
చిక్కుల్లో జస్టిస్ యశ్వంత్ వర్మ (ఫైల్ ఫొటో)
కామెంట్
జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో పెద్ద మొత్తంలో అక్రమ నగదు కనిపించినట్లు గత వారం ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ బయట పెట్టింది. అంతకు మునుపు, జస్టిస్ శేఖర్ యాదవ్ న్యాయవ్యవస్థ గౌరవప్రతిష్ఠలకు భంగం కలిగిస్తూ మాట్లాడారు. భారతదేశం మెజారిటీ ప్రజల ఆకాంక్షల మేరకు పని చేస్తోందని జస్టిస్ శేఖర్ యాదవ్ గత డిసెంబరులో ఒక ప్రైవేటు కార్యక్రమంలో అనడం వివాదాస్పదమయింది. అప్పుడు ఆయనపై సరైన చర్యలు తీసుకోలేదు.
ఇప్పుడీ రెండో కేసులో అంతటా నిరసన పెల్లుబుకటంతో ఆలస్యంగా చర్యలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ ఒక కీలకమైన ప్రశ్న ఉత్పన్నమవుతోంది. న్యాయవ్యవస్థ స్పందనలు అర్థవంతంగా, బాధ్యతాయుతంగా ఉంటున్నాయా? లేవని సమా ధానం చెప్పుకునేటట్లయితే, జ్యుడీషియరీ జవాబుదారీతనం కోసం పనిచేయాల్సిన అంతర్గత విచారణ యంత్రాంగం ఏం చేస్తున్నట్లు? ఇక న్యాయమూర్తుల ఎంపిక విధానం ఈ పరిస్థితికి దారి తీసిన రెండో సమస్య. హైకోర్టు స్థాయిలో జరిగే నియామకాల తీరు మరీ ఆందోళన కలిగిస్తోంది.
న్యాయవ్యవస్థ జవాబుదారీతనాన్ని కాపాడవలసిన అంతర్గత యంత్రాంగం (ఇన్–హౌస్ మెకానిజం) గుణదోషాల్ని జస్టిస్ అజిత్ ప్రకాష్ షా ‘రోసలిండ్ విల్సన్ స్మారక ఉపన్యాసం’లో తీవ్రాతి తీవ్రంగా విమర్శించారు. ఇది 2019 నాటిదైనా నేటి సందర్భానికి అతికినట్లు సరిపోతుంది.
మొట్టమొదటగా అంతర్గత వ్యవస్థ స్వభావం మీద ఆయన అస్త్రం ఎక్కుపెట్టారు. అది అనుసరించే పద్ధతులు ఎప్పటికప్పుడు తాత్కాలికంగా, ఇష్టాగోష్ఠిలా ఉంటాయి. ‘‘ఈ ప్రొసీజర్‌కు ఎలాంటి చట్టబద్ధ ప్రాతిపదిక లేదు’’. ‘‘ న్యాయ వ్యవస్థ లోపల దానికి ఉన్న మన్నన పరిమితం’’. ‘‘ఇందుకు నిదర్శనం – కమిటీ నివేదిక వ్యతి రేకంగా వచ్చిందని చెప్పి రాజీనామాకు సిద్ధపడిన న్యాయమూర్తి ఒక్క రంటే ఒక్కరూ లేకపోవటం...’’ అని ఆయన అంటారు.
‘‘న్యాయవ్యవస్థ దానికదే ఒక చట్టం, ఒక ప్రపంచం’’ అన్నట్లు అంతర్గత యంత్రాంగం పరిగణిస్తుందని జస్టిస్ షా మరీ ముఖ్యంగా ప్రస్తావించారు. వారిని వారే నియమించుకుంటారు. తమ ప్రవర్త నను నియంత్రించే విధివిధానాలను వారే అంతర్గతంగా రూపొందించుకుంటారు. ఇది ‘‘ఒక తరహా స్వీయపాలన’’ అంటూ, ‘‘ఏలాగైతే ఉండాలో కచ్చితంగా అందుకు భిన్నంగా ఉంది..’’ అని విమర్శించారు.
అంతర్గత యంత్రాంగం వాస్తవ పనితీరు ఎలా ఉంటుందో తెలిపేందుకు పలు విమర్శలు ఉన్నాయి. న్యాయమూర్తుల నడత గురించి బహిరంగంగా చెప్పుకున్న సందర్భాలు చాలానే ఉన్నా, వారిపై ఇన్–హౌస్ విచారణలు ఏనాడూ జరగలేదు. అలాగే, జడ్జీల మీద నిర్దిష్ట ఆరోపణలు చేసిన కేసుల్లోనూ అంతర్గత విచారణకు ఆదేశాలు లేవు.
న్యాయవ్యవస్థ జవాబుదారీతనం కోసం తటస్థమైన, అధికా రికమైన, చట్టబద్ధ యంత్రాంగం ఒకటి ఎందుకు ఉండాలో జస్టిస్ షా తీవ్ర పదజాలంతో వివరించారు. ‘‘న్యాయపీఠం మీద కూర్చున్న క్షణం నుంచీ వారి ప్రవర్తన ఎలా ఉండాలో నిర్దేశించే నైతిక వర్తన నియమావళి న్యాయమూర్తులకు మనసుల్లో పాతుకుపోయి ఉండాలి.
కాని అలా ఉండదు. కచ్చితంగా చెప్పాలంటే, వారు తమ ముందుండే లాయర్లు, వాదులు, ప్రతివాదులు, నేరస్థులు, సాక్షులు, పోలీసుల మాదిరిగానే ఫక్తు సాధారణ మానవులు. వారు నిర్వహించే పదవుల స్వభావాన్ని బట్టి వారికి నైతికతను ఆపాదిస్తే అది మోసం, ప్రమాదకరం...’’ అన్నారు.
న్యాయమూర్తుల నడత, ప్రవర్తన గురించి మాట్లాడుకుంటు న్నాం కాబట్టి, వారి ఎంపిక విధానం గురించిన ప్రశ్న తలెత్తక మానదు. కొలీజియం వ్యవస్థ పరిపూర్ణంగా పనిచేయడం లేదన డంలో సందేహం లేదు. మనకు వేరొక విధానం కావాలి. దాని గురించి మాట్లాడుకునే ముందు, ప్రస్తుత కొలీజియం వ్యవస్థ ఎక్కడ విఫలమైందో చూద్దాం.
జస్టిస్ షాతో నేను ఈ విషయం మాట్లాడినప్పుడు, ఆయన పలు అంశాలు చెప్పారు. మొదటిది – జడ్జీలను ఎంపిక చేయడానికి ఇవీ అంటూ చెప్పగలిగిన ఆమోదిత ప్రమాణాలేవీ లేవు. అంతా ‘‘అడ్ హాక్’’గా ఉన్నట్లు ఉంటుంది. నోటిమాట చెల్లుబాటు అవుతుంది. తరచూ ఇష్టులకే పెద్దపీట వేస్తారు.
ఎంపికల్లో అత్యుత్తములను నిర్లక్ష్యం చేయడం కూడా పరిపాటి. ఇది మరీ ఆందోళనకరం. కొట్టొచ్చినట్లు కనబడే రెండు ఉదాహ రణలు జస్టిస్ షా చెప్పారు. జస్టిస్ అకిల్ ఖురేషీ, జస్టిస్ మురళీధర్‌లు సుప్రీం కోర్టులో స్థానం పొందలేకపోయారని, సుప్రీంలో ప్రవేశించ డానికి వారు పూర్తిగా అర్హులని ఆయన విశ్వసిస్తారు.
ఎంపిక ప్రక్రియ నుంచి ప్రభుత్వాన్ని దూరం పెట్టడానికి కొలీజియం వ్యవస్థ రూపొందింది. అయినప్పటికీ ప్రభుత్వం తాను చేయగలిగినంతా చేయగలదు. పార్లమెంటులో మంచి మెజారిటీ ఉన్న ప్రభుత్వం కొలీజియం సిఫారసులను తొక్కిపట్టగలదు. అంటే ఏదైతే జరగకూడదన్న భావనతో కొలీజియం ఏర్పడిందో దొడ్డిదారిన అదే జరుగుతోంది.
ఏమైనప్పటికీ, హైకోర్టు జడ్జీల నియామక స్థాయిలో కొలీజియం వ్యవస్థ అత్యంత బలహీనమైనదని భావించాలి. ఇది ఆందోళనకర పరిస్థితి. ఎందుకంటే, సుప్రీంకోర్టులో బహుశా 95 శాతం మంది న్యాయమూర్తులు హైకోర్టు జ్యుడీషియరీ నుంచే ఎంపిక అవుతారు. హైకోర్టు జడ్జీల నియామకాలు లోపభూయిష్ఠంగా ఉన్నప్పుడు ఆ ప్రభావం సుప్రీం కోర్టు మీదా పడుతుంది.
చివరగా, మనం చర్చించిన రెండు సమస్యలూ... అంతర్గత యంత్రాంగం, నియామక విధానం... ఏమాత్రం అలక్ష్యం చేయదగి నవి కావు. ఈ అలక్ష్యం మన న్యాయవ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుంది. వాస్తవానికి వీటికి దేనికదిగా కాకుండా, రెంటికీ కలిపి పరిష్కారం ఆలోచించాలి. పాలక, న్యాయ వ్యవస్థల పరస్పర సహకారంతోనే ఇది సాధ్యమవుతుంది. మరి ఇందుకు అవి సిద్ధంగా ఉన్నాయా?
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్