కఠిన వాస్తవాలను దాచేస్తారా? | Sakshi Guest Column On Santosh Movie | Sakshi
Sakshi News home page

కఠిన వాస్తవాలను దాచేస్తారా?

Published Mon, Apr 7 2025 12:03 AM | Last Updated on Mon, Apr 7 2025 12:03 AM

Sakshi Guest Column On Santosh Movie

వివాదాస్పద చిత్రం ‘సంతోష్‌’లో షహానా గోస్వామి

కామెంట్‌

ఆమె పేరు సూచిస్తున్నట్టుగానే సంధ్యా సూరి భారత సంతతికి చెందిన ఫిల్మ్‌ మేకర్‌. ఆమె దర్శకత్వం వహించిన ‘సంతోష్‌’ సినిమా గత ఏడాది యూకే తరఫున అధికారిక ఎంట్రీగా ఆస్కార్స్‌కు వెళ్లింది. కాన్‌ (ఫ్రాన్స్‌) చిత్రోత్సవంలో విశేష మన్ననలు అందుకుంది. ‘బాఫ్టా’ (బిఏఎఫ్‌టీఏ– ద బ్రిటిష్‌ అకాడెమీ ఆఫ్‌ ఫిలిం అండ్‌ టెలివిజన్‌ ఆర్ట్స్‌)కు నామినేట్‌ అయ్యింది. 

ఇందులో నటించిన షహానా గోస్వామి ఏసియన్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌లో ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు. ఇంత ఖ్యాతి గడించినప్పటికీ, కోట్లాది మంది భారతీయులు మాత్రం ఈ సినిమాను ఎప్పటికీ చూడలేరు. సెన్సార్‌ బోర్డు (సీబీఎఫ్‌సీ– సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌) దీనికి దారుణమైన కత్తెరలు వేసింది. వాటికి అంగీకరిస్తేనే భారత్‌లో ప్రదర్శనకు అనుమతి ఇస్తామని చెప్పడంతో, సంధ్యా సూరి సహజంగానే అందుకు నిరాకరించారు.

పూర్తిగా భారత్‌లోనే నిర్మించిన, భారతీయ నటీనటులతోనే చిత్రీకరించిన, అదీ హిందీలో తీసిన చిత్రం ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే పూర్తి భారతీయ చిత్రం. కానీ భారతీయులమైన మనం దీన్ని వీక్షించలేక పోవడం మన దౌర్భాగ్యం. ఎందుకంటే, మనం కాదనలేని ఒక సత్యాన్ని ఇది ఆవిష్కరించింది. దాన్ని మనకు తెలియకుండా దాచి ఉంచగలనని సెన్సార్‌ బోర్డు అనుకుంటోంది. నేను ప్రస్తావిస్తున్న ఈ సత్యం పోలీసుల కర్కశత్వం, వారు పెట్టే చిత్రహింసల గురించి!

ఈ సినిమా నేను చూశాను. ఇది అంతులేని బాధ కలిగిస్తుంది. మనసును విపరీతంగా కలవరపెడుతుంది. ఉత్తర భారత గ్రామీణ ప్రాంతాల్లో సాగే పోలీసుల దాష్టీకానికి ఇది వాస్తవ చిత్రీకరణ. అమాయక ప్రజలను పోలీసులు ఎలా టార్చర్‌ పెట్టగలరో, దళితులు, ముస్లింలు వారి చేతిలో ఎన్ని దుర్మార్గాలకు గురవుతున్నారో, మానభంగాలను ఏ విధంగా వారు వెనకేసుకొస్తారో, సాధారణ ప్రజానీకాన్ని ఎంతగా భయభ్రాంతులకు గురిచేస్తారో ఈ సినిమా కళ్లకు కడుతుంది. 

పుట్టుక, సంపద, పలుకుబడి... ఈ మూడింటిలో ఏ బలమూ లేకుండా పోలీసులతో వ్యవహరించే ప్రతి ఒక్కరికీ ఇది సత్యమని, ఇదే వాస్తవమని తెలుసు. ఈ య«థార్థం వారికి ఆశ్యర్యం కలిగించదు, వారిని దిగ్భ్రాంతికి అసలు గురి చేయదు. ఎందుకంటే వారికి పోలీసుల వైఖరి నిత్యజీవిత అనుభవం. కానీ సెన్సార్‌ బోర్డు దీన్ని సమ్మతించడానికి ఇష్టపడటం లేదు. గుర్తించడానికి అంగీకరించడం లేదు.   

పోలీసుల హింస, జవాబుదారీతనం లేకపోవడం గురించి ‘పోలీస్‌ టార్చర్‌ అండ్‌ (అన్‌) అకౌంటబిలిటీ’ పేరుతో ‘కామన్‌ కాజ్‌’, ‘లోక్‌నీతి సీఎస్‌డీఎస్‌’లు ఇటీవలే సంయుక్తంగా ప్రచురించిన ఒక నివేదిక ఈ సినిమా వాస్తవికతను ధ్రువీకరిస్తోంది. 17 రాష్ట్రాల్లో 8,000 మందికి పైగా పోలీసులను ఈ సంస్థలు సర్వే చేశాయి. వారిలో రమారమి 30 శాతం మంది చిత్రహింసలను సమర్థించారు. ప్రమాదకరమైన నేరగాళ్లను విచారణ ముగిసే వరకూ వేచిచూడకుండా చంపేయడమే మెరుగు అని దరిదాపు 25 శాతం మంది తేల్చి చెప్పారు. 

ప్రజల్లో భయం ఉండాలంటే కఠిన పద్ధతులు అవలంబించాల్సిందే అంటూ 20 శాతం మంది వెల్లడించారు. ముస్లింలు నేరప్రవృత్తికి లోనయ్యే అవకాశం ఉందని 50 శాతం మంది చెప్పడం ఆశ్చర్యకరం. ఇక, ‘స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌’ (ఎస్‌ఓపీ)ను పాటించడం ఎప్పుడో తప్ప జరగదని 40 శాతం కంటే ఎక్కువ మందే అంగీకరించారు. అందుకే కాబోలు... కేవలం 33 శాతం మంది భారతీయులే పోలీసులను విశ్వసిస్తారని ‘ఇప్సాస్‌’ సర్వే (యూకే) నిర్ధారించింది. వీటిలో ఏదీ మనకు ఆశ్యర్యం కలిగించదు. ఎవరూ చెప్పనవసరం లేకుండానే ఇవన్నీ నిజాలేనని మనకు సహజంగానే తెలుసు. 

పోలీసుల దాష్టీకాన్ని వెల్లడించే అధ్యయనాలకు కొరత లేదు. ‘నేషనల్‌ క్యాంపేన్‌ ఎగైనెస్ట్‌ టార్చర్‌’ వార్షిక నివేదిక (2019) ప్రకారం, ఆ ఏడాది 1,723 కస్టడీ చావులు వెలుగు చూశాయి. అంటే పోలీసు కస్టడీలో రోజుకు అయిదుగురు ప్రాణాలు విడిచారు. ఈ అధ్యయ నాలు బట్టబయలు చేసిన వాస్తవాలకే ‘సంతోష్‌’ సినిమా కర్కశ, వాస్తవిక దృశ్యరూపం ఇచ్చింది. అయినా సరే, భారతీయలు ఈ సినిమా ఎప్పటికీ చూడలేరు. ఏదైనా అద్భుతం జరిగి సెన్సార్‌ బోర్డు మనసు మారితే తప్ప!

ముచ్చటైన విషయం ఏమిటటే, ఇండియాలో చిత్రీకరణ కోసం అనుమతి కోరుతూ సంధ్యా సూరి తన సినిమా స్క్రిప్టును అధికా రులకు సమర్పించినప్పుడు ఎలాంటి అభ్యంతరాలూ వ్యక్తం కాలేదు. ‘గార్డియన్‌’ వార్తాపత్రికకు ఆమె ఇదే చెప్పారు. ‘ఇప్పుడు చాంతాడు పొడవన్ని కట్స్‌ జాబితా ఇచ్చారు. ఈ సెన్సార్‌ కోత లన్నీ కలిపి పేజీలకు పేజీలు ఉన్నాయి’. వాటికి అంగీకరించడం ‘అసాధ్యం’. ఎందుకంటే, సినిమా ‘విజన్‌’ పూర్తిగా దెబ్బతింటుందని ఆమె వాపోయారు.

నేను ఈ సినిమా చూసిన ప్రభావంతో చెబుతున్నాను. ఇది తప్పనిసరిగా చూడాల్సినది. బాలీవుడ్‌ సినిమాల్లో కూడా పోలీసు జులుం తరచూ కనబడుతూనే ఉంటుంది. అయితే, అది మృదువుగా, ప్రభావ శూన్యంగా ఉంటుంది. సానుకూల కోణం కూడా సమాంతరంగా నడుస్తుంది. కానీ ‘సంతోష్‌’ అలాకాదు.

అందులో ఎలాంటి చక్కెర పూతా ఉండదు. కర్కశమైన, ఉపశమన రహితమైన వాస్తవికతను చూపిస్తుంది. చూడటం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ వాస్తవాన్ని చూడకుండా మనం ఎలా కళ్లు మూసు కుంటాం? అది తగిన పని కాదు. అయినా మనం సత్యాన్ని తిరస్కరిస్తూనే పోతున్నాం. ‘సంతోష్‌’ అలాంటి తిరస్కారాల జాబితాలో తాజాగా చేరింది. 

చిత్రహింసలకు వ్యతిరేకంగా రూపొందించిన ఐక్యరాజ్య సమితి ఒప్పందం (యునైటెడ్‌ నేషన్స్‌ కన్వెన్షన్‌ ఎగైనెస్ట్‌ టార్చర్‌)పై సంతకం చేయని అతి కొద్ది దేశాల్లో ఇండియా ఒకటి. అలా ఆమోదించకపోవడానికి... కస్టడీ హింసను నిరోధించే సొంత చట్టం ఏమైనా ఉందా అంటే అదీ లేదు. నిజానికి ఇవి మనం ఎప్పుడూ చర్చించని యథార్థాలు. ఎప్పుడైనా ప్రస్తావన వచ్చినా, ఆ వెంటనే మర్చిపోతాం.    

ఒకవేళ ‘సంతోష్‌’ను మనం చూడడం జరిగితే... ఇలా ఎందుకు జరుగుతుందని ప్రశ్నించే అవకాశం అది ఇస్తుంది. ఈ దారుణాలు ఎందుకు అనుమతిస్తున్నారు? ఇది ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది? అని నిలదీస్తాం. బహుశా అందుకే సెన్సార్‌ బోర్డు మనం ఎప్పటికీ ఈ సినిమా చూడకుండా జాగ్రత్త పడింది. సత్యమేవ జయతే!

కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement