిత పరిశీలన, బిల్లులపై జరగవలసిన అర్థవంతమైన చర్చల విషయంలో లోక్‌సభ సామర్థ్యం క్షీణించిపోతోంది! లోక్‌సభ అతి ముఖ్యమైన విధులలో ఈ బిల్లుల చర్చ–పరిశీలన ఒకటి కనుక అది మన అంచనాలకు తగ్గట్లుగా లేదని మనం నిస్సంకోచంగా అనుకోవచ్చు. దీనికి పరిష్కారం సరళమైనది, స్పష్టమైనది. అదేమిటంటే, లోక్‌సభలు ప్రతి సంవత్సరం కనీసం ఇన్ని రోజులని నిర్దిష్టంగా సమావేశం అవ్వాలి. బిల్లులు ఆమోదం పొందటానికి ముందు సవివరమైన పరిశీలన కోసం వాటిని పార్లమెంటరీ కమిటీలకు పంపాలి.
మరొకటి – ఎంతో క్లిష్టమైనదీ – లోక్‌సభ పనితీరుకు ప్రభుత్వం బాధ్యత వహించేలా చేయటం! ఇక్కడే పాలకపక్షం తమ గొంతును వినటం లేదని ప్రతిపక్షాలు చేస్తున్న వాదనను పరిగణనలోకి తీసుకుని పరిష్కరించవలసిన అవసరం ఉంది. అలా చేస్తే తప్ప ప్రభుత్వాన్ని అర్థవంతంగా ప్రశ్నించటం, సవాలు చేయటం కుదరదు. మరి దీన్నెలా మనం సాధించాలి?
దీనికొక కుదురైన పరిష్కారం హౌస్ ఆఫ్ కామన్స్ పాటించే విధానాన్ని స్వీకరించటం! ప్రతి సమావేశాలలోనూ కొన్నిరోజులు ప్రతిపక్షాలే అజెండాను నిర్ణయించేలా చేయటం. బ్రిటన్‌లో వాటిని ‘ప్రతిపక్షాల రోజులు’ అంటారు. ప్రతి పార్లమెంటు సమావేశంలో అవి 20 ఉంటాయి. ప్రధాన ప్రతిపక్షానికి 17, రెండవ అతిపెద్ద ప్రతిపక్షానికి 3 రోజులు.
మనం అనుసరించదగిన బ్రిటిష్ పార్లమెంటరీ విధానాలలో రెండవది... పీఎంక్యూస్ (ప్రైమ్ మినిస్టర్స్ క్వశ్చన్స్). సమావేశాలు జరుగుతున్న కాలంలో ప్రతివారం ఒక నిర్ణీత రోజున పూర్తిగా ఒక అరగంట పాటు ప్రతిపక్షాల ప్రశ్నలకు ప్రధానే నేరుగా సమాధానం చెబుతారు. వాటిల్లో కనీసం ఆరు ప్రశ్నలను ప్రతిపక్ష నేత అడుగుతారు.
పీఎంక్యూస్ అని బ్రిటన్‌లో వాడుకలో ఉన్న ఈ ప్రశ్నా సమయం అమితమైన ప్రజాసక్తిని కలిగి ఉంది. పీఎం, ప్రతిపక్ష నేతల బలాలను, బలహీనతలను బహిర్గతపరిచే ఉత్తేజభరితమైన క్షణాలు అవి. వారి సమాచార లేమి, సామర్థ్య లోపం ఇట్టే తెలిసిపోతాయి. పీఎంక్యూస్ బ్రిటన్‌కొక గవాక్షం వంటిది కూడా! తమ నాయకుడు ఎంతటి ఘనుడో ప్రజలు చూస్తారు. ఒక అంచనాకు వస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే, ప్రజాస్వామ్యం పని చేస్తోందా, లేక పట్టుతప్పుతోందా అనేదానికి పీఎంక్యూస్ ఒక రుజువు.
ఈ సంప్రదాయాలను మనం స్వీకరించినట్లయితే, ప్రజాస్వామ్యం పట్ల అవి మన విశ్వాసాన్ని పెంపొందింపజేస్తాయి. తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలన్న ప్రతిపక్షాల ప్రయత్నానికి అవి మద్దతును ఇస్తాయి. భిన్నమైన అభిప్రాయాలు, వాదనలకు చర్చావేదిక దొరికిందన్న నమ్మకాన్ని భారత ప్రజలకు కల్పిస్తాయి.
చివరిగా, కోల్పోయిన విశ్వాసాన్ని నిజంగా పాదుకొల్పడానికి మనం స్పీకర్ స్థానం విషయమై కూడా మార్పులు చేసుకోవలసిన అవసరం ఉంది. స్పీకర్‌గా ఎంపికైన వారు వెంటనే తమ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాలి. అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి నిష్పక్షపాతంగా, పార్టీలకు అతీతంగా ఉండగలరని నమ్మగలం. ఆమె లేదా అతడు తర్వాతి లోక్‌సభకు కూడా కొనసాగాలని అనుకుంటే వారి ఎన్నిక పోటీ లేకుండానే జరగాలి. అదంతా కూడా ఎలాగూ వారి స్వభావం, ప్రవర్తన మీద ఆధారపడి ఉన్నప్పటికీ వార్ధక్య వైకల్యాలు లేకుండాలి.
ఇవి స్పష్టమైన పరిష్కారాలే కానీ ప్రభుత్వం ఆమోదించినప్పుడు మాత్రమే సంభవమౌతాయి. కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా ప్రతిపక్షమే స్వయంగా ఈ మార్పులను సిఫారసు చేయవచ్చు. అందుకు బీజేపీ కనుక నిరాకరిస్తే భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి వంటిది అని చెప్పుకోవటాన్ని ఆ పార్టీ కొనసాగించగలదా? అప్పుడు తల్లి అని కాకుండా సవతి తల్లి అని చెప్పుకోవటమే సరిగ్గా ఉంటుందా?
– కరణ్ థాపర్, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment